తాత పేరు టైగర్ పటౌడి.ఆయన పటౌడి నవాబు.తండ్రి సైఫ్ అలీ ఖాన్. చిన్న నవాబు.లెక్కప్రకారం తను యువరాణిపటౌడి పరగణాకి.కాని అలా జరగలేదు.తల్లి తండ్రి విడిపోయారు.తల్లితో బతకాల్సి వచ్చింది.
కాని ఖాన్‌దాన్‌ను నిలబెట్తే సత్తాతనకే ఉందని నిరూపించుకుంది.ఇవాళ పటౌడి సంస్థానం ఆమెను చూసి గర్వపడుతోంది.
తల్లి అమృతా సింగ్: అమృతా సింగ్ అంటే ‘బేతాబ్’ హీరోయిన్. సన్ని డియోల్‌తో కలిసి ఆమె 1983లో మొదటిసారి వెండితెర మీద కనిపించినప్పుడు ప్రేక్షకులు ఆమె గ్లామర్‌కు దాసోహం అయ్యారు. ఆ తర్వాత ఆమె ‘సాహెబ్’, ‘మర్ద్’, ‘చమేలీ కి షాదీ’ వంటి పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చారు. అమృతా సింగ్ కోసం బాలీవుడ్ హీరోలు చాలామంది ప్రేమలేఖలు చేతిలో పట్టుకుని తిరుగుతూ ఉండేవారు. కాని అమృతా సింగ్‌కు క్రికెట్ అంటే ఇష్టం. క్రికెటర్ రవిశాస్త్రి మరీ ఇష్టం. వారి మధ్య ప్రేమ నడిచింది. రవిశాస్త్రి గ్రౌండ్‌లో ఫోర్ కొట్టినప్పుడల్లా కెమెరా వైపుకు తిరిగి గాలిలో చూపుడు వేలితో ‘డి’ అక్షరం రాసేవాడు. ‘డి’ అంటే డింగీ అని అర్థం. ఇది బేతాబ్‌లో అమృతా సింగ్ ముద్దుపేరు.
తండ్రి సైఫ్ అలీ ఖాన్: సైఫ్ అలీ ఖాన్ టైగర్ పటౌడి కుమారుడు.నటి షర్మిలా టాగూర్ ముద్దుల కొడుకు. అతడు టైగర్‌లా క్రికెటర్ కావచ్చు. కాని లండన్‌లో చదువుకున్నాక తల్లిలా సినిమా రంగానికి వద్దామనుకున్నాడు. పటౌడీ యువరాజు సినిమా రంగంలో వస్తానంటే కాదనేవారెవరు. షర్మిలా టాగోర్ దగ్గరుండి అతణ్ణి సినిమాల్లో 1993లో ప్రవేశ పెట్టింది. ‘మై ఖిలాడీ తూ అనాడీ’, ‘కచ్చేధాగే’, ‘హమ్ సాత్ సాత్ హై’ లాంటి ఒకటి రెండు సినిమాలు హిట్ కావడం తప్పితే పెద్దగా బ్రేక్ రాలేదు. కెరీర్ అగమ్యగోచరంగా ఉంది.
కుటుంబం: అయితే సైఫ్ అలీ ఖాన్ సినిమాల్లోకి రాక ముందే అమృతా సింగ్ ప్రేమలో పడ్డాడు. చదువు ముగించుకుని ముంబై వచ్చాక అమృతా సింగ్ సినిమాలు చూసి ఆమె కాంటాక్ట్ సంపాదించి పొగడటం మొదలుపెట్టాడు. చాలాసార్లు ఆమె ఫ్లాట్‌కు వెళ్లి డిన్నర్‌కు తీసుకువెళ్లేవాడు. సైఫ్ అమృతా సింగ్ కంటే 12 ఏళ్లు చిన్నవాడు. మొదలు ఇదంతా ఆటగా ఉండేది. కాని రాను రాను అమృతా అతడి ఆకర్షణలో పడింది. అమృతా సింగ్ కెరీర్ అప్పటికే పదేళ్లు ముగించుకోవడంతో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉండగా ఊపిరి సలపనివ్వక సైఫ్ ఆమె వెంట పడ్డాడు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుందామనుకోవడం పెద్ద దుమారం రేపింది. సైఫ్ ఇంట్లో ఈ పెళ్లి సుతరామూ ఇష్టం లేదు. అందరినీ ఎదిరించి ఈ పెళ్లి చేసుకున్నాడు. అది నిలవదని చాలామంది జోస్యం చెప్పారు. కాని 1991లో పెళ్లయితే 2004 వరకు ఆ పెళ్లి నిలిచింది. కూతురు సారా అలీ ఖాన్, కొడుకు ఇబ్రాహీమ్ అలీ ఖాన్... మొత్తం నలుగురు సభ్యుల కుటుంబం కళకళలాడింది. కాని 2004లో విడాకులతో చెదిరిపోయింది.
సారా అలీ ఖాన్: తల్లిదండ్రులు విడిపోయే సమయానికి సారాకు 9 సంవత్సరాలు. తమ్ముడు నాలుగేళ్ల చిన్నపిల్లవాడు. 2001లో వచ్చిన ‘దిల్ చాహ్‌తాహై’ సినిమా ఈ విడాకులకు పరోక్ష కారణం అని చెప్పవచ్చు. ఆ సినిమాతో సైఫ్ అలీ ఖాన్ స్టార్‌డమ్‌కు చేరుకున్నాడు. బిజీ అయిపోయాడు. కొత్త ఆకర్షణలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో కుటుంబం నుంచి దూరం కాసాగాడు. ఇది తట్టుకోలేని అమృతా సింగ్ విడాకులకు సిద్ధమైంది. కాని విడాకులు తీసుకున్నాక అతని నీడ పిల్లల మీద పడకూడదు అన్నంత పంతంగా వ్యవహరించింది. చాలా రోజులు సారా తల్లే లోకంగా పెరిగింది. నిజానికి త్యాగమంతా అమృతాదే. పెళ్లి చేసుకున్నాక సైఫ్ కోసం సినిమా కెరీర్ వదిలేసింది. విడాకుల తర్వాత పిల్లల కోసం సినిమాలను వద్దనుకుంది. తల్లి వేదనకు సారా సాక్షిగా నిలిచింది. కాని తండ్రితో అనుబంధం కోసం ఎఫర్ట్ పెట్టింది. అమృతాకు ఇష్టం లేకపోయినా తండ్రితో ఆమె అనుబంధం పునరుద్ధరించుకోగలిగింది. అమృతా చేసిన గారాలు ఆమెకు స్థూలకాయం తెచ్చాయి. న్యూయార్క్ కొలంబియా యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్లే సమయానికి ‘పాలిసిస్టిక్ ఓవరి సిండ్రోమ్’ బారిన పడటంతో దాని వల్ల కూడా లావు అయిపోయింది. వీటన్నింటి మధ్య ఆమెను ఉత్సాహంగా ఉంచింది ఒకే ఒక కల. హీరోయిన్ కావడం.
కల: సారా అలీ ఖాన్ కరణ్ జొహర్ సినిమాలు చూస్తూ పెరిగింది. అయితే ఐశ్వర్యారాయ్ క్రేజ్ ఆమెను ప్రభావితం చేసింది. అంత కంటే ఎక్కువగా శ్రీదేవి వెండి తెర మీద ఒక దేవతలా వెలిగిపోతుండటం చూసి ఆమెలా ఎప్పటికైనా హీరోయిన్ కావాలనుకుంది. కాని అప్పటికే ఆమెకు ‘నజర్ బట్టు’ (దిష్టిబొమ్మ) అని పేరు. ఇంత లావుగా (85 కేజీలు) ఉన్న అమ్మాయి హీరోయిన్ ఎలా అవుతుంది? సారాలో ఖాన్ రక్తం ఉంది. తల్లి నుంచి వచ్చిన పంజాబీ పౌరుషం ఉంది. అందుకే సారా సంకల్పించుకుంది... ఎలాగైనా బరువు తగ్గాలనుకుంది. ఒకటిన్నర సంవత్సరం ఆమె శ్రమ చేయని రోజు లేదు. కడుపు మాడ్చుకోని పూట లేదు. తగ్గి.. తగ్గి.. తగ్గి.. ఆమె ఇప్పుడు హీరోయిన్ అయ్యింది. అందరూ ఆమెను తమ సినిమాల్లోకి రమ్మని రెడ్ కార్పెట్ పరిచారు. దానికి ముందే యాడ్స్‌లో టాప్ మోడల్‌గా అవతరించింది. ‘కేదార్‌నాథ్’ (2018)తో హీరోయిన్ అయ్యింది.
నెరవేరిన కల: కేదార్‌నాథ్ టెంపుల్ దగ్గర ఒక ముస్లిం గైడ్‌తో ప్రేమలో పడే హిందూ అమ్మాయిగా సారా నటించిన ‘కేదార్‌నాథ్’ సినిమా మిక్స్‌డ్ రివ్యూస్‌ను పొందినా సారా నటన విషయంలో మాత్రం ముక్తకంఠంగా మంచి మార్కులు వేశారు. ఒక తార ఉదయించిందన్నారు. పులి కడుపున పులే పుడుతుందన్నారు. ఇక్కడ పులి అమృతా సింగ్ కూడా కావచ్చు. తర్వాత ‘టెంపర్’ రీమేక్ ‘సింబా’లో నటించింది సారా. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మూడో సినిమా ‘లవ్ ఆజ్ కల్’ ఇప్పుడు రిలీజ్ అయ్యింది. వేలెంటైన్స్ డే రోజున విడుదలైన ఈ సినిమా మరో సారి సారా నటనను ప్రతిభావంతంగా చూపించగలిగింది. సారా ఇప్పుడు పూర్తి స్థాయి స్టార్. వరుణ్ ధావన్‌తో నాటి సూపర్ హిట్ ‘కూలీ నంబర్ 1’ రీమేక్‌లో నటిస్తోంది. 2019లో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ లిస్ట్ 100లో సారా 66వ స్థానంలో సారా నిలిచింది. చిన్న వయసులో ఇది పెద్ద ఘనత. సారాను చూసి తల్లి ఎలాగూ గర్వపడుతోంది. తండ్రి నిశ్శబ్దంగా మెచ్చుకుంటున్నాడు. హర్యానాలోని పటౌడి పరగణ మా అమ్మాయి అని గర్వంగా చెప్పుకుంటోంది.
ప్రస్తుతం: సారా తన తండ్రి రెండవ కుటుంబాన్ని కూడా సన్నిహితం చేసుకునే ప్రయత్నంలో ఉంది. మారు తల్లి కరీనా కపూర్‌తో సఖ్యంగా ఉంటోంది. మారు తమ్ముడు తైమూర్ అలీఖాన్‌ను ఎత్తుకొని ఆడిస్తూ ఉంది. కాని ఆమె అమ్మ కూతురుగానే ఈ లోకంలో తన అస్థిత్వాన్ని ఎక్కువగా కాపాడుకుంటోంది. ఆ అస్థిత్వమే ఆమెకు ఎక్కువ గౌరవం తెచ్చిపెడుతోంది. మంచి కారణాలతోకాని చెడు కారణాలతో కాని తండ్రి దూరమైనా తల్లి తోడుగా ఒక అమ్మాయి గట్టిగా నిలబడగలదు అని చెప్పడానికి సారా ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ఇది ఈ తరం గెలుపు అని కూడా సారా చాటింపు వేస్తోంది. ఆ చాటింపు చాలామందికి స్ఫూర్తి కావాలని కోరుకుందాం.– సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment