మతపరమైన వ్యాఖ్యలు: సల్మాన్పై కేసు
ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినందుకు బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ఖాన్పై మహారాష్ట్రలో కేసు నమోదైంది. ఆల్ ఇండియన్ ఖ్వామీ తన్జీమ్ విదర్భ యూనిట్ అధినేత మహ్మద్ అలీ చేసిన ఫిర్యాదు మేరకు సల్మాన్ మీద ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సల్లూభాయ్ కావాలనే చేసిన వ్యాఖ్యల వల్ల, పనుల వల్ల మతపరమైన విద్వేషాలు చెలరేగే ప్రమాదం ఉందని, ఒక మతాన్ని, లేదా ఒక మతస్థుల నమ్మకాలను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని సదరు ఫిర్యాదులో పేర్కొన్నారు.
సల్మాన్ ఏర్పాటుచేసిన 'బీయింగ్ హ్యూమన్' అనే స్వచ్ఛంద సంస్థ ముంబైలో ఒక ఫ్యాషన్ షో నిర్వహించింది. ఆ షోలో ఒక మోడల్ 'అల్లా' అని అరబిక్ భాషలో తన డ్రస్సు మీద రాసుకుని ర్యాంపు మీద నడిచింది. సల్మాన్ ఖాన్ మీద కేసు నమోదు చేశామని, ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉందని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఫ్యాషన్ షోకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను కూడా అలీ పోలీసులకు సమర్పించారు.