Ravi Teja Krack Movie Review In Telugu | మాస్‌ మసాలా వయొలెంట్‌ క్రాక్‌ - Sakshi
Sakshi News home page

రివ్యూ టైమ్‌: మాస్‌ మసాలా వయొలెంట్‌ క్రాక్‌

Published Mon, Jan 11 2021 8:19 AM | Last Updated on Mon, Jan 11 2021 11:40 AM

Review Time: Raviteja Krack Movie Review - Sakshi

చిత్రం: క్రాక్‌;
తారాగణం: రవితేజ, శ్రుతీహాసన్‌;
నిర్మాత: బి. మధు;
కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: గోపీచంద్‌ మలినేని;
రిలీజ్‌: జనవరి 9.

ఎట్టకేలకు సంక్రాంతి సినిమా సీజన్‌ మొదలైంది. థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీతోనే కరోనా కాలంలోనూ సందడి షురూ అయింది. ఈ సంక్రాంతికి తొలి భారీ కానుకగా రవితేజ ‘క్రాక్‌’ థియేటర్లలో పలకరించింది. ఆర్థిక వివాదాలతో తొలి రోజు సెకండ్‌ షో నుంచి కానీ ఆటలు పడలేదు. ఆట పడుతుందని పొద్దుటి నుంచి పదే పదే హాళ్ళకు వచ్చి, తిరిగెళ్ళిన జనాన్ని బట్టి చూస్తే, అనుకున్నట్టు రిలీజై ఉంటే, రవితేజ కెరీర్‌లో ‘క్రాక్‌’ బిగ్గెస్ట్‌ ఓపెనింగ్‌ అయ్యుండేదని ట్రేడ్‌ టాక్‌. పోలీస్‌ యాక్షన్‌ చిత్రాలు వెండితెరకు కొత్త కాదు కానీ, హాళ్ళు లేక, సినిమాలు లేక జనం ముఖం వాచిపోయిన ఈ రోజుల్లో ఇలాంటి పక్కా ఊర మాస్‌ కథ కచ్చితంగా కలిసొచ్చే అంశమే. ఒకింత హింస పాలు ఎక్కువే అయినా, రీలు రీలుకీ ఫైట్లు, మాస్‌ మెచ్చే పాటలతో ఓ కథ తెరపైకి రావడం పండగ వేళ బాక్సాఫీస్‌కు బలం చేకూర్చే విషయం. కథేమిటంటే..: కర్నూలుకొచ్చిన తీవ్రవాది సలీమ్‌ భత్కల్‌కీ, ఒంగోలు జనాన్ని గడగడలాడించే కఠారి కృష్ణ (సముద్రఖని)కీ, కడపలోని గూండా కొండారెడ్డి (పి. రవిశంకర్‌)కీ ఒకడే శత్రువు – బదిలీల మీద ఊళ్ళు తిరిగిన పోలీస్‌ సి.ఐ. శంకర్‌ (రవితేజ). యాభై రూపాయల నోటు, మామిడి కాయ, మేకు – ఈ మూడింటికీ, ఆ ముగ్గురు విలన్‌ల కథలకూ ఓ లింక్‌ ఉంటుంది. ఆ లింకేమిటి, వారితో హీరో ఎలా డీల్‌ చేశాడన్నది ఈ పక్కా మాస్‌ యాక్షన్‌ ఫిల్మ్‌.



ఎలా చేశారంటే..: ఈ సినిమాలో రవితేజ ఎప్పటిలానే హుషారైన యాక్షన్, డ్యాన్సులతో కనిపిస్తారు. ఆయన పోషించిన పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ పోతరాజు వీరశంకర్‌ మాస్‌ పాత్ర చూడగానే, అనివార్యంగా ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళతాం. దశాబ్దం పై చిలుకు క్రితం రాజమౌళి దర్శకత్వంలో రవితేజ నటించిన ‘విక్రమార్కుడు’ చిత్రం ఛాయలు ఈ పాత్రలో, పాత్రపోషణలో వద్దనుకున్నా కనిపిస్తాయి. కఠారి కృష్ణగా సముద్ర ఖని, అతని నెచ్చెలి జయమ్మగా వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ బాగున్నారు. చాలాకాలం తరువాత తెలుగులో కనిపించిన హీరోయిన్‌ శ్రుతీహాసన్‌ది పరిమితమైన పాత్ర. దానికి తగ్గట్టే నటన. ఎలా తీశారంటే..: మాస్‌ యాక్షన్‌ ఎనర్జీతో వెండితెరను వెలిగించే రవితేజకు ‘రాజా ది గ్రేట్‌’ (2017) తరువాత సరైన బాక్సాఫీస్‌ హిట్‌ లేదు. ఆ కొరత క్రాక్‌ తీర్చే ఛాన్స్‌ పుష్కలం. ‘డాన్‌ శీను’, ‘బలుపు’ తరువాత దర్శకుడు గోపీచంద్‌ మలినేనితో రవితేజ చేసిన మూడో సినిమా ఇది. ఒంగోలు ప్రాంతానికి చెందిన దర్శకుడు గోపీచంద్‌ మలినేని అక్కడ చిన్నప్పుడు కథలు కథలుగా విన్న సంఘటనల్ని ఏర్చికూర్చి, సినిమాటిక్‌గా అల్లుకున్నారు. విజయ్‌ సేతుపతి తమిళ చిత్రం ‘సేతుపతి’ స్ఫూర్తీ కనిపిస్తుంది. హీరో వెంకటేశ్‌ వాయిస్‌ ఓవర్‌తో మొదలయ్యే కథ మధ్యలో అక్కడక్కడే తిరుగుతూ, సెకండాఫ్‌కు వచ్చేసరికి సాగదీత అనిపిస్తుంది. కత్తెరకు కొంత పదును పెట్టలేదనీ కనిపించేస్తుంది. అయినా సరే, ఆడియన్స్‌ను కదలకుండా కూర్చోబెట్టడం దర్శకుడి కథన విశేషం. 


రామజోగయ్య శాస్త్రి  రాసిన ‘భల్లేగా తగిలావే బంగారం...’ పాట (గానం – అనిరుధ్‌ రవిచంద్ర), అలాగే జానీ మాస్టర్‌ సారథ్యంలోని ఐటమ్‌ సాంగ్‌ ‘భూమ్‌ బద్దలు నా ముద్దుల సౌండు...’ (గానం – మంగ్లీ, సింహా, శ్రీకృష్ణ) కథలో భాగంగా, మాస్‌ను ఆకట్టుకుంటాయి. బుర్రా సాయిమాధవ్‌ రాసిన డైలాగులూ ఆ కోవలోనే మెరుస్తాయి. తమన్‌ నేపథ్య సంగీతం అడపాదడపా పరిమితి దాటినా, మొత్తం మీద మూడ్‌ను క్యారీ చేస్తుంది. రామ్‌ – లక్ష్మణ్‌ ఫైట్లు మరో ప్లస్‌ పాయింట్‌. జి.కె. విష్ణు కెమేరా పనితనంలో నైట్‌ ఎఫెక్ట్‌లో బస్‌ స్టాండ్‌ లో జరిగే ఫైటు, అలాగే బీచ్‌లో ఫైటు థ్రిల్‌ చేస్తాయి. కథాకాలమేదో స్పష్టంగా చెప్పని ఈ సినిమాలో – గాడిద రక్తం తాగి, హత్యలకు దిగే వేటపాలెం బ్యాచ్, వారి ప్రవర్తన – ఒకప్పటి వాస్తవమే అయినా, ఇప్పుడు బీభత్సంగా కనిపిస్తుంది. తెరపై యథేచ్ఛగా హింస కనిపించే ఈ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ‘ఎ’ బదులు, ‘యు/ ఎ’ అని పడిందేమో అనిపిస్తుంది. దర్శక, రచయితలు సహజంగానే హీరో ఎలివేషన్‌ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. సినిమాలో ఒకటికి మూడు కథలున్నాయి. అన్ని కథలనూ చెప్పే క్రమంలో కఠారి కృష్ణ పాత్రకే తప్ప మిగతా ఇద్దరు ప్రత్యర్థి పాత్రలూ సమగ్రమైన ఫీలింగ్‌ రాదు. ఆసక్తిగా మొదలైన మూడు కథల కాన్సెప్ట్‌ పెరిగిన నిడివితో, ఆఖరులో ఆశించిన తృప్తినివ్వకుండా ముగిసిందనిపిస్తుంది. అయితేనేం, పండగకు వినోదం కోసం వెతుకులాటలో ఉన్నవారిని అవన్నీ మరిచిపోయేలా చేస్తుంది. కొసమెరుపు: ఒకే టికెట్‌ పై ముగ్గురు విలన్ల ఊర మాస్‌ జాతర

బలాలు:
⇔ ఊపిరి సలపనివ్వని మాస్‌ కథ, కథనం 
⇔ రవితేజ హుషారైన యాక్షన్, డ్యాన్సులు
⇔ వినూత్నమైన ఫైట్లు, రీరికార్డింగ్‌ మెరుపులు

బలహీనతలు:
మితిమీరిన హింస
⇔ సాగదీతకు గురైన కథ, క్లైమాక్స్‌ 
⇔ హీరోయిన్‌ ట్రాక్‌ పక్కాగా సెట్‌ కాకపోవడం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement