
శంకర్ సఫలమయ్యేనా?
బ్రహ్మాండ చిత్రాలకు చిరునామా దర్శకుడు శంకర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన చిత్రాల్లో వైవిధ్యం ఉంటుంది. కొత్తదనానికి కొరతేముండదు. భారీ తనం గురించి చెప్పనక్కర్లేదు. సమాజానికి ఉపయోగపడే చక్కని సందేశం ఉంటుంది. మొత్తం మీద శంకర్ దర్శకత్వ శైలే సెపరేటు. అందుకే ఆయన స్టార్ దర్శకుడయ్యారు. శంకర్ తొలి చిత్రం జెంటిల్‌మెన్ నుంచి ఆ మధ్య విడుదలయిన నన్బన్ చిత్రం వరకు ఒక్కసారి పరిశీలిస్తే ఒక చిత్ర ఛాయలు మరో చిత్రంలో కనిపించవు. శంకర్ భారీగా ఖర్చు పెట్టేశారంటారు. అయితే ఆయన ఖర్చు చేసే ప్రతి రూపాయి విలువ వెండితెరపై కనిపిస్తుంది. అందుకే ఆయన చిత్రాలు ప్రేక్షకలను కనువిందు చేస్తాయి.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడంలో శంకర్‌ది అందేవేసిన చెయ్యి. అందుకే ఆయన చిత్రాలు వీక్షకులను అబ్బుర పరుస్తాయి. నిర్మాతకు గల్లాపెట్టెలు నింపుతాయి. వారు శంకర్ చిత్రాలకు కోట్లు ఖర్చు చేయడానికి ఏ మాత్రం వెనుకాడకపోవడానికి కారణం కూడా ఇదే. శంకర్ చిత్రాలు నిర్మాణంలో ఆలస్యం అయినా అర్థవంతంగానూ, అందంగానూ, అద్భుతంగానూ ఉంటాయి. అలాంటి దర్శక సవ్యసాచి ప్రస్తుతం తన ఐక్యూను ఐ చిత్రంపై ఎట్టారు. విక్రమ్, ఎమీజాక్సన్‌లు నాయకీ నాయకులుగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి.
అన్నియన్ తరువాత ఈ ఐ చిత్రం ద్వారా నటుడు విక్రమ్‌ను మరో కోణంలో అద్భుతంగా ఆవిష్కరించనున్నారు. ఈ దర్శక శిల్పి తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. తన స్థాయిని పెంచుకుంటూ పోతున్న శంకర్ తన తాజా చిత్రానికి బడ్జెట్‌ను రూ.150 కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాదు రజనీ, కమల్ హాసన్‌ల తరువాత ఆ స్థాయిలో వెలుగొందుతున్న విజయ్, అజిత్‌లను ఈ చిత్రంలో హీరోలుగా నటింపజేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. ఇందులో ఆయన ఎంత వరకు సఫలం అవుతారో వేచి చూడాల్సిందే.