
చిరంజీవి గారితో అలా అన్నారట!
- దర్శకుడు బాబీ
‘‘ బాబీ... ఈ సినిమాకు నువ్వు డెరైక్టర్’’ అని చెప్పగానే షాకయ్యా. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఇచ్చేంత వరకూ కల లాగానే అనిపించింది’’ అని దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) అన్నారు. పవన్‌కల్యాణ్, కాజల్ అగర్వాల్ జంటగా బాబీ దర్శక త్వంలో శరత్‌మరార్ నిర్మించిన చిత్రం ‘ సర్దార్ గబ్బర్‌సింగ్’. ఈ నెల 8న రిలీజ్ కానున్న సందర్భంగా బాబీ చెప్పిన విశేషాలు
♦ ఒకరోజు శరత్ మరార్ నాకు ఫోన్ చేసి, పవన్ కల్యాణ్‌ను కలుద్దామన్నారు. నాకు చాలా టెన్షన్ అనిపించింది. డెరైక్టర్‌గా కాకుండా ఆయనకు వీరాభిమానిగా వెళ్లా. అక్కడ ఫామ్ హౌస్‌లో పొలం పనుల్లో సింపుల్‌గా ఉన్న కల్యాణ్‌గారిని చూసి ఆశ్చర్యపోయాను. కలిసిన 15 నిమిషాలకే దర్శకత్వ బాధ్యతలు పెట్టారు.
♦ మొదట సంపత్ నందితో ఈ చిత్రాన్ని తీద్దామనుకున్న మాట నిజమే. కానీ ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పుకున్నారో కారణాలు తెలియవు. ‘పవన్ క ల్యాణ్ నిన్ను డెరైక్షన్ చేయనిచ్చారా?’ అని చాలామంది అడిగారు. అలాంటిదేమీ లేదు. ఆయన హీరోగా కన్నా కేవలం రైటర్‌గానే ఎక్కువ ఇన్‌వాల్వ్ అయ్యారు. అంతే గానీ డెరైక్షన్, ఫొటోగ్రఫీల్లో అస్సలు జోక్యం చేసుకోలేదు. నాకు, పవన్ కల్యాణ్‌గారికి షూటింగ్ టైమ్ లో వేవ్‌లెంగ్త్ సెట్ కాలేదని వస్తున్న వార్తల్లోనూ, ‘షకలక’ శంకర్‌ని ఆయన కొట్టారని వస్తున్న వార్తల్లోనూ నిజం లేదు.
♦ నేను చిరంజీవిగారి వీరాభిమానిని. అందుకే ఈ సినిమాలో ఆయన పాటలను పెడితే బాగుంటుందని కల్యాణ్ గారు చెబితే ఎగ్జయిట్ అయ్యా. చిరంజీవిగారి హిట్ డ్యాన్స్ మూమెంట్ వీణ స్టెప్‌ను కల్యాణ్‌గారు చేయడం మెయిన్ హైలైట్.
♦ కల్యాణ్ గారితో పని చేయడం, ఆయన సినిమా చూసి విజిల్స్ చేసినంత ఈజీ కాదు. టఫ్‌గానే ఉంటుంది. కానీ ఆయనతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ పని చేస్తే ఆ మజాయే వేరు.
♦ కల్యాణ్‌గారు నా గురించి ‘బాబీ మంచి డెరైక్టర్ అవుతాడు. కుదిరితే నువ్వు కూడా సినిమా చేయాలి అన్నయ్యా’ అని చిరంజీవిగారితో చెప్పారట. ఈ సినిమా వచ్చినప్పుడు ఎంత ఆనందంగా అనిపించిందో, అలా అన్నారని తెలియగానే అంతకు పదింతలు సంతోషం అనిపించింది. ఒకవేళ చిరంజీవిగారు పిలిస్తే వెంటనే సినిమా కథ రాయడం స్టార్ట్ చేస్తాను.