సీనియర్ నటీమణుల ఆధ్వర్యంలో క్వీన్
సీనియర్ నటి సుహాసిని మణిరత్నం మాటలతో నటి రేవతి చేతలతో ఒక చిత్రం రూపుదిద్దుకుంటోందనేది తాజా సమాచారం. విశేషం ఏమిటంటే ఈ ఇద్దరూ బహు భాషా నటీమణులన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుహాసిని నటిగానే కాకుండా ఇందిర చిత్రంతో దర్శకురాలిగా తానేమిటో నిరూపించుకున్నారు. ఇక రేవతి కూడా ఆంగ్లం, హిందీ, మలయాళం భాషల్లో దర్శకురాలిగా సృజనాత్మకమైన చిత్రాలను తెరకెక్కించారు. సినిమానే శ్వాస అన్నంతగా ప్రేమించే వీరిద్దరూ ఒక తమిళసినిమాకు పని చే స్తుండడం నిజంగా విశేషమే అవుతుంది. అదీ ఒక స్త్రీ ప్రధాన ఇతివృత్తంగా జరిగే కథా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
హిందీలో ఘన విజయం సాధించిన చిత్రం క్వీన్. కంగనారావత్‌ను క్రేజీ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో నిలబెట్టిన చిత్రం ఇదని చెప్పవచ్చు. ఈ చిత్ర దక్షిణాది పునర్నిర్మాణ హక్కుల్ని సీనియర్ నటుడు, దర్శక నిర్మాత త్యాగరాజన్ పొందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ చిత్రంలో కంగనారావత్ పాత్రలో నటించే అదృష్టం దక్కిం చుకునే దక్షిణాది నటి ఎవరు?దానికి కెప్టెన్సీ బాధ్యతలను వహించేది ఎవరు? అన్న ఆసక్తికరమైన ప్రచారం జరుగుతూనే ఉంది. వీటిలో మొదటి ప్రశ్నకు జవాబు వెల్లడైంది.ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు నటి సుహాసిని మణిరత్నం సంభాషణలను, మరో నటి రేవతి దర్శకత్వాన్ని నిర్వహించనున్నారు.
ఈ విషయాన్ని నటి సుహాసిని బెంగళూర్‌లో జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో వెల్లడించారు. చిత్ర ఫ్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు ప్రారంభమైనట్లు చెప్పారు.అయితే ఇందులో నటించే హీరోయిన్ ఎవరన్నది బయట పెట్టలేదు. క్వీన్ చిత్ర రీమేక్‌లో నటించడానికి పలువురు దక్షిణాది ప్రముఖ హీరోయిన్లు పోటీపడుతున్నారని సమాచారం.
క్వీన్ చిత్రం కథేమిటంటే బయట ప్రపంచం తెలియని 24 ఏళ్ల పంజాబీ యువతి రాణికి పెళ్లి నిశ్చయమవుతుంది.అయితే వివాహం రెండు రోజులు ఉందనగా పెళ్లికొడుకు మన పెళ్లి జరగదు. మన దారులు వేరు అని చెప్పడం, ఆ తరువాత పెళ్లికి ముందే ప్రణాళికను సిద్ధం చేసుకుని హనీమూన్‌కు వెళ్లడం, అక్కడ ఆమెకు ఎదురైన సంఘటనలే చిత్ర ఇతివృత్తం. దీని తమిళ తెర రూపానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.