కపిల్ బయోపిక్‌లో సల్మాన్?
ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. సెలబ్రిటీల నిజ జీవితాలతో తీసే కథలను ప్రేక్షకులు ఆదరిస్తుండటంతో దర్శక-నిర్మాతలు ఈ తరహా చిత్రాలు తీసేందుకు ముందడుగు వేస్తున్నారు. క్రికెటర్లను తెగ ఆరాధించే అభిమానులకు తమ అభిమాన ఆటగాళ్ల బయోపిక్‌లంటే అమితమైన ఆసక్తి. ఇప్పటికే బాలీవుడ్‌లో భారత క్రికెట్ కెప్టెన్లు అజారుద్దీన్ బయోపిక్‌గా ‘అజార్’, ధోనీ బయోపిక్‌గా ‘ఎంఎస్ ధోనీ’ ప్రేక్షకుల ముందుకొచ్చాయి.
మరో స్టార్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్రతో దర్శకుడు జేమ్స్ ఎర్స్‌కిన్ ‘సచిన్’ పేరుతో ఓ సినిమా తీస్తున్నారు. ఇందులో సచిన్ లీడ్ రోల్ చేస్తుండడం విశేషం. తాజాగా భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ పై బాలీవుడ్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. కపిల్ నేతృత్వంలో భారత జట్టు 1983లో ప్రపంచ కప్ గెలుచుకుంది. ఆ అపురూపమైన ఘట్టం ఆధారంగా ఓ చిత్రం చేయనున్నట్లు దర్శకుడు కబీర్ ఖాన్ ప్రకటించారు. దీంతో ఆయన జీవిత చరిత్రలో ఒదిగిపోయే నటుడు ఎవరు? అనే చర్చ బీటౌన్‌లో మొదలైంది.
ముందుగా ఇందులో కపిల్ పాత్రను అర్జున్ కపూర్ చేస్తారనే వార్త వినిపించింది. తాజాగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ పేరు సీన్లోకొచ్చింది. ప్రస్తుతం సల్మాన్ హీరోగా కబీర్‌ఖాన్ ‘ట్యూబ్‌లైట్’ మూవీ తీస్త్తున్నారు. సల్మాన్‌తో ‘ఏక్ థా టైగర్’, ‘భజరంగీ బాయ్‌జాన్’ చేసిన కబీర్, తాజాగా ‘ట్యూబ్‌లైట్’ చేస్తున్నారు. కాబట్టి హీరో, దర్శకుడి మధ్య మంచి అవగాహన ఏర్పడి ఉంటుంది. సో.. ఈ బయోపిక్‌లో సల్మాన్ నటించే చాన్సే ఎక్కువగా కనిపిస్తోంది.