
డిమాండ్ చేస్తే.. బికినీకి ఓకే!
‘‘పరభాషలో హిట్ సాధిస్తే ఆ మజాయే వేరు. భవిష్యత్తు బంగారంలా ఉంటుందనే నమ్మకాన్ని ఆ హిట్ కలగజేస్తుంది.ప్రస్తుతం ఆ నమ్మకంతోనే ఉన్నా’’ అని శ్రుతీ సోథీ చెప్పారు. కల్యాణ్‌రామ్ నటించిన ‘పటాస్’ ద్వారా నాయికగా పరిచయమయ్యారీ ఉత్త రాది భామ. మాతృభాష పంజాబీలో మూడు చిత్రాల్లో నటించారామె. సినిమాల్లోకి రాక ముందు శ్రుతి ఓ టీవీ చానల్‌లో న్యూస్ ప్రెజెంటర్‌గా చేశారు. ఆ పాత్రనే ‘పటాస్’లో చేయడం ఆనందంగా ఉందన్నారు శ్రుతి. ‘‘హిందీలోకి అనువదించిన తెలుగు చిత్రాలను టీవీ చానల్స్‌లో చూశాను.
ఆ విధంగా ఇక్కడి చిత్రాలు ఎలా ఉంటాయో తెలిసింది. తెలుగులో తొలి చిత్రమే ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్‌లో చేయడం ఆనందంగా ఉంది. దర్శకుడు అనిల్ రావిపూడి ప్రతి సన్నివేశాన్నీ స్పష్టంగా చెప్పేవారు. భాష తెలియకపోయినా బాగా నటించగలగడానికి అదే కారణం’’ అని చెప్పారు. సంప్రదాయబద్ధ పాత్రలకే పరిమితం కావాలనుకోవడంలేదనీ, సన్నివేశం డిమాండ్ చేస్తే బికినీ ధరించడానికి వెనకాడననీ అన్నారు.