‘అల్లరి అల్లుడు’ అంత హిట్‌ అవ్వాలి | shailaja reddy alludu pre release function | Sakshi
Sakshi News home page

‘అల్లరి అల్లుడు’ అంత హిట్‌ అవ్వాలి

Published Mon, Sep 10 2018 12:55 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

shailaja reddy alludu pre release function - Sakshi

పీడీవీ ప్రసాద్, ఎస్‌. రాధాకృష్ణ, మారుతి, అనూ ఇమ్మాన్యుయేల్, నాగచైతన్య, నాగార్జున, రమ్యకృష్ణ, నాని, నిజర్, నాగవంశీ

‘‘చైతన్యని అందరూ శైలజారెడ్డిగారి అల్లుడు అంటున్నారు.. కాదు.. అక్కినేని నాగేశ్వరరావుగారి మనవడు.. నాగార్జున పెద్దకొడుకు. ప్రేమకథా చిత్రాలైనా, ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలైనా, ఒక స్ట్రాంగ్‌ ఉమెన్‌ క్యారెక్టర్‌ ఉన్న సినిమాల్లో అయినా నాన్నగారికి నాన్నగారే సాటి. ఇప్పుడు ఆయన వారసత్వాన్ని చైతన్య తీసుకున్నాడు’’ అని హీరో నాగార్జున అన్నారు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్‌ జంటగా రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఎస్‌.నాగవంశీ, పీడీవీ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 13న విడుదలవుతోంది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘చైతన్య చాలా సాఫ్ట్‌.. చక్కగా నవ్వుతూ ఉంటాడు.. బంగారం.. అని మీరందరూ అంటూ ఉంటారు. కాదు.. తనలో చిలిపితనం కూడా ఉంది. నేను కొంచెం సినిమా చూశా. మారుతీగారు ఆ చిలిపితనాన్ని చక్కగా వాడుకున్నారు. నేను, రమ్యకృష్ణ కలసి ఎన్నో సినిమాలు చేశాం, చాలా పెద్ద హిట్స్‌ అయ్యాయి.‘బాహుబలి’ తర్వాత రమ్య అంటే భారతదేశంలో తెలియనివారు ఎవరూ లేరు. నాతోపాటు ‘అల్లరి అల్లుడు’ చిత్రంలో చిన్న గెస్ట్‌రోల్‌ చేసింది. ఇప్పుడు చైతన్యతో ‘శైలజారెడ్డి అల్లుడు’ చేసింది.

ఈ సినిమా ‘అల్లరి అల్లుడు’ అంత హిట్‌ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.  మారుతీగారికి మాస్‌ పల్స్‌ బాగా తెలుసు. మా ఫ్యాన్స్‌కి ఏం కావాలో ఈ సినిమాలో మీరు ఇస్తున్నందుకు థ్యాంక్స్‌.  గత నెలలో నాకు బాగా దగ్గరైన ఇద్దరు మనల్ని వదిలి వెళ్లిపోయారు. హరి అన్నయ్య(హరికృష్ణ). ఎవర్నైనా ఇక్కడ నేను ‘అన్న’ అని పిలుస్తానంటే అది ఆయనొక్కర్నే. ఆయన వెళ్లిపోయిన రోజు నా పుట్టినరోజు. పొద్దున్నే వార్త వినగానే ఎలా కనెక్ట్‌ చేసుకోవాలో కూడా తెలియలేదు. నా స్నేహితుడు, ఆత్మీయుడు రవీందర్‌ రెడ్డి మరణం కూడా నన్ను బాధించింది. చైతన్య కెరీర్‌లో ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా బిగ్గెస్ట్‌ హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు.


హీరో నాని మాట్లాడుతూ– ‘‘ఇంతకుముందు జనరేషన్‌లో మంచి సాంగ్స్‌ అన్నీ నాగార్జునగారికి పడితే.. మా జనరేషన్‌లో మంచి సాంగ్స్‌ నాగచైతన్యకు పడ్డాయి. ఆ ఫ్యామిలీకి మంచి పాటలన్నీ అలా రాసిపెట్టినట్లు ఉన్నాయి. ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం కొంచెం ‘అల్లరి అల్లుడు’ లాంటి సినిమా అని నాగార్జునగారు నాతో అన్నారు. ఆ మాట చాలు ఈ సినిమాలో ఏ స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుందో’’ అన్నారు. ‘‘ఇంత స్పీడ్‌గా షూటింగ్‌ పూర్తి చేసి, ఇంతే త్వరగా సినిమా రిలీజ్‌ చేస్తుండటం ఇన్నేళ్లలో ఫస్ట్‌టైమ్‌ చూస్తున్నా. వేడివేడిగా మీ ముందుకు రాబోతోంది’’ అన్నారు రమ్యకృష్ణ. 

మారుతి మాట్లాడుతూ– ‘‘నాగచైతన్యగారిని మీరు(అభిమానులు) ఎలా చూడాలనుకుంటున్నారో వందశాతం అలాగే ఉంటారని గ్యారంటీ ఇస్తున్నా.

ఈ సినిమా నుంచి ఆయన యువసామ్రాట్‌.. ఫిక్స్‌ అవ్వండి. ఈ సినిమాలో ట్యాగ్‌ వేస్తున్నా. ‘శైలజారెడ్డి అల్లుడు’  ఓ మంచి లవ్‌స్టోరీ.   రమ్యమేడమ్‌తో ఫొటో దిగడం,  పనిచేయడం  అందరికీ ఓ కలలా ఉంటుంది. అలాంటిది ఆమెను డైరెక్ట్‌ చేయడం నా కల నెరవేరినట్టే. ఓ యాక్టర్‌గా, హీరోగా పరిచయమైన నా హీరో(నాగచైతన్య).. ఇప్పుడు నాకు మంచి ఫ్రెండ్‌ అయ్యాడు’’ అన్నారు.

నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘మా అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. బయటికి అభిమానులు అంటున్నాం కానీ మీరందరూ నా ఫ్యామిలీయే. ప్రతి సినిమా ఈవెంట్‌కి వచ్చి ఇలాగే ఎంకరేజ్‌ చేసి ఇదే ఎనర్జీ ఇచ్చి ప్రోత్సహిస్తారు.  మీరే నా బలం, బలహీనత.. మీరిచ్చే ప్రేమకి మీరు కోరుకునేది ఓ హిట్‌ సినిమా.

ఇకనుంచి ప్రతి సినిమా మిమ్మల్ని మైండ్‌లో పెట్టుకుని మీరు గర్వపడే సినిమాలు చేస్తానని మాట ఇస్తున్నా. మారుతిగారు మనకి ఓ సూపర్‌ సినిమా ఇచ్చారు. చినబాబుగారు, వంశీ, పీడీవీ ప్రసాద్‌గారు రెండేళ్లకిందట ఎప్పటికీ మరచిపోలేని ‘ప్రేమమ్‌’ అనే సినిమా ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమా ఇచ్చారు. రమ్య మేడమ్‌ ఈ సినిమాకి పెద్ద సపోర్ట్‌. పండుగకి ఇది పండుగలాంటి సినిమా. మీరు ఎంజాయ్‌ చేసి, మీ మొహంలో ఓ నవ్వుంటే నేనూ ఆరోజు పండుగ చేసుకుంటా’’ అన్నారు.  ‘‘ఇటీవల స్టేజ్‌ ఎక్కిన ప్రతిసారి నాకు మాటలు సరిగ్గా వచ్చేవి కాదు.  అన్నయ్య(నాగచైతన్య) గురించి మాట్లాడాలన్నప్పుడు మాత్రం తన్నుకుంటూ వస్తున్నాయి. మారుతీగారు మీరు కరెక్ట్‌ టైమ్‌లో కరెక్ట్‌ హీరోని పట్టారు. సినిమాలో అల్లుణ్ని చేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత అన్నయ్య ఫేస్‌లో సడెన్‌గా మంచి గ్లో వచ్చింది’’ అని హీరో అఖిల్‌ అన్నారు. చిత్ర సమర్పకులు రాధాకృష్ణ, నిర్మాతలు పీడీవీ ప్రసాద్, నాగవంశీ, అనూ ఇమ్మాన్యుయేల్, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రవిశంకర్, నటులు కాశీ విశ్వనాథ్, నరేశ్, సంగీత దర్శకుడు గోపీసుందర్, కెమెరామెన్‌ నిజ ర్‌ పాల్గొన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement