
సమీరా రెడ్డి
‘‘సినిమా స్టార్స్‌ని చూసి అలానే ఉండాలనే ఆలోచనను సమాజం ఏర్పరచుకుంది. దీని ద్వారా చాలా మంది అనవసరమైన ఒత్తిడిని కొనితెచ్చుకుంటున్నారు. ఈ ఆలోచనా ధోరణిని బద్దలు కొట్టాలనుకుంటున్నాను’’ అన్నారు సమీరా రెడ్డి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె విమర్శలు ఎదుర్కొంటున్నారు. దానికి కారణం ఈత కొలనులో ఫొటోషూట్ చేయించుకోవడమే. గర్భంతో ఉండి, ఇలా పొట్ట కనిపించేట్లు ఫొటోలు దిగుతారా? అని కొందరు సమీరాను విమర్శిస్తున్నారు. ఈ విమర్శలకు సమీరా సమాధానం ఇచ్చారు.
‘అసంపూర్ణమైన సంపూర్ణం’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో తన ఆలోచనలను పంచుకున్నారామె. రెండోసారి తల్లి కాబోతున్న సమీరా రెడ్డి బాడీ పాజిటివిటీ, మనల్ని మనం ప్రేమించుకోగలగడం, మూస ధోరణి ఆలోచనల గురించి అవగహన కలిగించాలనుకున్నారు. ఈ విషయాల గురించి తన అభిప్రాయాలను పంచుకుంటూ – ‘‘బాడీ షేమింగ్ ఎదుర్కొన్నవాళ్ల కోసమే అండర్ వాటర్ ఫొటోషూట్ చేసుకున్నాను. ఇంతకు ముందు బికినీ ధరించాలంటే ఎంతో ఆలోచించేదాన్ని. ఎన్నో ఆలోచనలు.
కానీ తొమ్మిదో నెల ప్రెగ్నెంట్‌గా ఉంటూనే బికినీలో ఎంత కంఫర్ట్‌బుల్‌గా ఉన్నానో చెప్పలేను. మొదటిసారి గర్భవతిని అయినప్పుడు నా వంతు ట్రాలింగ్ (విమర్శలు) ఎదుర్కొన్నాను. ‘ప్రెగ్నెంట్ అయినప్పుడు సమీర బరువు పెరిగింది. గ్లామర్ తగ్గింది’ అనే కామెంట్స్ విన్నాను. కానీ ఈసారి దాన్ని పట్టించుకోదలుచుకోలేదు. వాటిని తిప్పికొట్టి కాన్ఫిడెంట్‌గా ఉండాలనుకున్నాను. మన శరీరాన్ని మనమే అంగీకరించకపోతే ఎలా? అన్ని వయసుల ఆడవాళ్లకు చెప్పేది ఏంటంటే.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ శరీరతత్వాన్ని అర్థం చేసుకొని, అంగీకరించండి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment