
ఎదుటివాళ్లను జడ్జ్ చేసే అధికారం ఎవరికీ లేదంటున్నారు హీరోయిన్ శృతి హాసన్. మన శరీరంలో వచ్చే మార్పులను స్వాగతిస్తే ప్రశాంత జీవనం గడుపవచ్చని పేర్కొన్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ గారాల పట్టిగా సినీ పరిశ్రమకు పరిచయమైనప్పటికీ... తనదైన నటన, సంగీత పరిజ్ఞానంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శృతి. ప్రియుడితో విడిపోవడం, కెరీర్ పరంగా కూడా సరైన విజయాలు లేకపోవడంతో.. గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న ఈ అమ్మడు తాజాగా తనపై వస్తున్న ట్రోల్స్‌కు గట్టి సమాధానమిచ్చారు. తాను హార్మోన్ సమస్యలతో బాధ పడుతున్నానని.. అందుకే తన రూపంలో మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు. బొద్దుగా ఉన్నా.. నాజూగ్గా తయారైనా పెద్దగా తేడా ఏమీ ఉండదంటూ.. బాడీ షేమింగ్ చేసే వాళ్లకు కౌంటర్ ఇచ్చారు. తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు.
‘ఎదుటి వాళ్ల అభిప్రాయాలకు అనుగుణంగా నా జీవితాన్ని కొనసాగించలేను. ఆమె లావుగా ఉంది. అయ్యో సన్నగా ఉందేంటి.. ఇలాంటి మాటలు పట్టించుకోను. ఇప్పుడు నేను షేర్ చేసిన ఈ రెండు ఫొటోలు రోజుల వ్యవధిలో తీసినవి. ప్రతీ మహిళ తనకు అన్వయించుకునే విషయాలు ఇప్పుడు నేను పంచుకోబోతున్నాను. హార్మోన్ల సమస్య కారణంగా మానసికంగా, శారీరకంగా నేను ఎంతో వేదనకు గురయ్యాను. అది చాలా కష్టమైన విషయం. ఇప్పుడు నేను కాస్త ప్రశాంతంగా ఉన్నాను. ఇది నా జీవితం.. నా ముఖం.. అవును.. నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా. ఈ విషయాన్ని చెప్పడానికి ఏమాత్రం సిగ్గుపడటం లేదు. అలా అని దీన్ని చాటింపు వేసి చెప్పాలా? లేదా దీనికి వ్యతిరేకంగా మాట్లాడాలా? నేను అలా ఎప్పటికీ చేయను. నేను జీవించాలని నిర్ణయించుకున్నాను అంతే. శరీరం, ఆలోచనల్లో వచ్చే మార్పులను స్వాగతించడమే మనకు మనం చేసుకునే గొప్ప సాయం. ప్రేమను పంచండి. ఆనందంగా ఉండండి. ప్రతీరోజూ నన్ను నేను కొత్తగా ప్రేమించడం నేర్చుకుంటున్నాను. ఎందుకంటే నా గొప్ప ప్రేమకథ.. నన్ను ప్రేమించుకోవడంతోనే ముడిపడి ఉంది. మీరు కూడా ఇలాగే ఆలోచిస్తారనుకుంటున్నా’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. కాగా శృతి హాసన్.. ప్రస్తుతం రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘క్రాక్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. (అది తల్చుకుంటేనే వణికిపోతున్నాను: నటి)
Comments
Please login to add a commentAdd a comment