72 గంటలు ఏకధాటిగా...
దూరపు కొండలు నునుపు అన్నట్లు.. సెలబ్రిటీల జీవితం చాలా బాగుంటుందని దూరం నుంచి చూసినవాళ్లు అనుకుంటారు. నిజంగానే బాగుంటుంది. కానీ దానివెనక వాళ్ల కష్టం మామూలుగా ఉండదు. నైన్‌కి ఆఫీసుకి వెళ్లి ఫైవ్‌కి హాయిగా ఇంటికొచ్చే పరిస్థితి ఉండదు. పని గంటలతో పని లేకుండా పని చేయాలి. ఇటీవల శ్రద్ధాకపూర్ అలానే చేశారు. ఈ నాజూకు సుందరి బ్యాంకాక్‌లో విశ్రాంతి లేకుండా నాన్‌స్టాప్‌గా షూటింగ్ చేస్తూ, ముంబైలో ప్రెస్ కాన్ఫరెన్స్‌కి హాజరు కావడం విశేషం. ఆ విషయంలోకి వస్తే...
శ్రద్ధాకపూర్ నటిస్తున్న తాజా చిత్రం ‘భాగీ’ షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. మరోవైపు ఆమె ప్రచాకర్తగా వ్యవహరిస్తున్న ఓ ఉత్పత్తికి సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ ముంబైలో ఏర్పాటైంది. శ్రద్ధా కపూర్ కంగారుపడలేదు. బ్యాంకాక్‌లో ఫ్లయిట్ ఎక్కి ముంబైలో వాలిపోయారు. రెండు గంటల పాటు జరిగిన ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో పాల్గొని బ్యాంకాక్ వెళ్లిపోయారు.
పోనీ వెళ్లాక విశ్రాంతి తీసుకున్నారేమో అనుకుంటున్నారా? అదేం కాదు. ఏకధాటిగా షూటింగ్‌లో పాల్గొన్నారు. అది కూడా రిస్కీ యాక్షన్ సీక్వెన్స్‌లో. అనుకున్న సమయానికి చిత్రీకరణ పూర్తవ్వాలంటే ఏకధాటి షూటింగ్ చేయాలట. అందుకని, 72 గంటల పాటు షూటింగ్ చేస్తానని దర్శక-నిర్మాతలు సబీర్, సాజిద్ ఖాన్‌లకు మాటిచ్చేసి షాకిచ్చారట. పేరులోనే శ్రద్ధ ఉంది కాబట్టి.. శ్రద్ధగా పని చేస్తూ, సార్థక నామధేయురాలు అనిపించుకుంటున్నారామె.