శామ్ మెండెస్,టామ్ హిడెల్‌స్టెన్
కొత్త జేమ్స్ బాండ్ చిత్రానికి సరికొత్త టీమ్ రెడీ అవుతోంది. ‘క్యాసినో రాయల్’ నుంచి ఇటీవల వచ్చిన ‘స్పెక్టర్’ సినిమా వరకూ బాండ్‌గా నటించిన డేనియల్ క్రెగ్ ఇక తాను ఆ పాత్ర చేయలేనని చెప్పడంతో మరో హాలీవుడ్ నటుడు టామ్ హిడెల్‌స్టెన్‌ని బాండ్‌గా ఎంపిక చేశారని వార్తలు కూడా వచ్చాయి. అయితే కొత్త బాండ్‌గా టామ్ నటించే అవకాశం లేదని ‘స్కైఫాల్’, ‘స్పెక్టర్’ వంటి బాండ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన శామ్ మెండెస్ చెప్పారు. అంతే కాకుండా ఇక తదుపరి బాండ్ చిత్రాలకు తాను కూడా దర్శకుణ్ణి కాదని ఆయన ప్రకటించడం విశేషం.
‘‘నాకు ఎప్పటికప్పుడు కొత్త పాత్రలతో, సరికొత్త కథాంశాలతో సినిమాలు చేయా లని ఉంటుంది. ఆ కారణంగానే నెక్ట్స్ బాండ్ చిత్రానికి నో చెప్పేశాను. టామ్‌ని కూడా బాండ్‌గా తీసుకునే ఉద్దేశం నిర్మాతలకు లేదు. బాండ్‌గా ఎవరూ ఊహించని నటుణ్ణి ఎంపిక చేసే అవకాశం ఉంది’’ అని శామ్ పేర్కొన్నారు. మరి... కొత్త బాండ్ చిత్రానికి డెరైక్టర్ ఎవరు? బాండ్‌గా ఎవరు నటిస్తారు? అనేది అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదు. ఏదేమైనా కొత్త టీమ్‌తో నెక్ట్స్ జేమ్స్‌బాండ్ మూవీ ఇప్పటివరకూ వచ్చిన బాండ్ చిత్రాలకు భిన్నంగా, కొత్తగా ఉంటుందని ఆశించవచ్చు.