కన్నీళ్లు పెట్టుకున్న కవిత
కన్నీళ్లు పెట్టుకున్న కవిత
Published Tue, Sep 24 2013 2:09 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
‘‘బాలనటిగా, కథానాయికగా, ఇప్పుడు కేరక్టర్ నటిగా సినిమా పరిశ్రమతో నాకున్న అనుబంధం 35ఏళ్లు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అగ్రహీరోల సరసన ఎన్నో చిత్రాల్లో నటించాను. ప్లాటినమ్ జూబ్లి చిత్రాల్లో సైతం యాక్ట్ చేశాను. అలాంటి నాకు వందేళ్ల భారతీయ సినిమా వేడుకల్లో పాల్గొనే అవకాశం లేదా’’ అని ఆవేదన వ్యక్తం చేశారు కవిత.
చెన్నయ్‌లో గత మూడు రోజులుగా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ రంగాలకు సంబంధించిన సినిమా తారల సమక్షంలో శత వసంతాల సినీ వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలకు వెళ్లలేదా? అంటూ సోమవారం పాత్రికేయుల అడిగిన ప్రశ్నకు కవిత సమాధానం చెబుతూ -‘‘ఎవరూ పిలవలేదు. రెండు, మూడు సినిమాల్లో నటించినవాళ్లు కూడా ఆ వేడుకల్లో పాల్గొంటున్నారు.
చెన్నయ్ నుంచి చాలామంది ఫోన్ చేసి, ‘ఎప్పుడు వస్తున్నావ్? ఎక్కడున్నావ్’ అని అడిగితే, నాకేం సమాధానం చెప్పాలో తెలియదు. వాళ్ల కూతుళ్లు, వీళ్లు కొడుకులంటూ ఎంతోమందిని తీసుకెళ్లారు. కాకాపట్టే కొంతమందికి కూడా ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించింది. కానీ చాలామంది సీనియర్లకు ఆహ్వానం అందలేదు. సినిమా పరిశ్రమ మాకు చేసిన గౌరవం ఇది’’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు.
Advertisement