
బాలీవుడ్ రీల్ నాన్నల రోల్ మారింది. ఆడపిల్లను గడపదాటనివ్వొద్దనే సంప్రదాయపు ఆలోచన నుంచి తేరుకొని అమ్మాయి కోరుకుంటే చదువు కోసం విదేశాలకూ పంపాలనే ప్రాక్టికల్ థీమ్‌లోకి వచ్చింది. కాలం మారింది. కథలనూ మార్చాలి. లేదా మారిన కథలతో కాలాన్ని ప్రభావితం చేయాలి. అత్తింట్లో ఆడపిల్లకు గౌరవం దక్కాలంటే ముందు మన ఇంట్లో ఉన్న ఆడపిల్ల తల్లికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ విషయంలో కొడుకు, కూతురికి తండ్రే రోల్ మోడల్ అని గ్రహించింది. అందుకే ఇదిగో ఈ సినిమాలను తెరమీదకు తెచ్చింది. పిల్లలకు స్నేహాన్ని పంచే తండ్రులను పరిచయం చేస్తోంది.
అంగ్రేజీ మీడియం
చంపక్ బన్సల్ సాదాసీదా మనిషి. ఉదయ్‌పూర్‌లో స్వీట్‌షాప్ ఓనర్. కూతురే అతని లోకం. తల్లిలేని ఆ పిల్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ కళ్లముందే పెట్టుకుంటాడు చంపక్. కానీ కూతురు తారికకు లండన్‌లో చదవాలనేది లక్ష్యం. ఇష్టంలేకపోయినా కన్నబిడ్డ కల కోసం తారికను లండన్‌కు పంపిస్తాడు. బతకడం నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తాడు. కష్టనష్టాల్లో అండగా నిలబడ్తాడు ఆ తండ్రి.
థప్పడ్..
‘నాక్కొంచెం ఊరట కావాలి నాన్నా.. ఇక్కడ కొన్నాళ్లుంటా’ అంటూ సూట్‌కేస్‌తో పుట్టింటికి చేరిన కూతురు అమృత (తాప్సీ) గుండెలో పొదువుకున్నాడు తండ్రి సచిన్ సంధు (కుముద్ మిశ్రా). ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించకుండా. ‘ఆ మనిషి మారేలా లేడు నాన్నా.. విడాకులు తీసుకుంటా’ అంటే ‘చిన్న చెంప దెబ్బకే విడాకుల దాకా ఎందుకమ్మా సర్దుకుపో’ అంటూ సలహా ఇవ్వలేదు. భార్యను తను గౌరవిస్తాడు కాబట్టి కూతురి బాధను అర్థం చేసుకున్నాడు. బిడ్డ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నానికి ఓ ఫ్రెండ్‌లా సపోర్ట్ చేస్తాడు.
ఏక్ లడ్‌కీ కో దేఖాతో ఐసా లగా
బల్బీర్ చౌదరి (అనిల్ కపూర్) చాదస్తపు తండ్రి. షెఫ్ కావాలనుకున్న బల్బీర్‌ను అతని తల్లి ‘మగాడు వంట చేయడమేంటి అసహ్యంగా’ అని చీదరించుకొని గార్‌మెంట్స్ షాప్ ఓనర్ అయ్యేలా చేస్తుంది. అలా తల్లి నుంచే చాదస్తపు వాసనలు ఒంటబడ్తాయి బల్బీర్‌కు. అతని కూతురు స్వీటీ. ఓ పెళ్లిలో ఒక అమ్మాయిని చూసి మనసు పారేసుకొని తన సెక్సువల్ ఐడెంటిటీని బయటపెడుతుంది. అతను పెరిగిన తీరు అతణ్ణి షాక్‌కు గురిచేసినా.. కూతురి మానసిక సంఘర్షణ అతనిలో ఆలోచనను రేకెత్తిస్తుంది. ప్రిజుడీస్‌ను వదిలి బిడ్డను బిడ్డలా స్వీకరించే తండ్రిగా మారతాడు. కూతురు చేయి పట్టుకొని పెళ్లిమండపంలోకి తీసుకెళ్తాడు.. ఇంకో అమ్మాయితో పెళ్లి జరిపించడానికి.
దంగల్
తల మీద కొంగు లేకుండా కనిపించకూడదని ఆడవాళ్ల మీద ఆంక్షలున్న చోట తన కూతుళ్లకు పెహల్వాన్లుగా తర్ఫీదునిస్తాడు కుస్తీ వీరుడైన తండ్రి మహావీర్ సింగ్ ఫోగట్. వాళ్లు మహా యోధులుగా ప్రపంచ కీర్తిని సాధించి ఆ ప్రాంతంలోని తల మీద కొంగు సంప్రదాయానికి చెక్ పెడతారు. అలా రెజ్లింగ్ రింగ్స్ ఆడపిల్లలకు కాళ్ల పట్టీల్లాంటివనే కొత్త ఫ్యాషన్‌ను స్థిరపర్చాడు మహావీర్. అమ్మాయిల్లో ఆ క్రీడపట్ల ప్యాషన్‌ను డెవలప్ చేశాడా తండ్రి.
Comments
Please login to add a commentAdd a comment