
ఎస్ అండ్ ఎస్.. షారుక్ ఖాన్ అండ్ సూర్య.. గెస్టులుగా నటించడానికి ‘యస్’ అన్నారట. ఏ సినిమా అంటే ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’లో. ప్రముఖ మాజీ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. నంబి నారాయణన్ పాత్ర పోషించడంతో పాటు ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడుతున్నారు మాధవన్. శాస్త్రవేత్త పాత్రలో ఒదిగిపోవడానికి మాధవన్ కాస్త బరువు తగ్గారు. గడ్డం పెంచారు. నెరిసిన గడ్డంతో కనిపించనున్నారు. ఒక నటుడు పాత్రను ప్రేమిస్తే ఎంతలా ఒదిగిపోతాడో చెప్పడానికి తాజాగా మాధవన్ గెటప్ ఓ ఉదాహరణ.
ఆ సంగతలా ఉంచితే.. ఈ చిత్రంలో ఒక అతిథి పాత్ర ఉందట. ఆ పాత్రను ఇటు తమిళ్ అటు హిందీ వెర్షన్‌లో పేరున్న నటుడు చేస్తే బాగుంటుందని మాధవన్ భావించారట. షారుక్ ఖాన్, సూర్య అయితే న్యాయం జరుగుతుందని ఇద్దరినీ అడిగారని సమాచారం. మాధవన్ అడగ్గానే కాదనకుండా షారుక్, సూర్య నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బోగట్టా. ఈ ఇద్దరూ నటిస్తే కథకు బలం చేకూరడంతో పాటు తమిళ్, హిందీ భాషల్లో రూపొందుతోంది కాబట్టి ఆయా భాషల్లో సినిమా బిజినెస్‌కి కూడా ఉపయోగపడుతుంది. ఈ ఏడాదే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.