అమితాబ్ జాతీయగీతాన్ని తప్పుగా పాడారా?
టి-20 ప్రపంచకప్‌లో భాగంగా.. భారత్ - పాక్ జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌కి ముందు బాలీవుడ్ పెద్దమనిషి బిగ్ బి అమితాబ్ బచ్చన్ జాతీయ గీతాన్ని ఆలపించారు. అయితే, దాన్ని ఆయన తప్పుగా మాట్లాడారంటూ ఫిర్యాదు దాఖలైంది. పిఆర్ ఉల్లాస్ అనే డాక్యుమెంటరీ దర్శకుడు ఢిల్లీలోని న్యూ అశోక్‌నగర్ పోలీసు స్టేషన్‌లో ఈ ఫిర్యాదు దాఖలు చేశారు. అమితాబ్ పదే పదే జాతీయగీతాన్ని తప్పుగా పాడుతున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈసారి ఈడెన్ గార్డెన్స్‌లో ఆయన తన సొంత శైలిలో ఒక నిమిషం 10 సెకండ్ల పాటు పాడారని, అయితే హోం మంత్రిత్వ శాఖ రూపొందించిన నిబంధనలతో పాటు ఇంతకుముందు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కూడా ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని తెలిపారు.
జాతీయగీతాన్ని పాడే విషయంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ కొన్ని కచ్చితమైన నియమ నిబంధనలను రూపొందించింది. వీటిని దేశంలో ప్రతి పౌరుడూ పాటించాలి. వీటిలో ఒకటి.. జాతీయ గీతాన్ని సరిగ్గా 52 సెకండ్లలో పాడాలి. కానీ అమితాబ్ మాత్రం 18 సెకండ్ల సమయం అధికంగా తీసుకున్నారు. దాంతోపాటు, 'మంగళ దాయక' అనడానికి బదులు 'మంగళ నాయక' అని పాడారని కూడా ఉల్లాస్ ఫిర్యాదులో చెప్పారు. జాతీయగీతంలోని పదాల విషయంలో స్వేచ్ఛ తీసుకోకూడదని, కానీ బిగ్‌బీ అలా తీసుకున్నారని తెలిపారు. తన ఫిర్యాదు కాపీని ఆయన ప్రధానమంత్రి కార్యాలయానికి, హోం మంత్రిత్వశాఖకు కూడా పంపారు.