వెండితెరపై మహానటి!
వెండితెర మహారాణిగా, అసామాన్య నటిగా ప్రేక్షకులతో నీరాజనాలందుకున్న ఓ నట శిఖరం సావిత్రి. ఎలాంటి పాత్రనైనా అద్భుతంగా పోషించి, ‘మహానటి’ అనిపించుకున్నారు. ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సావిత్రి జీవితం ఇప్పుడు వెండితెరపైకి రానుంది. తొలి చిత్రం ‘ఎవడే సుబ్రమణ్యం’తో దర్శకునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగ అశ్విన్ ఈ జీవితకథను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘ఆనాటి ఆనవాళ్లను మళ్లీ సెల్యులాయిడ్‌పై పునః సృష్టి చేయనున్నాం.
సామాన్య స్త్రీ నుంచి ఓ సూపర్‌స్టార్‌గా సావిత్రి ఎదిగిన తీరు నేటి తరానికి మంచి పాఠంలా మిగిలిపోయింది. ఇన్నేళ్ళలో ఎంత మంది కథానాయికలు వచ్చినా సావిత్రి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయారు. నటీమణుల్లో చాలా తక్కువ మంది ‘లెజెండ్’ హోదాన్ని దక్కించుకున్నారు. వాళ్లలో సావిత్రిగారు ఒకరు. ఆమె గడిపిన జీవితం, ఎదుర్కొన్న అనుభవాల కలబోతే ఈ చిత్రం’’ అని నాగ అశ్విన్ పేర్కొన్నారు. ఈ చిత్రం కోసం ఎంతో మందిని కలిసి, రీసెర్చ్ చేసి సావిత్రి జీవితంలోని పలు విశేషాలను తెలుసుకున్నారట.
ఈ చిత్రాన్ని సీరియస్ ధోరణిలో ఆయన తీయాలనుకోవడంలేదు. సావిత్రి వ్యక్తిగత జీవితంలో విషాదం ఉన్నప్పటికీ, దాన్ని టచ్ చేయకుండా ఆమె జీవితం తాలూకు సెలబ్రేషన్‌లా ఈ సినిమా ఉండేలా నాగ అశ్విన్ స్క్రిప్ట్‌ను వర్కవుట్ చేశారు. ఒక మహానటి జీవితానికి తెరరూపం ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. పైగా రెండో సినిమాతోనే అలాంటి ప్రయత్నం చేయడం అంటే నాగ అశ్విన్‌ని అభినందించాల్సిందే.