
మహానటిసావిత్రిగా...
తెలుగుతెరపై కథానాయికల ప్రస్తావన వస్తే... సావిత్రికి ముందూ, సావిత్రికి తర్వాత అనే స్థాయిలో ఆ మహానటి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. అందంలోనూ, అభినయంలోనూ సావిత్రికి ఎవరూ సాటి రాలేరని ఆమె అభిమానులు చెబుతుంటారు. ఇప్పటికీ ఎవరైనా కథానాయిక అద్భుతంగా నటిస్తే ఆమెతో పోలుస్తారు. అటువంటి మహానటి జీవితకథ ఆధారంగా సినిమా తీయనున్నట్టు ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పినప్పట్నుంచీ సావిత్రిగా ఎవరు నటిస్తే బాగుంటుందనే చర్చ మొదలైంది.
ఆ అదృష్టం సమంతకు దక్కిందని ఫిల్మ్‌నగర్ టాక్. ‘‘తెలుగులో కొత్త చిత్రాలకు సంతకం చేశా. అవేంటో ఇప్పటికిప్పుడు చెప్పేయాలనిపిస్తోంది’’ అని ఇటీవల సమంత పేర్కొన్నప్పటికీ, అసలు విషయం చెప్పలేదు. ఆమె పేర్కొన్న చిత్రాల్లో ‘సావిత్రి’ జీవితకథ ఒకటని సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుమార్తెలు ప్రియాంకా దత్, స్వప్నా దత్ నిర్మించనున్నారు. అన్నట్లు.. నాగ అశ్విన్, ప్రియాంకా దత్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.