భాగ్యనగరిలో... దక్షిణాది సినీ ఉత్సవం
హిందీ సినిమాకు సంబంధించి గడచిన పదహారేళ్ళుగా ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ’ (ఐఫా) ఉత్సవాలు తొలిసారిగా దక్షిణాదికి విస్తరిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రాంతీయ భాషల (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం) సినిమాల ప్రముఖులనూ ఒకే వేదికపై తీసుకురానున్నాయి. డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో ఈ ‘ఐఫా ఉత్సవం - 2015’కు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఔట్‌డోర్ స్టేడియమ్ వేదిక కానుంది. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ‘ఐఫా’ నిర్వాహకులైన ‘విజ్‌క్రాఫ్ట్ ఇంటర్నేషనల్’ డెరైక్టర్ విజ్ సబ్బాస్‌జోసెఫ్ ఈ సంగతి ప్రకటించారు.
ఈ కొత్త ముందడుగుకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐ.టి. శాఖ మంత్రి కె. తారకరామారావు (కెటీఆర్) సంతోషం వ్యక్తం చేస్తూ, ‘‘భారతీయ సినిమాకు సంబంధించి అద్భుత ప్రతిభ, అసలు వ్యవహారం అంతా - వింధ్య పర్వతాలకు దిగువన దక్షిణాదిలోనే ఉంది. ఏటా విడుదల చేసే సినిమాల సంఖ్యలో దేశంలోనే రెండో పెద్ద చిత్రపరిశ్రమ తెలుగు చిత్రసీమ. ఇవాళ రెండో అతిపెద్ద గ్రాసర్ ‘బజ్‌రంగీ భాయ్‌జాన్’ రచయిత కూడా తెలుగువాడే. ఆస్కార్ అవార్డ్ విజేతలు కూడా దక్షిణాదిలో ఉన్నారు. ఇన్నేళ్ళ తరువాతైనా ‘ఐఫా’ను దక్షిణాది సినిమాకు విస్తరించాలని భావించడం చాలా బాగుంది’’ అని వ్యాఖ్యానించారు. ముందుగా వాగ్దానం చేసినట్లుగా రాగల మూడేళ్ళ పాటు ఈ ‘ఐఫా - ఉత్సవం’ భాగ్యనగరిలో జరగాలనీ, అందుకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహాయ, సహకారాలు అందిస్తుందనీ ఆయన పేర్కొన్నారు.
గడచిన పదహారేళ్ళలో 4 ఖండాల్లో, 11 దేశాల్లోని 14 వేర్వేరు నగరాల్లో జరిగిన ‘ఐఫా’ ఉత్సవం ఇలా దక్షిణాది సినిమాకు విస్తరించడం పట్ల ప్రముఖ నటుడు ‘పద్మభూషణ్’ కమలహాసన్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘హిందీతో సహా వివిధ భాషల్లో సినిమాలు తీసిన విజయ (నాగిరెడ్డి - చక్రపాణి), ఏ.వి.ఎం, జెమినీ, సురేష్ ప్రొడక్షన్స్ (రామానాయుడు) లాంటి జాతీయస్థాయి ప్రముఖ సంస్థలు, నిర్మాతలు దక్షిణాది వారే. రామానాయుడు గారు 13 భాషల్లో సినిమాలు తీశారు. వీళ్ళందరూ మన సినిమాను ఉన్నతస్థాయికి తీసుకెళ్ళినవారు. ఇవాళ ప్రపంచంలోనే బలిష్ఠమైన పరిశ్రమ దక్షిణాది చిత్రసీమే’’ అని కమల్ అన్నారు.
హీరోలు నాగార్జున , వెంకటేశ్‌లు ఈ ఉత్సవం పట్ల ఆనందం ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ - వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని యాదవ్ మాట్లాడుతూ, సౌతిండియన్ సినిమాకు ఈ ఉత్సవం మంచి అవకాశ మన్నారు. సినీ ప్రముఖులు కె.ఎస్. రామారావు, అల్లు అరవింద్, డి. సురేశ్‌బాబు, ‘జెమినీ’ కిరణ్, దేవిశ్రీ ప్రసాద్, అల్లు శిరీష్, రామ్మోహన రావు, స్పాన్సరర్లు విప్లవ్, అల్లూరి నారాయణరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమన్నా హల్‌చల్ సమావేశంలో హీరోయిన్ తమన్నా ప్రత్యేక ఆకర్షణయ్యారు. ఆమె ధరించిన బటర్ ఫ్లై డ్రెస్ చర్చనీ యాంశమైంది. పారదర్శకంగా, శరీర మంతా కనపడే మోడ్రన్ డ్రెస్‌లో మిల్కీ బ్యూటీ వస్తుంటే అందరూ కళ్ళప్ప గించారు.
‘ఐఫా’లో ఏం జరుగుతుందంటే...
2000లో ‘ఐఫా’ అవార్డుల ఉత్సవం మొదలైంది. ప్పుడు తొలిసారి ‘ఐఫా ఉత్సవం’ పేరిట మన దక్షిణాది భాషా సినిమాలకు విస్తరించింది.‘ఐఫా - ఉత్సవం’ 2015 మూడు రోజుల పాటు ఈ డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లోని గచ్చీబౌలీ ఔట్‌డోర్ స్టేడియమ్‌లో జరుగుతుంది.మొదటి రోజున ‘ఫిక్కీ’తో కలసి ‘ఐఫా’ బిజినెస్ ఫోరమ్‌ను నిర్వహించ నుంది. సినీ టూరిజమ్, కో-ప్రొడక్షన్స్, పెట్టుబడి అవకాశాల్ని చర్చిస్తారు.రెండో రోజు తమిళ, మలయాళ చిత్రసీమల్లోని ప్రతిభావంతుల్ని సన్మానిస్తారు. మూడో రోజు తెలుగు, కన్నడ సినీ ప్రముఖుల్ని గౌరవిస్తారు.