టైటిల్ : క్రాక్
జానర్ : యాక్షన్ థ్రిల్లర్
నటీనటులు : రవితేజ, శ్రుతీహాసన్, వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని, సుధాకర్ కోమాకుల, వంశీ, రవి శంకర్, సప్తగిరి తదితరులు
నిర్మాణ సంస్థ : సరస్వతి ఫిలిం డివిజన్
నిర్మాత : ‘ఠాగూర్’మధు
దర్శకత్వం : గోపీచంద్ మలినేని
సంగీతం : తమన్ ఎస్
సినిమాటోగ్రఫీ : జీకే విష్ణు
ఎడిటర్ : నవీన్ నూలి
విడుదల తేది : జనవరి 9, 2021
మాస్ మహరాజా రవితేజ సినిమాలు ఈ మధ్య కాలంలో పెద్దగా ఆడలేదు. 'రాజా ది గ్రేట్' తర్వాత ఆయన ఖాతాలో బిగ్ హిట్ మూవీ పడిందే లేదు. గత ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన 'డిస్కో రాజా' ప్రయోగం కూడా విఫలమైంది. ఈ సారి పక్కా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు రవితేజ. ఇందులో భాగంగానే తనకు గతంలో 'డాన్ శ్రీను', 'బలుపు' లాంటి సూపర్ హిట్లు ఇచ్చిన యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో జత కట్టి 'క్రాక్' అనే మూవీ చేశాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై పాజిటీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దీంతో ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా నేడు ‘క్రాక్’ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా రవితేజను హిట్ ట్రాక్ ఎక్కించిందా?, గోపిచంద్ మలినేని, రవితేజ కాంబో హ్యాట్రిక్ విజయం సాధించిందా?, నిజ జీవిత కథలను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? అనేది రివ్యూలో చూద్దాం.
కథ
పోత రాజు వీర శంకర్ (రవితేజ) ఒక క్రేజీ పోలీసు. బ్యాగ్రౌండ్ అని ఎవడైనా విర్రవీగితే చాలు వాళ్ల బరతం పడతాడు. ఇలా వేర్వేరు నగరాల్లో ముగ్గురు నేరస్థులతో తనదైనశైలీలో సీఐ వీర శంకర్ వైరం పెట్టుకుంటాడు. వారిలో ఒంగోలుకు చెందిన కటారి (సముద్రఖని ) అత్యంత శక్తివంతమైనవాడు. అతను అంటే చుట్టుపక్కల 20 ఊర్లకు భయం. అలాంటి వ్యక్తిపై వీరశంకర్ తిరుగుబాటు చేస్తాడు. తన సహోద్యోగి కొడుకు చావుకు కారణాలు తెలుసుకునే క్రమంలో కటారితో వైరం మరింత పెరుగుతుంది. ఈ క్రమంలో వీరశంకర్‌ని చంపడానికి కటారి రకరకలా ప్లాన్ వేస్తాడు. మరి కటారి, వీర శంకర్ ల మధ్య అసలు ఏమి జరిగింది ?, చివరకు వీరశంకర్ ఏమి చేశాడు ? అనేది మిగిలిన కథ.
నటీనటులు
మాస్ అనే పదానికి పర్యాయపదంలా కనిపిస్తాడు రవితేజ. ఆయన సినిమాలో కథ మొత్తం అతని చుట్టే తిరుగుతుంటుంది. ఇక ఈ సినిమాలో కూడా ఆయన వన్ మ్యాన్ షో నడిచింది. మాస్ మహారాజాలోని ఫైర్‌ను మరోసారి మనం తెరపై చూడొచ్చు. రవితేజ అభిమానులకు అయితే కన్నులపండువలా ఉంటుంది. ఎనర్జీతో పాటు స్టైలిష్‌గా కూడా కనిపించారు. సీఐ పోత రాజు వీర శంకర్ అనే పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర రవితేజ ఒదిగిపోయాడు. సినిమా మొత్తాన్ని తన భుజస్కందాలపై నడిపించారు. అలాగే జయమ్మ అనే నెగెటివ్ పాత్రలో వరలక్ష్మీ శరత్‌కుమార్ మెప్పించారు. రవితేజ తరవాత సినిమాలో బాగా పండిన పాత్ర సముద్రఖనిది. ’కఠారి‘ అనే విలన్ పాత్రకు ఆయన జీవం పోశాడు. తన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. శృతీహాసన్, సుధాకర్,రవి శంకర్, తమ పాత్రల పరిధి మేర నటించారు.
విశ్లేషణ
రియల్ క్యారెక్టర్స్‌ను కమర్షియల్ సినిమాలోకి పర్‌ఫెక్ట్‌గా బ్లెండ్ చేసి తీసిన సినిమా ‘క్రాక్’. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. మాస్ ఆడియన్స్‌కి నచ్చే సినిమా తీయాలనేది దర్శకుడి మెయిన్ టార్గెట్ అనేది సినిమా మొదలైన కొద్ది నిమిషాలకే అర్థమవుతంది. మావిడికాయలో మేకు గుచ్చి, ఒక యాభై రూపాయల నోటుపై దానిని పెట్టి... కథ మొదలు పెట్టినపుడు ఇదంతా కాస్త సిల్లీగా అనిపిస్తుంది. కానీ సినిమా కథ మొత్తం అదే అని చెబుతూ.. తెరపై చూపించిన విధానం కాస్త కొత్తగా అనిపిస్తుంది. మొత్తానికి దర్శకుడు ఎదో కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. కథ నేపథ్యాన్ని హీరో వెంకటేశ్‌తో చెప్పించడం, వేటపాలెం బ్యాచ్ ఒకటి బీచ్‍లో ఇసుకలోంచి బయటకు వచ్చి... గాడిద రక్తం తాగేసి అరగడం కోసం అటు ఇటు పరుగెత్తడం ప్రేక్షకులను కాస్త కొత్తగా అనిపిస్తుంది.
అయితే కొన్ని సీన్లు మాత్రం కాస్త సిల్లీగా అనిపిస్తుంది. ఇస్త్రీ బట్టలు తీసుకెళుతున్న మహిళ చేతిలోంచి జారి పడ్డ బట్టల్లో బురఖా జారి పడడం చూసి హీరో వెళ్లి ఒక టెర్రరిస్టుని పట్టుకోవడం, అలాగే మెయిన్ విలన్ కేసుకు సంబంధించి పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ కాపీ వెతుకుతుండగా, అది గోడ మీద నుంచి జారిపడడం అంత కన్వీనియంట్‌గా అనిపించదు. అలాగే సినిమా కథ కూడా కాస్త రొటీన్‌గా సాగుతుంది. నెక్ట్ ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ఈజీగా గెస్ చెయ్యగలడు. కానీ రోటీన్ కథని దర్శకుడు తెరపై చూపించే విధానం చాలా బాగుంది. ఇక హీరో, హీరోయిన్స్ రొమాంటిక్ ట్రాక్ సైతం పండలేదు. శ్రుతి హాసన్ మంచి సినిమాతోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది, కానీ పాపం, ఆమె మాత్రం పాటలకు మరియు కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితం అయిపొయింది.
ఇక ఈ సినిమాకి ప్రధాన బలం సంగీతం. తమన్ తన పాటలతో పాటు.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశాడు. తనదైన బిబీఎంతో యాక్షన్ సీన్లకు ప్రాణం పోశాడు. ఇక రామ్‌లక్ష్మణ్ పోరాట ఘట్టాలు సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. ఫైట్స్ చాలా కొత్తగా ఉన్నాయి. సినిమాలో రవితేజ విలన్స్ కి మధ్య జరిగే పోరాటాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. యాక్షన్ సీన్లు అన్ని మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. జీకే విష్ణు సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే సంక్రాంతి సందర్భంగా రవితేజ తన ఫ్యాన్స్‌కి మాస్ మసాలా బిర్యానీని అందించాడు.
ప్లస్ పాయింట్స్ :
రవితేజ నటన, వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని పాత్రలు
తమన్ మ్యూజిక్
విలన్లకు, హీరోకి మధ్య జరిగే యాక్షన్ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
ఫస్టాఫ్ ఫ్యామిలీ సీన్స్
అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment