కామెడీ ఆర్టిస్ట్ గా పరిచయమై..
ఎన్నో అద్భుతమైన పాత్రలతో దాదాపు 5 దశాబ్దాలుగా సినీ అభిమానులను అలరిస్తున్న అత్యుత్తమ నటి అశేష అభిమానులను వదిలి వెళ్లిపోయింది. తమిళ, తెలుగు, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లో సుపరిచితురాలైన సీనియర్ నటి మనోరమ శనివారం అర్ధరాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
1960, 1970 దశకాలలో తమిళ వెండితెరను శాసించిన మనోరమ 1937 మే 26న తమిళనాడులోని మన్నార్గుడిలో జన్మించారు. మనోరమ అసలు పేరు గోపిశాంత. 12 ఏళ్ల చిన్న వయసులోనే నాటకరంగంలోకి అడుగుపెట్టిన ఆమె స్టేజ్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. కరుణానిధి రాసిన ఎన్నో నాటకాలల్లో నటించారు.
1958లో రిలీజ్ అయిన మళ ఇట్ట మంగై సినిమాతో తొలిసారిగా వెండితెర మీద కనిపించారు మనోరమ. తొలి సినిమాలోనే కామెడీ ఆర్టిస్ట్ గా పరిచయం అయిన ఆమె ఆ తరువాత ఎక్కువగా ఆ తరహా పాత్రలే చేస్తూ వచ్చారు. 1963లో వచ్చిన కొంజమ్ కుమారి సినిమాలో హీరోయిన్గా నటించినా తరువాత కూడా కామెడీ పాత్రల మీదే దృష్టిపెట్టారు. అందుకే దాదాపు రెండు దశాబ్దాల పాటు తమిళ ఇండస్ట్రీలో ఆమె లేకుండా ఒక్క సినిమా కూడా రాలేదంటే అతిషయోక్తి కాదు. స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాల వరకు ఏ స్థాయి సినిమా అయిన అందులో మనోరమ కోసం ప్రత్యేకంగా ఓ పాత్రను రాసేవారు.
తమిళ ఇండస్ట్రీలో నెంబర్ వన్ కమెడియన్స్ అనిపించుకున్న చాలా మందితో ఆమె జంటగా నటించారు. అలనాటి మేటి నటులు చంద్రబాబు, చో రామస్వామి, తంగవేళు, తెంగై శ్రీనివాసన్, ఎమ్ ఆర్ రాధ, నగేష్ లాంటి సీనియర్ నటులతో కలిసి ఎన్నో సినిమాల్లో హాస్యాన్ని పండిచారు. అంతేకాదు నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన అరుదైన రికార్డ్ మనోరమ సొంతం. తమిళనాడు ముఖ్యమంత్రులు అన్నాదురై, కరుణానిధి, ఎమ్ జి రామ్చంద్రన్, జయలలితలతో ఆమె కలిసి నటించారు.
అల్లరి ప్రియుడు, కుంతీ పుత్రుడు, జెంటిల్మేన్, రిక్షావోడు, బావనచ్చాడు, అరుంధతి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు మనోరమ. సినీరంగానికి ఆమె చేసిన సేవలకు గాను ఎన్నో పురస్కారాలు ఆమెను వరించాయి. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డ్ తో సత్కరించగా, భారత ప్రభుత్వం 2002లో పద్మ శ్రీ అవార్డ్ తో గౌరవించింది. 1988లో ఆమె నటించిన పుతియా పట్టై సినిమాకు గాను ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డ్ ను కూడా అందుకున్నారు. వీటితో పాటు తెలుగు, తమిళ రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు, ఫిలింఫేర్ అవార్డ్ లు ఎన్నో అందుకున్నారు. ఎన్నో అద్భుత పాత్రలతో సినీ అభిమానులను అలరించిన మనోరమ మరణం తమిళ పరిశ్రమకేకాదు యావత్ భారత సినీ పరిశ్రమకే తీరనిలోటు. భౌతికంగా ఆమె మనల్ని వదిలిపోయినా ఆమె చేసిన పాత్రలు, ఆమె పూయించిన నవ్వులు ఎప్పుడూ మనకు ఆ మహానటిని గుర్తు చేస్తూనే ఉంటాయి.