భలే గిరాకీ
ఏ హీరోయిన్‌కు ఎప్పుడు ఏ భాషలో గిరాకీ పెరుగుతుందో చెప్పడం కష్టం. నిజానికి ఆయా హీరోయిన్లకే తెలియదు. ఆదిలో ఐరన్‌లెగ్ ముద్ర వేసిన వారే ఆ తరువాత ఆ నటికి బ్రహ్మరథం పడతారు. ఈ తరం కథానాయికలను తీసుకుంటే కోలీవుడ్‌లో అనుష్క, తమన్నా, ఇలి యానా, కాజల్ అగర్వాల్ తదితరులు మొదట్లో ఐరన్‌లెగ్ ముద్ర పడిన వారే. ఇప్పుడు వాళ్లంతా క్రేజీ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు. సమంత కూడా ఈ కోవకు చెందిన హీరోయినే. ఈ చెన్నై సుందరి మాస్కో ఎన్ కావేరి, బానా కాత్తాడి, నడునిశి నాయ్‌గళ్ (గెస్ట్) చిత్రాల్లో నటించినా ఆశించిన విజయాలు సాధించలేదు. అయితే ఏ మాయ చేశావే చిత్రంతో టాలీవుడ్‌లో ప్రవేశించారు.
ఆ చిత్రం సమంత తలరాతను మార్చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరయ్యారు. మొదట్లో ఐరన్‌లెగ్ ముద్ర తగిలించిన కోలీవుడ్ ఇప్పుడు సమంతకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. తాజాగా సూర్య సరసన నటిస్తున్న సమంతకిప్పుడు గిరాకీ పెరిగిపోయింది. త్వరలో విజయ్ సరసన ఒక చిత్రం చేయనున్నారు. మరో యువ నటుడు ధనుష్‌తోనూ రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. మరికొన్ని అవకాశాలు ఈ అమ్మడి కోసం ఎదురు చూస్తున్నాయని తెలుస్తోంది. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమంతను ఎంపిక చేస్తే తమిళం, తెలుగు భాషల్లో తమ చిత్రాలకు క్రేజ్ పెరుగుతుందని తమిళ హీరోలు భావించడంతో ఈ బ్యూటీ గిరాకీ పెరుగుతోందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.