
పొరుగుదేశంలోనూ కలెక్షన్ల వర్షం!
రంజాన్ బహుమతిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్ ఖాన్ సినిమా బజరంగీ భాయీజాన్ మన దేశంలోనే కాక, పొరుగు దేశమైన పాకిస్థాన్లో కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి వారంలో కరాచీ, ఇస్లామాబాద్ రెండు నగరాల్లోనే దాదాపు 30 లక్షలు వసూలు చేసింది. ఇదే సమయంలో విడుదలైన పాకిస్థానీ సినిమాలు 'బిన్ రోయే', 'రాంగ్ నంబర్' లాంటి సినిమాలను వెనక్కి నెట్టి మరీ ఈ కలెక్షన్లు సాధించింది.
మొదటివారంలో బజరంగీ సినిమాకు 32 లక్షల రూపాయలు రాగా, బిన్ రోయే సినిమాకు 28 లక్షలు, రాంగ్ నంబర్కు 27 లక్షలు వచ్చాయి. హాలీవుడ్ సినిమాలు మినియన్స్, టెర్మినేటర్: జెనెసిస్, యాంట్ మ్యాన్ లాంటి వాటికి అసలు ఆదరణే కరువైంది. వాస్తవానికి ఈ సినిమా పాకిస్థాన్లో విడుదల కావడం చాలా కష్టమైంది. అయినా ఇప్పుడు అక్కడి ప్రేక్షకులు మాత్రం సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.
ఇక భారతదేశంలో అయితే సినిమా రికార్డులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మొదటి వారంలో ఈ సినిమా రూ. 184.62 కోట్లు వసూలు చేసింది.