
మన గొంతులో పాటలా...మనతోటే ఉన్నట్టుగా..!
1937 ప్రాంతంలో... ‘లాహోర్’లో కె.ఎల్. సైగల్‌గారి సంగీత కార్యక్రమం జరపడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. సరిగ్గా ప్రోగ్రాం మొదలు కాబోతుండగా కరెంటు పోయింది. కరెంటు వస్తేగాని పాడనని కె.ఎల్. సైగల్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అప్పుడో కుర్రవాడు నిర్వాహకుల్ని కలిసి, ‘‘అయ్యా నా తమ్ముడికి ఒక్క ఛాన్సు ఇస్తే కరెంటు వచ్చే వరకూ... ప్రేక్షకుల్ని ఆనందపరుస్తాడు...’’ అని వినయంగా అన్నాడు. అప్పటికే ప్రేక్షకులు నానా గోలా చేస్తుండటంతో నిర్వాహకులు ఒప్పుకోక తప్పలేదు. ఆ బుడత గాయకుడే మహమ్మద్ రఫీ.
హాలు మొత్తం 13 సంవత్సరాల ఈ బుడతడి ప్రజ్ఞకు ఊగిపోయింది. అక్కడున్న సంగీత దర్శకుడు శ్యామ్ సుందర్ ‘రఫీ’ని దగ్గరికి పిలిచి ‘‘నీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది. బొంబాయి వచ్చెయ్’’... అని ఆహ్వానం పలికాడు.రఫీ పుట్టింది అమృత్‌సర్ దగ్గరున్న ‘కోట్లా సుల్తాన్‌సింగ్’ అనే ఊళ్లో (అవిభక్త పంజాబ్‌లో ఉండేదది). చిన్నతనం నుంచీ రఫీకి సంగీతం అంటే ప్రాణం. హిందుస్తానీ, శాస్త్రీయ సంగీతాల్లో మహామహుల దగ్గర శిక్షణ పొంది అద్భుతమైన స్వర సంపద మూటగట్టుకున్నారు రఫీ.1944లో అంటే తన ఇరవయ్యవ ఏట రఫీ తన మొదటి పాటని ‘గుల్‌బలోచ్’ అనే పంజాబ్ సినిమా కోసం శ్యామ్‌సుందర్ సంగీత దర్శకత్వంలో పాడారు.
ఆ తరవాత నౌషాద్ ‘పెహలేఆప్’, ఆ తరువాత లైలా మజ్ఞు, జుగ్ను, అన్‌మోల్‌ఘడీ... ఇలా ఏ సినిమాలో పాడినా రఫీ తన స్వరమంత్రజాలంతో ప్రేక్షకుల్ని సమ్మోహనపరిచేవారు. హుషారు పాటైనా, విషాదమైనా, తత్వమైనా, ఏదైనా సరే రఫీ స్వరంలో ప్రాణం పోసుకునేది. గాయకుడు తలత్ మహమూద్ ధూమపానం అలవాటు రఫీకి వరమైంది. అదెలా అంటే... నౌషాద్‌కి సిగరెట్టన్నా, దాని వాసనన్నా మహా చికాకు. స్టూడియోలో తలత్ సిగరెట్ తాగడం చూసిన నౌషాద్ ఆ చికాకులోనే, అర్జంటుగా రమ్మని రఫీకి కబురెట్టారు.
అసలు సంగతేమంటే, ‘బైజొబావ్‌రా’ పాటలన్నీ తలత్ పాడాల్సింది. ‘సిగరెట్’ పెట్టిన చికాకుతో నౌషాద్‌గారు మొత్తం పాటలన్నీ రఫీతో పాడించారు. ఆ సినిమా ఓ మైలురాయిగా సినీ చరిత్రలో మిగిలిపోతే, మహమ్మద్ రఫీ స్వరం దేశమంతా మారుమోగి పోయింది. అంతే! సంగీత ప్రపంచంలో ఓ ‘విజేత’ అవతరించాడు. ఓ అమర గాయకుడు అవతరించాడు. ‘మన్ తర్‌పత్’ పాట విన్న ఆనందంలో కన్నీరు కార్చని శ్రోతలేడు. హీరో భరత్ భూషణ్‌కి శాశ్వత కీర్తినిచ్చిందా సినిమా. రఫీ వెనుతిరిగి చూడలేదు. విజయపరంపర.. ప్రవాహం. ‘చాహే కోయీ ముఝే జంగ్లీ కహే’ అని రఫీ పాడుతుంటే ‘యా... హూ...’’ అంటూ కుర్రకారు వెర్రెత్తి అరిచారు.
‘ఏ మేరా ప్రేమ్ పఢ్‌కర్’ అని రఫీ సుమధురంగా ఆలపిస్తే ప్రేమని ద్వేషించే వాళ్లు కూడా ప్రేమలేఖలకు తలవొంచారు.‘‘ఓ దేఖో ముఝ్‌సే రూఠ్‌కర్... మేరీ జాన్ జారిహ హై’ అని ‘అలక’ మీదున్న ‘చిలకని’ రఫీసాబ్ తన స్వరంతో సవరిస్తుంటే కుర్రకారు ప్రియురాళ్లని అదే పాట పాడి అనునయించారు. రఫీ లేకపోతే ఖచ్చితంగా షమ్మీ ‘షమ్మి’ కాడు. దేవానంద్, దిలీప్, రాజ్‌కపూర్, షమ్మికపూర్, శశికపూర్, జాయ్‌ముఖర్జీ, రాజేంద్రకుమార్, మనోజ్ కుమార్, ధర్మేంద్ర.. ఇలా తరాలు గడిచిపోయినా రఫీ ‘స్వరం మాత్రం మారలేదు. ఒక్కసారి మాత్రం కిశోర్ కుమార్ సృష్టించిన సంగీత ప్రభంజనానికి కాస్త పలచబడ్డా... ‘హ్‌కిసీసే కమ్‌నహీ’ అని అన్నట్టుగా మళ్లీ అద్భుతంగా పుంజుకుంది. చిట్టచివరి క్షణం వరకూ అదే ఊపు! ఎన్ని పాటలో!! అందుకే ఆయన్ని మ్యూజిక్ ‘మెజీషియన్’ అనేవారు.
రఫీని స్మరించుకోవడం అంటే... భారతీయ సంగీతాన్ని స్మరించుకోవడమే. రఫీకి అంజలి ఘటించడమంటే... చలనచిత్ర సంగీతానికి సాష్టాంగ నమస్కారం చెయ్యడమే!మహమ్మద్ రఫీ పరమపదించిన రోజున (31 జూలై 1980) బాంబే మొత్తం మూగబోయింది. వేలాది మంది అభిమానులు రఫీ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మన గొంతులో పాటలా... మన కళ్లల్లో కలగా... మన జీవితంలో భాగంలా... మనతోటే ఉన్నట్టుగా...! అభీనా జావో ఛోడ్ కర్... ఏ దిల్ అభీ భరా నహీ’’ అని పాడుకుంటే, ఆయనే మరలి వస్తారు... మధుర స్మృతిగా.