సంక్రాంతి బరిలో.. మళ్లీ ఆ ముగ్గురు
ఇన్నాళ్లు ఒకేసమయంలో రెండు భారీ చిత్రాలను రిలీజ్ చేయడానికి టాలీవుడ్ నిర్మాతలు పెద్దగా ఇష్టపడేవారు కాదు. కానీ ఈ ఏడాది సంక్రాంతి నుంచి సీన్ మారిపోయింది. ఒకేసారి రెండు మూడు భారీ చిత్రాలు రిలీజ్ అయినా పెద్దగా ఇబ్బందేమీ ఉండదని ప్రూవ్ అయ్యింది. అంతేకాదు సరైన కంటెంట్ ఉంటే అంత కాంపీటీషన్లో కూడా ఓ చిన్న సినిమా సత్తా చాటగలదని నిరూపించాడు శర్వానంద్. నాన్నకు ప్రేమతో, సోగ్గాడే చిన్ని నాయన, డిక్టేటర్ లాంటి భారీ చిత్రాల రిలీజ్ సమయంలో ఎక్స్ప్రెస్ రాజాగా వచ్చి సక్సెస్ సాధించాడు.
అందుకే మరోసారి అదే సాహసానికి రెడీ అవుతున్నాడు శర్వానంద్. ఇప్పటికే వచ్చే సంక్రాంతికి బాలయ్య, నాగార్జునలు బెర్త్ కన్ఫామ్ చేసుకున్నారు. ఈ ఇద్దరు హీరోలు చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలతోనే ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. బాలయ్య గౌతమీ పుత్రశాతకర్ణిగా, నాగార్జున ఓం నమో వేంకటేశాయ సినిమాతో పరమ భక్తుడు హాథీరాం బాబాగా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు.
ఈ ఇద్దరు స్టార్ హీరోలతో మరోసారి ఢీ అనేందుకు రెడీ అవుతున్నాడు శర్వానంద్. దిల్రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న శతమానంభవతి సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసి.. మరోసారి సత్తా చాటలని ప్లాన్ చేసుకుంటున్నాడు శర్వానంద్. దిల్ రాజుకు కూడా ఈ సీజన్లో మంచి రికార్డ్ ఉండటం సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.