త్రిష కోరిక తీరేనా?
కలలు కనండి. వాటిని నెరవేర్చుకోవడానికి కృషి చేయండి అన్న మన జాతి రత్నాల్లో ఒకరైన అబ్దుల్ కలాం మాటలు అక్షరాలా పాటించే పనిలో పడ్డారు నటి త్రిష. ఏమిటామె కల? అందుకు ఇంత ఉపమానం అవసరమా? అనేగా మీ ప్రశ్న. బిల్డప్ కాస్త ఎక్కువైనా, త్రిష కల కనడం మాత్రం నిజమే. మూడు పదుల వయస్సు మీద పడిన ఈ చెన్నై చిన్నది సంచలనాలకు చిరునామా అన్నది తెలిసిందే.ప్రేమ వ్యవహారాలు ఎలా ఉన్నా నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్‌మణియన్‌తో మాత్రం వ్యవహారం పెళ్లి వరకూ వచ్చి బెడిసి కొట్టింది.
నిజానికి అప్పటి వరకూ నత్త నడకనడిచిన ఆమె నట జీవితం ఆ తరువాతే జెట్ స్పీడ్ అందుకుంది. కమలహాసన్‌కు జంటగా తూంగావనం, సిద్ధార్ధ్‌తో అరణ్మణై-2, హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం నాయకి ఇలా వరుసగా అవకాశాలు త్రిషను ఉక్కిరిబిక్కిరి చేశాయి. నటిగా తమిళం, తెలుగు, కన్నడం, హిందీ అంటూ పలు భాషల్లో తనదైన ముద్రవేసుకున్న త్రిష అన్ని భాషల్లోనూ స్టార్ కథానాయకులతో జత కట్టారు. ముఖ్యంగా కోలీవుడ్‌లో కమలహాసన్, విజయ్, అజిత్, విక్రమ్, సూర్య, విశాల్, జయంరవి వారందరితోనూ జత కట్టారు. ఒక్క సూపర్‌స్టార్‌తో మినహా.
ఎస్ రజనీకాంత్‌తో నటించే అవకాశం ఆమెకు ఇంత వరకూ రాలేదు. సూపర్‌స్టార్‌కు జంటగా నటించాలన్నది త్రిష చిరకాల వాంఛ అట. ఈ విషయాన్ని ఆమె చాలా సార్లు వెల్లడించారు.అయితే ఆ అవకాశం త్వరలోనే వస్తుందనే ఆశాభావాన్ని త్రిష వ్యక్తం చేశారు.రజనీకాంత్‌తో నయనతార చంద్రముఖి, కుచేలన్, శివాజీ(ఒక పాటలో)నటించారు. అలాగే శ్రీయ శివాజీ చిత్రంలోనూ, ఐశ్వర్యరాయ్ ఎందిరన్‌లోనూ,దీపికాపదుకొనే కోచ్చడైయాన్ చిత్రంలోనూ, అనుష్క, సోనాక్షి సిన్హా లింగా చిత్రంలోనూ జత కట్టారు. ఇలా మాలీవుడ్, బాలీవుడ్ భామలు సూపర్‌స్టార్‌తో నటించే అవకాశాలను దక్కించుకుంటుంటే తమిళ నటి అయిన త్రిషకు అలాంటి అవకాశం రాక పోవడం దురదృష్టకరమనే చెప్పాలి.
అయితే దాన్ని అదృష్టంగా మార్చుకునే ప్రయత్నంలో త్రిష ఉన్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం కబాలీ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న రజనీ వెంటనే శంకర్ దర్శకత్వంలో ఎందిరన్-2 కు సిద్ధమతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ల ఎంపిక విషయంలోనూ దృష్టి సారించారు. శంకర్ ఇప్పటికే ఒక నాయకిగా నటి ఎమీజాక్సన్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా మరో హీరోయిన్‌కు చాన్స్ ఉండడంతో దాన్ని దక్కించుకోవడానికి త్రిష కాస్త తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్లు కోలీవుడ్ టాక్.