నేను కోమాలోకి వెళ్లిపోతానేమోనని భయం వేసింది : విక్రమ్
మూడేళ్లు ఒకే సినిమాకు పని చేయడం, ఆ సినిమాలో పాత్రల కోసం తన శరీరాన్ని హింసించుకోవడం ఒక్క విక్రమ్‌కే చెల్లిందేమో. శంకర్ తీసిన ‘ఐ’ కోసం విక్రమ్ 24/7 ఇష్టపడుతూ కష్టపడ్డారు. ఆ కష్టాల గురించి విక్రమ్ చెబుతుంటే నిజంగా ఎవ్వరికైనా ఇతనికి పిచ్చెక్కిందా అనిపిస్తుంది. విక్రమ్ మాటల్లో ఆయన కష్టాల అధ్యాయం...
శంకర్ ‘ఐ’ కథ చెప్పగానే అదిరిపోయాను. అందులో నేను మూడు పాత్రలు చేయాలి. రెండు పాత్రల్ని గ్రాఫిక్స్‌లో చేసేద్దామన్నారు. నేనస్సలు ఒప్పుకోలేదు. నేనే చేస్తా అని మొండిగా చెప్పా. పాతిక కేజీలు బరువు తగ్గి, మళ్లీ బరువు పెరగడమంటే చాలా కష్టమని శంకర్ ఎంత చెప్పినా వినలేదు. నేను ఎంత కష్టమైనా భరించడానికి రెడీ అయ్యా.
రోజూ మూడు పూటల్లా వ్యాయామం. అది కూడా ఉదయం మూడు గంటలు, మధ్యాహ్నం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు. దాదాపుగా నోరు కుట్టేసుకున్నాను. అప్పుడు నా ఆహారం... కేవలం చిన్న యాపిల్. ఇలా ఏడాది పాటు చేశా. దాంతో రోగిష్టిలా తయారయ్యా. నన్ను చూసి మా ఇంట్లో వాళ్లే కాదు, డాక్టర్లూ భయపడిపోయారు. మొదట్లో రెండు వారాలకోసారి వైద్య పరీక్షలు జరిపితే, తర్వాత వారినికోసారి చేయాల్సి వచ్చేది. శరీరంలో బి.పి., షుగర్త్ సహా అన్ని లెవెల్స్ పడిపోయాయి.
ఇక మేకప్‌కైతే సుమారు నాలుగు గంటలు పట్టేది. మేకప్ వేసేటప్పుడు మొహం కందిపోయి బొబ్బలు వచ్చేసేవి. స్ప్రే, సిగరెట్, పెయింట్, ధూళి... ఇలా ఏ వాసన వచ్చినా భళ్లున వాంతి వచ్చేసేది. ఊపిరి ఆగినంత పనయ్యేది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారేది. నేను కోమాలోకి వెళ్లి పోతానేమోనన్న భయం వేసేది. ఏదేమైనా ఓ అంతర్జాతీయ స్థాయి సినిమాలో నటించినందుకు గర్వపడుతున్నాను.