షారూఖ్ కెరీర్లో మరో బెస్ట్ క్యారెక్టర్ | Sharukh Khan Fan movie review | Sakshi
Sakshi News home page

షారూఖ్ కెరీర్లో మరో బెస్ట్ క్యారెక్టర్

Published Fri, Apr 15 2016 2:18 PM | Last Updated on Sun, Sep 3 2017 10:00 PM

షారూఖ్ కెరీర్లో మరో బెస్ట్ క్యారెక్టర్

షారూఖ్ కెరీర్లో మరో బెస్ట్ క్యారెక్టర్

చాలా రోజులుగా తన స్థాయికి తగ్గ సక్సెస్ సాధించటంలో ఫెయిల్ అవుతూ వస్తున్న షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ 'ఫ్యాన్'. షారూఖ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి, అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ కాన్సెప్ట్తో తానే హీరోగా విలన్గా తెరకెక్కిన సినిమా ఫ్యాన్. వరుస ఫ్లాప్ లతో ఇబ్బందుల్లో ఉన్న షారూఖ్కు ఫ్యాన్ ఆశించిన విజయం అందించిందా..?
 
ఢిల్లీలో నివసించే గౌరవ్ (షారూఖ్ ఖాన్) సూపర్ స్టార్ ఆర్యన్ ఖన్నా(షారూఖ్ ఖాన్)కు వీరాభిమాని. తన అభిమాన నటుడి లాగే ప్రవర్తిస్తూ అతని లాగే బట్టలు వేసుకునే గౌరవ్ ఒక్కసారైనా ఆర్యన్ ఖన్నాను కలవాలనుకుంటాడు. అదే ప్రయత్నంలో ముంబై వస్తాడు. అనుకోకుండా గౌరవ్కు ఆర్యన్ ఖన్నాను కలిసే అవకాశం వస్తుంది. అయితే ఆర్యన్ మీద ఉన్న ఇష్టంతో ఆయన సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించే వ్యక్తితో అసభ్యంగా ప్రవర్తిస్తాడు గౌరవ్. ఈ విషయంపై ఆర్యన్, గౌరవ్ను మందలిస్తాడు. కానీ గౌరవ్ మాత్రం ఆర్యన్ చెప్పిన మాటలతో అతని మీద ద్వేషం పెంచుకుంటాడు. అప్పటి వరకు వీరాభిమానిగా ఉన్న వాడు బద్ద శత్రవుగా మారిపోతాడు. ఎలాగైన ఆర్యన్ని ఇబ్బంది పెట్టాలని భావిస్తాడు. ఈ పోరాటంలో గౌరవ్, ఆర్యన్ను ఎలా ఇబ్బందులకు గురిచేశాడు. ఆర్యన్, గౌరవ్ను ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే మిగతా కథ.
 
ఆర్యన్గా, గౌరవ్గా రెండు పాత్రల్లో కనిపించిన షారూఖ్ మరోసారి అద్భుతమైన నటనతో మెప్పించాడు. ముఖ్యంగా గౌరవ్ పాత్ర కోసం ప్రొస్థటిక్ మేకప్తో నటించిన షారూఖ్ నటన పట్ల తన అంకిత భావాన్ని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇతర నటీనటుల తమవంతుగా పాత్రలకు న్యాయం చేసినా సినిమా అంతా షారూఖ్ షోలా సాగుతుంది. రెగ్యులర్ రివేంజ్ డ్రామాను ఆకట్టుకునే స్క్రీన్ ప్లే తో కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు మనీష్ శర్మ. ముఖ్యంగా ఆర్యన్ను గౌరవ్ కలిసే సన్నివేశం సినిమాకే హైలెట్గా నిలుస్తుంది. అయితే ఈ ఇద్దరి మధ్య శతృత్వం ఏర్పడటానికి మాత్రం బలమైన కారణం చూపించలేకపోయాడు. ఇద్దరిలో ఎవరిది తప్పు అన్న విషయం పై కూడా క్లారిటీ లేదు. 
 
ఇక ఫస్ట్ హాఫ్ అంతా రేసీ స్క్రీన్ ప్లే తో పక్కాగా ప్లాన్ చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్లో మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఓ సాధారణ కుర్రాడు సూపర్ స్టార్ను వెంటాడటం, అతని కోసం విదేశాలకు వెళ్లటం లాంటి అంశాలు నమ్మశక్యంగా అనిపించవు. మను ఆనంద్ సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా ఫారిన్లో షూట్ చేసిన యాక్షన్ సీన్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. యష్ రాజ్ సంస్థ నిర్మాణ విలువ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విశాల్ శేఖర్ల సంగీతం, ఆండ్ర్యూ అందించిన నేపథ్య సంగీతం సినిమా మూడ్ను క్యారీ చేశాయి.
 
సక్సెస్ కోసం షారూఖ్ చేసిన ఫ్యాన్, గొప్ప సినిమాగా పేరు తెచ్చుకోకపోయినా, నటుడిగా షారూఖ్ స్థాయిని మాత్రం పెంచింది. రొటీన్ రివేంజ్ డ్రామాను భారీ బడ్జెట్తో తెరకెక్కించిన మనీష్ శర్మ అంచనాలు అందుకోవటంలో తడబడ్డాడు. అయితే చాలా రోజులుగా ఓ భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న బాద్షా అభిమానులకు ఫ్యాన్ కాస్త ఊరట కలిగిస్తుందన్న విషయంలో సందేహం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement