జీవిత కథకు ఐదు కోట్లు!
సెలబ్రిటీల జీవిత విశేషాలు తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అందుకే వీలు కుదిరినప్పుడల్లా వాళ్ల జీవితాల్లోకి తొంగి చూసి, విషయాలు తెలుసుకోవాలనుకుంటారు. సెలబ్రిటీ లైఫ్ అంటే అంత ఆసక్తి మరి. అందుకే వారి జీవితకథలతో వచ్చే సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అందులోనూ సంజయ్ దత్ వంటి నటుల జీవితాలను తెలుపుకోవడానికి చాలా ఆసక్తి చూపుతారు.
బహుశా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే సంజయ్ దత్ జీవిత కథతో సినిమా తీయాలని దర్శకుడు రాజ్‌కుమార్ హిరాని అనుకుని ఉంటారు. ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘లగేరహో మున్నాభాయ్’, ‘3 ఇడియట్స్’, ‘పీకే’ వంటి విలక్షణ చిత్రాలతో దర్శకునిగా తనదో ప్రత్యేకమైన శైలి అని నిరూపించుకున్నారు హిరాని. ‘పీకే’ తర్వాత సంజయ్ దత్ జీవితకథతో ఆయన చేయనున్న చిత్రం వచ్చే ఏడాది ఆరంభం కానుంది.
జీవిత కథను తెరకెక్కించడానికి అనుమతి ఇవ్వడానికి సంజయ్ దత్‌కి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారని సమాచారం. ‘మున్నాభాయ్’కి మూడో భాగంగా ‘మున్నాభాయ్ ఛలే అమ్రికా’ తీయాలని షరతు కూడా హిరానీకి సంజయ్ పెట్టారట. అందుకు సమ్మతించడంతోనే జీవిత కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇందులో తన పాత్రకు రణ్‌బీర్ కపూర్ పేరుని కూడా సూచించారని బాలీవుడ్ టాక్. అతిథి పాత్రలో కనిపించడానికి కూడా అంగీకరించారని భోగట్టా.