చెన్నై: సినీరంగంలో ఏదైనా జరగొచ్చు. ముఖ్యంగా రాజకీయాల్లోనూ, సినీరంగంలోనూ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న మాట ఉండనే ఉంది. అలా ఒక సంచలన జంటను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. అసలు విషయం ఏమంటంటే మన్నన్ చిత్రాన్ని ఎవరూ అంత తేలిగ్గా మరిచిపోవడం జరగదు. కారణం సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. ఇంకా చాలా కారణాలే ఉన్నాయి. అందులో అప్పటి లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి కథానాయకిగా రజనీకాంత్‌ను ఢీకొనే పాత్రలో నటించారు. ఇక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ శివాజీ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి పి.వాసు దర్శకుడు. ఇప్పుడీ చిత్రాన్ని రీమేక్ చేయాలని శివాజీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్ణయించుకుంది. మన్నన్ రీమేక్‌లో రజనీకాంత్ పాత్రల్లో సంచలన నటుడు శింబును, విజయశాంతి పాత్రలో నయనతారను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది.
మన్నన్ చిత్రంలో రజనీకాంత్, గౌండ్రమణిల కామెడీ ప్రేక్షకులను రంజింపజేసినా, నటి విజయశాంతి లేడీ సూపర్‌స్టార్ ఇమేజ్, తనదైన నటనా ఆ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చాయన్నది వాస్తవం. అందుకే ప్రస్తుతం లేడీ సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్న నయనతారను ఆ పాత్రలో నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక రజనీకాంత్ పాత్రలో శింబును ఎంపిక చేయాలనుకోవడానికి కారణం ఆయన నటనా వేగం, నయనతారతో గతంలో ప్రేమ లాంటి అంశాలు చిత్రానికి మంచి పబ్లిసిటీ బూస్ట్‌నిస్తాయన్న భావన కావచ్చు. ఈ సంచలన జంట మళ్లీ కలిసి నటించడానికి అంగీకరిస్తారా అన్న ప్రశ్నకు ఇక్కడ ఏదైనా జరగవచ్చుననే టాక్ వినిపిస్తోంది. శింబు, హన్సికల మధ్య ప్రేమ కూడా పెళ్లి వరకూ వచ్చి నిలిచిపోయింది. అలాంటిది వారిద్దరూ కలిసి మహా చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో నటించి మెరవబోతుండడంలా! నటన అన్నది వృత్తి కాబట్టి శింబు, నయనతార కూడా నటించే అవకాశం ఉంటుందంటున్నారు సినీ వర్గాలు. ఈ జంట గనుక మళ్లీ జత కడితే ఆ చిత్రంపై అంచనాలేవేరు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే మన్నన్ చిత్ర పునర్నిర్మాణం గురించి చాలా కాలంగానే చర్చలు జరుగుతున్నా సెట్‌పైకి వెళ్లలేదు.కారణం మిస్టర్‌లోకల్ చిత్రమేనట. ఇది వినోదభరిత కథా చిత్రమే అయినా ఇంచుమించు మన్నన్ చిత్ర కాన్సెప్టేనని టాక్ రావడంతో ఆ చిత్ర ఫస్ట్‌లుక్ విడుదల వరకూ వేచి చూసే ధోరణిలో శివాజీ ప్రొడక్షన్స్ అధినేతలు ఉన్నారట. మొత్తంమీద మన్నన్ చిత్ర రీమేక్‌పై మరి కొద్దిరోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment