
అందుకే వాయిదా వేశాం!
‘‘ఊరిని దత్తత తీసుకోవడం అంటే రంగులు, రోడ్లు వేసి వెళ్లిపోతాననుకున్నార్రా! వీణ్ణి, వాణ్ణి, వాణ్ణి వీళ్లందరినీ, నిన్ను... మొత్తాన్ని దత్తత తీసుకున్నా’’ అని తనదైన శైలిలో మహేశ్‌బాబు చెప్పిన డైలాగ్‌ని ఆయన తాజా చిత్రం ‘శ్రీమంతుడు’ టీజర్‌లో అందరూ చూసే ఉంటారు. ఈ ఒక్క డైలాగ్‌తో ఆయన పాత్ర చిత్రణ ఎలా ఉంటుందో క్లుప్తంగా చెప్పానంటున్నారు చిత్రదర్శకుడు కొరటాల శివ.
మహేశ్‌బాబు, శ్రుతీహాసన్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్(సి.వి.యమ్) నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7న విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘టీజర్‌లో మహేశ్ సైకిల్ తొక్కుకుంటూ వెళ్లడం చూపించాను. దానికి ఈ కథలో చాలా ప్రాముఖ్యం ఉంది. మహేశ్ ఈ మధ్యే ఓ పల్లెటూరును దత్తత తీసుకున్నారు. కానీ, అంతకు ముందే ఆయనకు ఈ చిత్రకథ చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. వచ్చే నెల 10న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నాం. అప్పటికి ‘బాహుబలి’ విడుదల తేదీ ఖరారు కాలేదు.
కానీ, ఆ చిత్రం తేదీ ప్రకటించడంతో ఒకే రోజున రెండు పెద్ద సినిమాలు విడుదలైతే ఇబ్బందిగా ఉంటుందని మా చిత్రాన్ని వాయిదా వేశాం. పైగా మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌కు ఇంకాస్త టైమ్ పడుతుంది. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ పాత్రలు ఈ చిత్రానికే హైలై ట్’’ అన్నారు. ‘‘వచ్చే నెల 18న ఆడియోను విడుదల చేయనున్నామని, ఆగస్ట్ 9న మహేశ్ పుట్టినరోజుని పురస్కరించుకుని, కానుకగా రెండు రోజుల ముందే ‘శ్రీమంతుడు’ని విడుదల చేయనున్నాం’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: మది, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: చంద్రశేఖర్ రావిపాటి.