ఏమిటో ఇద్దరు కూడబలుక్కుని వెళ్లిపోయారు
హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు రామకృష్ణ లేరనే వార్త జీర్ణించుకోలేనిదని ప్రముఖ గాయని సునీత అన్నారు. 'గొప్ప సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాధన్, గొప్ప గాయకుడు రామకృష్ణను వెనువెంటనే కోల్పోవడం బాధాకరం. ఏమిటో ఇద్దరు కూడబలుక్కుని వెళ్లిపోయారు. ఇద్దరు క్యాన్సర్తో సఫర్ అయ్యారు. నేను రామకృష్ణ గారిని చూసి ఏడాది అయింది. అయితే క్యాన్సర్తో బాధపడుతున్నా ఆయన ఈ విషయాన్ని ఎక్కడా బయటకు రానివ్వలేదు. ఎవర్ని కలవడానికి కూడా ఇష్టపడలేదు.
నేను క్యాన్సర్ను జయించి బయటకు వచ్చి మాత్రమే అందరితో మాట్లాడతాను అన్న వ్యక్తి ..అదే ట్రీట్మెంట్లో అందర్ని వదిలి వెళ్లిపోయారు. నిజంగా ఇది చాలా షాకింగ్గా ఉంది. భౌతికంగా రామకృష్ణగారు మన మధ్య లేకపోయినా..ఆయన పాటలు మన మధ్యనే చిరస్థాయిగా ఉంటాయి. మేమందరం ఆయన పాటలను బోయిలుగా మోస్తాం. ఆయన ఏడాదిగా క్యాన్సర్ ట్రీట్మెంట్తో నరకం అనుభవిస్తే...రామకృష్ణగారి కుటుంబసభ్యులు నరకాన్ని చూశారు. తలచుకుంటేనే బాధగా ఉంది. రామకృష్ణగారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నా' అని సునీత అన్నారు.