అమితాబ్ సార్ కు హ్యాట్సాఫ్ : ఎస్పీ బాలు
హైదరాబాద్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మద్ధతు తెలిపారు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్ - పాక్ జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన మ్యాచ్‌కి ముందు బిగ్ బి అమితాబ్ బచ్చన్ జాతీయ గీతాన్ని ఆలపించారు. జాతీయ గీతాన్ని తప్పుగా ఆలపించారంటూ అమితాబ్ పై పిఆర్ ఉల్లాస్ అనే డాక్యుమెంటరీ దర్శకుడు ఢిల్లీలోని న్యూ అశోక్‌నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుచేశాడు. ఈ కేసు వివాదంపై బాలు గారు తీవ్రంగా మండిపడ్డారు.
అమితాబ్ సార్ జాతీయ గీతాన్ని చాలా బాగా ఆలపించారని, తాను చాలా గర్వపడుతున్నాని.. ఆయనకు హ్యాట్సాప్ అంటూ బాలు గారు తన ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. నిర్ధిష్ట సమయం కచ్చితంగా పాడాలని లేకపోతే చర్యలు తీసుకోవడానికి చట్టాలు కూడా ఉన్నాయా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తంచేశారు. లతా మంగేష్కర్, భీమ్ సేన్ జోషీ, బాలమురళీ గారితో పాటు తాను జనగనమణను ప్రాక్టీస్ చేసేవాడినని అయితే ఏ ఒక్కరూ ఇంత సమయం పాడాలని తనకు ఎప్పుడు చెప్పలేదని జాతీయ అవార్డు గ్రహీత బాలు అన్నారు. దేశంలో ప్రస్తుతం ఎన్నో సమస్యలు ఉన్నాయని అలాంటి వాటిని అరికట్టేందుకు తోడ్పడాలని సూచించారు. అంతేకానీ, పాపులర్ అయ్యేందుకు ఏదో ఓ విషయాన్ని పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారేందుకని బాలు తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.