హారర్ చిత్రంలో శ్రావ్య
ఇటీవల కోలీవుడ్‌లో ప్రేమ, హాస్యం,యాక్షన్ కథా చిత్రాలు వస్తున్నా హారర్ కథా చిత్రాలదే హవా అని చెప్పక తప్పదు. ఆ కోవలో తెరకెక్కుతున్న తాజా చిత్రం వెళ్లిక్కిళమై 13ఆమ్ తేదీ గోవింద్ స్టూడియో పతాకంపై విక్రమ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తెలుగు నటి శ్రావ్య దెయ్యంగా పాత్రను పోషిస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో రతన్‌మైళి, సుజాకుమార్, రాంజీ, చిత్రాలక్ష్మణన్, ఎంఎస్.భాస్కర్, లివింగ్‌స్టన్, శ్యామ్,వైయాపురి, విజయరాజ్‌కీర్తీ, ఆర్.వినోద్‌కుమార్, రేఖ, నిరోషా, మధుమిత నటిస్తున్నారు. ఇంతకుముందు 13ఆమ్ పక్కం పార్క చిత్రాన్ని తెరకెక్కించిన పుగళ్‌మణి కథ, కథనం,మాటలు,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ 13వ తేదీ శుక్రవారం సైతానులకు సంతోషాన్ని, సకల శక్తిని అందించే రోజు అంటారన్నారు.
అలాంటి రోజున హీరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఈ ముహూర్తాన పెళ్లి పీటలపై కూర్చుంటాడని చెప్పారు. అప్పుడు పెళ్లి కూతురు రూపంలో ఒక రక్తపిశాచి వచ్చి కూర్చుంటుందన్నారు.అయితే ఆ వివాహాన్ని ఆపడానికి 13 దెయ్యాలు ప్రయత్నిస్తాయన్నారు. వాటి ప్రయత్నం ఫలించిందా? అసలు అలాంటి ముహూర్తంలో హీరో ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు? ఆ పిశాచితో అతని పెళ్లి అయ్యిందా? లాంటి ప్రశ్నలకు సమాధానమే వెళ్లిక్కిళమై 13ఆమ్ తేదీ చిత్రం అని చెప్పారు. ఆద్యంతం ఆసక్తికరంగా హారర్ సన్నివేశాలతో భయం పుట్టించే ఈ చిత్రంలో మరో ముఖ్య అంశం 150 అడుగు పొడవైన దేవతా విగ్రహ శిల చోటు చేసుకోవడం అన్నారు. ఇది చిత్రం చూసే ప్రేక్షకులకు పూనం వచ్చే విధంగా ఉంటుందన్నారు. తాజ్‌నూర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని మార్చిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు.