నాయికగా ఎన్నాళ్లని?
ఏ రంగంలో అయినా మార్పు అనేది సహజం. సినీ రంగం అందుకు అతీతం కాదు. నటీనటులు కూడా పరిస్థితులకనుగుణంగా తమను తాము మార్చుకుంటూ వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ పరిపక్వతతో కూడిన నటనతో ముందుకు పయనించాలి. హీరోల్లో సకలకళావల్లభుడు కమలహాసన్ ఇలాంటి భావాన్నే వ్యక్తం చేశారు. మరో నటుడు అజిత్ కూడా 41 వయసుకు తగ్గ పాత్రలను ఎంపిక చేసుకుంటూ ఇమేజ్ అనే చట్రం నుంచి బయటకొచ్చి వైవిధ్యభరిత పాత్రలతో విజయపథంలో కొనసాగుతున్నారు.
ఇక హీరోయిన్లలో నటి శ్రీయ ఇదే పంథాను అవలంభించాలనుకుంటున్నారు. శ్రీయ మంచి నటి. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె నవ నటుల నుంచి సూపర్‌స్టార్ రజనీకాంత్ స్థాయి హీరోలతో జతకట్టారు. అయితే నాయికగా దశాబ్దాన్ని దాటారు. ఇంకా హీరోయిన్‌గానే కొనసాగాలని కొంత కాలంగా బింకం చూపినా ప్రస్తుతం ఆ ఆలోచనల నుంచి బయటపడ్డారు. ఫలితంగా పలు విభిన్న నటనలకు అవకాశం ఉన్న పాత్రలు శ్రీయను వరిస్తున్నాయి. ఆ మధ్య తెలుగులో నాగార్జున సరసన మనం చిత్రంలో నటించారు.
ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా సమంత నటించారన్నది గమనార్హం. అయినా శ్రీయ నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఓ మైగాడ్ హిందీ చిత్రం రీమేక్ గోపాల గోపాల తెలుగు చిత్రంలో వెంకటేష్ సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ఇందులో ఆమె వెంకటేష్ భార్యగా నటిస్తున్నారన్నది గమనార్హం. ఈ సందర్భంగా శ్రీయ తన మనసులోని భావాలను వెల్లడిస్తూ తాను రజనీకాంత్, నాగార్జున లాంటి సీనియర్ నటుల సరసన నటించడం వలన ఈ తరం దర్శకులు కాస్త వయసు పాత్రలనే ఇస్తున్నారన్నారు. అందువలన ఇకపై హీరోయిన్ అనే చట్రం నుంచి బయటపడి అవకాశం ఉన్న పాత్రల్లో నటించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.