భావోద్వేగాలతో తెరకెక్కిన రణ్‌బీర్ కపూర్ ‘సంజు’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సీనియర్ నటుడు సంజయ్ దత్ బయోపిక్ కావటంతో ఆయన జీవితంలోని ఆసక్తికర కోణాలను తెలుసుకునేందుకు కొందరు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో సంజూ బాబా పాత వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. అందులో తన తల్లి చనిపోయిన సమయంలో తాను ఎలా ప్రవర్తించిందనేది చెబుతూ భావోద్వేగానికి లోనైన ఇంటర్వ్యూ ఒకటుంది.
90వ దశకంలో తీసిన ఆ ఇంటర్వ్యూలో సంజయ్ చెప్పిన మాటలు... ‘నా తల్లిది చాలా మంచి మనస్తత్వం. సెట్స్‌లో అందరితోనూ మంచిగా మెలిగేది. ఆమె చనిపోయినప్పుడు నేను ఎలాంటి ఎమోషన్లను చూపించలేకపోయా. కనీసం ఏడవలేదు కూడా. రెండేళ్ల తర్వాత కుటుంబ సభ్యులతో గ్రూప్‌గా కూర్చున్న సమయంలో హఠాత్తుగా ఓ ఆడియో క్లిప్ ప్లే అయ్యింది. అందులో ఉంది నా తల్లి వాయిస్. (బ్యాక్ గ్రౌండ్‌లో నర్గీస్‌దత్ గొంతు వినిపించింది...)... ‘అది విన్నాక ఆమెకు నా మీద ఎంత ప్రేమ ఉందో?.. ఎంత జాగ్రత్తలు తీసుకుందో? తను నా గురించి ఏం కోరుకుందో? అప్పుడు నాకు అర్థమైంది. అంతే నా ప్రమేయం లేకుండా కళ్లలోంచి నీళ్లు వచ్చేశాయి. అలా నాలుగైదు గంటలు ఏడ్చుకుంటూ ఉండిపోయా. తప్పో.. ఒప్పో.. అన్నీ నాలోనే ఉంటాయి. వాటిని బయటకు తీసినప్పుడే మారినమనిషిని అవుతాను’ సంజు ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. సంజు డెబ్యూ చిత్రం రాకీకి కొద్ది రోజుల ముందే నటి, సునీల్ దత్ సతీమణి నర్గీస్ దత్ చనిపోవటం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment