అప్పుడు ఏడ్వాలో నవ్వాలో అర్థం కాలేదు!
సెలబ్రిటీల జీవితం చాలా సుఖంగా ఉంటుంది. అన్ని సౌకర్యాలూ ఉంటాయి. చీకూ చింతా లేకుండా హ్యాపీగా బతికేయొచ్చు అని చాలామంది అనుకుంటారు. కానీ, వాళ్లకూ ఇబ్బందులు ఉంటాయ్. బాడీగార్డులు లేకుండా బయటికొస్తే.. వీరాభిమానులతో ఇబ్బంది ఉండదు కానీ, వెర్రి అభిమానులతో ఇబ్బందులు తప్పవ్. అసలు సెలబ్రిటీలు ఏ మూడ్‌లో ఉన్నారో కూడా చూసుకోకుండా ఫొటోగ్రాఫులూ, ఆటోగ్రాఫులూ అడుగుతారు. ఇంకా ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు.
ఇటీవల రకుల్‌ప్రీత్ సింగ్‌కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. తెలుగు పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దూసుకెళుతోన్న రకుల్‌కి ఈ మధ్య కాస్త తీరిక చిక్కింది. అంతే.. తన క్లోజ్‌ఫ్రెండ్స్‌తో కలిసి లాస్ వేగాస్ వెళ్లారు. అక్కడికెళ్లాలనే కల రకుల్‌కి ఎప్పట్నుంచో ఉంది. వేగాస్‌లో చూడాల్సినవన్నీ చూసేసి, తిరుగు ప్రయాణమయ్యారు.
వేగాస్ నుంచి సీటెల్ వెళ్లి, అట్నుంచి దుబాయ్ వెళ్లి, అక్కణ్ణుంచి హైదరాబాద్ రావాలన్నది ఈ బ్యూటీ ప్లాన్. కట్ చేస్తే.. సీటెల్ ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంటరై, ఫ్లైట్ ఎక్కుదామనుకుంటున్న సమయంలో మెడ దగ్గర సన్నగా నొప్పి మొదలైందట. ఆ నొప్పి భరించలేనంత పెద్దది కావడంతో తన మ్యానేజర్‌కి ఫోన్ చేసి, విషయం చెప్పారు రకుల్. అప్పటికప్పుడు రకుల్‌ని ఆస్పత్రికి తీసుకెళ్లారట.
ఒకవైపు నొప్పితో రకుల్ విలవిలలాడుతుంటే.. అక్కడే ఉన్న ఒకావిడ, ‘మీరు రకుల్ కదూ’ అని అడగడంతో పాటు, ‘మీతో ఫొటో దిగాలని ఉంది’ అన్నదట. అలాంటి పరిస్థితిలో రకుల్‌కి ఏమనిపించి ఉంటుందో ఊహించవచ్చు. చుట్టూ ఉన్నవాళ్లు రకుల్ పరిస్థితి చెప్పడంతో, ఆవిడ ‘అయ్యో’ అని అక్కణ్ణుంచి వెళ్లిపోయారట. ‘‘నిజంగా నాకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు. ఏడుపు కన్నా నవ్వే వచ్చింది’’ అని రకుల్ పేర్కొన్నారు.