Celebrity life
-
అప్పుడు ఏడ్వాలో నవ్వాలో అర్థం కాలేదు!
సెలబ్రిటీల జీవితం చాలా సుఖంగా ఉంటుంది. అన్ని సౌకర్యాలూ ఉంటాయి. చీకూ చింతా లేకుండా హ్యాపీగా బతికేయొచ్చు అని చాలామంది అనుకుంటారు. కానీ, వాళ్లకూ ఇబ్బందులు ఉంటాయ్. బాడీగార్డులు లేకుండా బయటికొస్తే.. వీరాభిమానులతో ఇబ్బంది ఉండదు కానీ, వెర్రి అభిమానులతో ఇబ్బందులు తప్పవ్. అసలు సెలబ్రిటీలు ఏ మూడ్‌లో ఉన్నారో కూడా చూసుకోకుండా ఫొటోగ్రాఫులూ, ఆటోగ్రాఫులూ అడుగుతారు. ఇంకా ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. ఇటీవల రకుల్‌ప్రీత్ సింగ్‌కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. తెలుగు పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా దూసుకెళుతోన్న రకుల్‌కి ఈ మధ్య కాస్త తీరిక చిక్కింది. అంతే.. తన క్లోజ్‌ఫ్రెండ్స్‌తో కలిసి లాస్ వేగాస్ వెళ్లారు. అక్కడికెళ్లాలనే కల రకుల్‌కి ఎప్పట్నుంచో ఉంది. వేగాస్‌లో చూడాల్సినవన్నీ చూసేసి, తిరుగు ప్రయాణమయ్యారు. వేగాస్ నుంచి సీటెల్ వెళ్లి, అట్నుంచి దుబాయ్ వెళ్లి, అక్కణ్ణుంచి హైదరాబాద్ రావాలన్నది ఈ బ్యూటీ ప్లాన్. కట్ చేస్తే.. సీటెల్ ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంటరై, ఫ్లైట్ ఎక్కుదామనుకుంటున్న సమయంలో మెడ దగ్గర సన్నగా నొప్పి మొదలైందట. ఆ నొప్పి భరించలేనంత పెద్దది కావడంతో తన మ్యానేజర్‌కి ఫోన్ చేసి, విషయం చెప్పారు రకుల్. అప్పటికప్పుడు రకుల్‌ని ఆస్పత్రికి తీసుకెళ్లారట. ఒకవైపు నొప్పితో రకుల్ విలవిలలాడుతుంటే.. అక్కడే ఉన్న ఒకావిడ, ‘మీరు రకుల్ కదూ’ అని అడగడంతో పాటు, ‘మీతో ఫొటో దిగాలని ఉంది’ అన్నదట. అలాంటి పరిస్థితిలో రకుల్‌కి ఏమనిపించి ఉంటుందో ఊహించవచ్చు. చుట్టూ ఉన్నవాళ్లు రకుల్ పరిస్థితి చెప్పడంతో, ఆవిడ ‘అయ్యో’ అని అక్కణ్ణుంచి వెళ్లిపోయారట. ‘‘నిజంగా నాకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు. ఏడుపు కన్నా నవ్వే వచ్చింది’’ అని రకుల్ పేర్కొన్నారు. -
72 గంటలు ఏకధాటిగా...
దూరపు కొండలు నునుపు అన్నట్లు.. సెలబ్రిటీల జీవితం చాలా బాగుంటుందని దూరం నుంచి చూసినవాళ్లు అనుకుంటారు. నిజంగానే బాగుంటుంది. కానీ దానివెనక వాళ్ల కష్టం మామూలుగా ఉండదు. నైన్కి ఆఫీసుకి వెళ్లి ఫైవ్‌కి హాయిగా ఇంటికొచ్చే పరిస్థితి ఉండదు. పని గంటలతో పని లేకుండా పని చేయాలి. ఇటీవల శ్రద్ధాకపూర్ అలానే చేశారు. ఈ నాజూకు సుందరి బ్యాంకాక్‌లో విశ్రాంతి లేకుండా నాన్‌స్టాప్‌గా షూటింగ్ చేస్తూ, ముంబైలో ప్రెస్ కాన్ఫరెన్స్‌కి హాజరు కావడం విశేషం. ఆ విషయంలోకి వస్తే... శ్రద్ధాకపూర్ నటిస్తున్న తాజా చిత్రం ‘భాగీ’ షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. మరోవైపు ఆమె ప్రచాకర్తగా వ్యవహరిస్తున్న ఓ ఉత్పత్తికి సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ ముంబైలో ఏర్పాటైంది. శ్రద్ధా కపూర్ కంగారుపడలేదు. బ్యాంకాక్‌లో ఫ్లయిట్ ఎక్కి ముంబైలో వాలిపోయారు. రెండు గంటల పాటు జరిగిన ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో పాల్గొని బ్యాంకాక్ వెళ్లిపోయారు. పోనీ వెళ్లాక విశ్రాంతి తీసుకున్నారేమో అనుకుంటున్నారా? అదేం కాదు. ఏకధాటిగా షూటింగ్లో పాల్గొన్నారు. అది కూడా రిస్కీ యాక్షన్ సీక్వెన్స్‌లో. అనుకున్న సమయానికి చిత్రీకరణ పూర్తవ్వాలంటే ఏకధాటి షూటింగ్ చేయాలట. అందుకని, 72 గంటల పాటు షూటింగ్ చేస్తానని దర్శక-నిర్మాతలు సబీర్, సాజిద్ ఖాన్లకు మాటిచ్చేసి షాకిచ్చారట. పేరులోనే శ్రద్ధ ఉంది కాబట్టి.. శ్రద్ధగా పని చేస్తూ, సార్థక నామధేయురాలు అనిపించుకుంటున్నారామె. -
జీవిత కథకు ఐదు కోట్లు!
సెలబ్రిటీల జీవిత విశేషాలు తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అందుకే వీలు కుదిరినప్పుడల్లా వాళ్ల జీవితాల్లోకి తొంగి చూసి, విషయాలు తెలుసుకోవాలనుకుంటారు. సెలబ్రిటీ లైఫ్ అంటే అంత ఆసక్తి మరి. అందుకే వారి జీవితకథలతో వచ్చే సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అందులోనూ సంజయ్ దత్ వంటి నటుల జీవితాలను తెలుపుకోవడానికి చాలా ఆసక్తి చూపుతారు. బహుశా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే సంజయ్ దత్ జీవిత కథతో సినిమా తీయాలని దర్శకుడు రాజ్‌కుమార్ హిరాని అనుకుని ఉంటారు. ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘లగేరహో మున్నాభాయ్’, ‘3 ఇడియట్స్’, ‘పీకే’ వంటి విలక్షణ చిత్రాలతో దర్శకునిగా తనదో ప్రత్యేకమైన శైలి అని నిరూపించుకున్నారు హిరాని. ‘పీకే’ తర్వాత సంజయ్ దత్ జీవితకథతో ఆయన చేయనున్న చిత్రం వచ్చే ఏడాది ఆరంభం కానుంది. జీవిత కథను తెరకెక్కించడానికి అనుమతి ఇవ్వడానికి సంజయ్ దత్‌కి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారని సమాచారం. ‘మున్నాభాయ్’కి మూడో భాగంగా ‘మున్నాభాయ్ ఛలే అమ్రికా’ తీయాలని షరతు కూడా హిరానీకి సంజయ్ పెట్టారట. అందుకు సమ్మతించడంతోనే జీవిత కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇందులో తన పాత్రకు రణ్‌బీర్ కపూర్ పేరుని కూడా సూచించారని బాలీవుడ్ టాక్. అతిథి పాత్రలో కనిపించడానికి కూడా అంగీకరించారని భోగట్టా. -
సెలబ్రిటీలకే సెలబ్రిటీలు!
ఫొటో స్టోరీ ‘వాటితో కొంతసేపు గడిపితే మన నేచర్ మారిపోతుంది. కొంత పెడితే సంతోషిస్తాయవి. మనుషులకే ఎంత పెట్టినా చాలదు...’ పెట్స్ గురించి, అంతర్లీనంగా మనుషుల గురించి దర్శకుడు పూరి జగన్నాథ్ ఫిలాసఫీ ఇది. మనుషుల గురించి అందరికీ తెలుసు. పెట్స్ గురించి మాత్రం వాటితో గడిపినప్పుడే తెలుస్తుంది. అలా గడిపేవారికే పూరి ఫిలాసఫీలోని గాఢత అర్థం అవుతుంది. సెలబ్రిటీల జీవితంలో ఖరీదైన దుస్తులు, కార్లు, వాచీలు ఎలాగో... ఈ ఖరీదైన కుక్కపిల్లలు కూడా అలాగే! ఇంకా చెప్పాలంటే ఇవి ఆ సెలబ్రిటీలకే సెలబ్రిటీలు. ఇక్కడ ఈ సినిమా వాళ్ల గురించే కాదు... పెట్స్ గురించి కూడా చెప్పాలి. ఏ జాతివి అయితేనేం, ఏ దేశం నుంచి దిగుమతి చేసుకొన్నవైతేనేం... సృష్టిలో కెల్లా విశ్వాసం గలవి అనే జాతికి చెందినవి. తమను పెంచిపోషిస్తున్న వారిపై అపారమైన ప్రేమను కురిపిస్తాయి. పూరి జగన్నాథ్, మంచు లక్ష్మి, జయప్రద, మంచు మనోజ్‌కుమార్... తమ తమ పెట్స్‌తో మురిపెంగా ప్రేమాభిమానాలను పంచుకొంటున్నప్పుడు క్లిక్మనిపించినవి ఈ ఫోటోలు. ఇవి చాలు మూగజీవులతో అనుబంధం ఎంత ఆనందాన్నిస్తుందో చెప్పడానికి! -
అనుష్కపై కోలీవుడ్ గుర్రు
సెలబ్రిటీల జీవితం తెరచిన పుస్తకం లాంటిది. ప్రతి సాధారణ వ్యక్తీ చదవడానికి ఆసక్తి చూపిస్తాడు. అందుకే సెలబ్రిటీలు ఏ విషయంలోనైనా ఆచితూచి అడుగెయ్యాలి. ముఖ్యంగా వ్యాఖ్యలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకుంటే చిక్కులు తప్పవు. ఇక తారల విషయానికొస్తే మొన్న నచ్చిన హీరో అజిత్ అంటూ నటి త్రిషే నోరుపారేసుకుని నటుడు విజయ్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. అలాంటి పొరపాటే నటి అనుష్క చేసి సమస్యలు కొని తెచ్చుకున్నారని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. అందాల భామ అనుష్క ఇటీవల ఓ భేటీలో తన అభిమాన నటులెవరన్న ప్రశ్నకు అభిషేక్ బచ్చన్, షారూఖ్‌ఖాన్, హృతిక్ రోషన్ అంటూ బాలీవుడ్ నటులను చెప్పడం తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమల్లో కలకలం రేకెత్తించింది. నిజానికి ఈ బ్యూటీ తమిళంలో విజయ్, అజిత్, సూర్య, విక్రమ్ వంటి టాప్ హీరోలతో, తెలుగులో నాగార్జున, వెంకటేష్, మహేష్‌బాబు, ప్రభాష్ వంటి స్టార్ హీరోలతో నటించి ప్రముఖ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారు. అలాంటి వీరిలో ఎవరినీ తన అభిమాన హీరోగా చెప్పకుండా బాలీవుడ్ హీరోల పేర్లను చెప్పడం దక్షిణాది అభిమానుల కోపోగ్రహానికి గురయ్యారు. ఇప్పుడు వారంతా అనుష్కాకు వ్యతిరేకం. ఫేస్బుక్ల్లోను, ట్విట్టర్లలోనూ తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. అభిమానుల ఆగ్రహానికి గురైన ఏ హీరోయిన్ మనలేదన్నది అనుష్క, త్రిష లాంటి వారు గ్రహించాలంటున్నారు సినీ పండితులు.