పుల్లకూర ఆవకాయ ఢీ! | telugu movies remakes on other languages | Sakshi
Sakshi News home page

పుల్లకూర ఆవకాయ ఢీ!

Published Thu, Mar 30 2017 11:31 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

పుల్లకూర ఆవకాయ ఢీ! - Sakshi

పుల్లకూర ఆవకాయ ఢీ!

ఢీ... ఢీ... ఢీ... డిమాండ్‌. మన ఆవకాయలాగా ఇప్పుడు తెలుగు సినిమాను కూడా లొట్టలేసుకుని రీమేక్‌ చేస్తున్నారు. ఇంతకు ముందు పొరుగింటి పుల్లకూర తెచ్చుకుని మనం ఎన్నోసార్లు పప్పులో కాలేశాం. రీమేకులు అబౌట్‌ టర్న్‌ కొట్టాయి. వాళ్ల సినిమాలను మనం తీయడం కాదు... మన సినిమాలను ఇప్పుడు వాళ్లందరూ తీస్తున్నారు.

నానా పటేకర్‌ బిర్యాని వడ్డిస్తారు
నాటుకోడి పలావ్‌... ఎండుచేప వేపుడు.. పులస ఇగురు... హైదరాబాదీ దమ్‌ బిర్యాని... ఒక్కొక్కరికి ఒక్కో ఐటమ్‌ నచ్చుతుంది. ఎవరి http://img.sakshi.net/images/cms/2017-03/51490897968_Unknown.jpgటేస్ట్‌ వాళ్లది. దర్శకుడిగా నటుడు ప్రకాశ్‌రాజ్‌ది డిఫరెంట్‌ టేస్ట్‌. ‘ధోని’, ‘ఉలవచారు బిర్యాని’, ‘మన ఊరి రామాయణం’ సినిమాల్లో ప్రకాశ్‌రాజ్‌ టేస్ట్‌ తెలుస్తుంది. ఈ టేస్ట్‌ హిందీ నటుడు నానా పటేకర్‌కు నచ్చినట్టుంది. ఉత్తరాది ప్రేక్షకులకు రుచి చూపించాలని ‘ఉలవచారు బిర్యాని’ని హిందీలో ‘తడ్కా’గా రీమేక్‌ చేస్తున్నారు. నానా పటేకర్‌కు అంతగా నచ్చిన ఈ సినిమాలో ఏముందని అడిగితే 45 ఏళ్ల లేటు వయసులో ఓ వ్యక్తి ఫోనులో పరిచయమైన అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ, వయసును సాకుగా చూపించి, ఆ అమ్మాయి ఎక్కడ వదిలేస్తుందోననే భయంతో నేరుగా కలవాల్సిన టైమ్‌ వచ్చినప్పుడు మేనల్లుణ్ణి పంపిస్తాడు. ఆ అమ్మాయికీ వయసు ఎక్కువే. దాంతో స్నేహితురాల్ని పంపిస్తుంది. వీళ్లిద్దరూ ప్రేమలో పడతారు. కానీ, నలుగురిలో తప్పు చేస్తున్నామనే ఫీలింగ్‌. దాంతో రెండు ప్రేమ జంటల మధ్య దూరం పెరుగుతుంది. తర్వాత వాళ్లు ఎలా కలిశారు? అనేది సినిమా. ప్రకాశ్‌రాజ్‌ ముఖ్య పాత్రలో నటించడంతో పాటు ప్రతి సన్నివేశాన్ని హృద్యంగా తెరకెక్కించారు. ఇప్పుడీ సినిమా హిందీ రీమేక్‌లో ప్రకాశ్‌రాజ్‌ పాత్రను నానా పటేకర్, స్నేహ పాత్రను శ్రియ, సంయుక్త పాత్రను తాప్సీ చేస్తున్నారు. ‘తడ్కా’కు ప్రకాశ్‌రాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నిజం చెప్పాలంటే మలయాళ హిట్‌ ‘సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌’కు ‘ఉలవచారు బిర్యాని’ రీమేక్‌. కానీ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా చాలా మార్పులు చేశారు.

సంజయ్‌ దత్‌ ‘ప్రస్థానం’
http://img.sakshi.net/images/cms/2017-03/61490898090_Unknown.jpgదేవా కట్టా తీసిన ‘ప్రస్థానం’లో కథతో పాటు నడిచే పాత్రలు తప్ప హీరోలు, విలన్లు ఉండదు. ఈ కథలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ రాజకీయ నాయకుడు ‘నేను చనిపోతే నా పిల్లలకు (కొడుకు, కుమార్తె) తండ్రిగా, నా తండ్రికి కొడుకుగా, ఊరి నాయకుడిగా నా స్థానంలో నిలబడతావా?’ అని అనుచరుణ్ణి అడుగుతాడు. నాయకుడు కావాలనే ఆశతో ఉన్న అనుచరుడు అలాగే అని అంగీకరించి ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉన్నా అతణ్ణి చంపేస్తాడు. నాయకుడి భార్యను పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తండ్రి అవుతాడు. నాయకుడిగా ఎదుగుతాడు. కొన్నేళ్ల తర్వాత సవతి కొడుకుల మధ్య నాయకత్వ పోరు మొదలవుతుంది. అప్పుడు తండ్రిగా అతను ఏం చేశాడు? కన్న కొడుకును ఎక్కువగా చూసుకున్నాడా? కన్న కొడుకులా పెంచిన నాయకుడి బిడ్డను ఎక్కువగా చూసుకున్నాడా? అనేది మహాభారతాన్ని తలపిస్తుంది. సాయికుమార్, శర్వానంద్‌ల నటన, వాళ్లిద్దరి మధ్య సీన్స్, కథ ప్రేక్షకులను కదిలించాయి. ఆ ప్రేక్షకుల్లో బాలీవుడ్‌ ‘ఖల్‌ నాయక్‌’ సంజయ్‌దత్‌ కూడా ఉన్నారు. అందుకే, ఈ సినిమా హిందీ రీమేక్‌లో నటించి, నిర్మించడానికి ముందుకొచ్చారు. హిందీ వెర్షన్‌కూ దేవా కట్టా దర్శకత్వం వహిస్తారు. అక్టోబర్‌లో చిత్రీకరణ ప్రారంభిస్తారట! సాయికుమార్‌ పాత్రను హిందీలో సంజయ్‌ చేయనున్నారు. తెలుగులో విడుదలైన ఐదేళ్ల తర్వాత హిందీలో ఈ సినిమాను రీమేక్‌ చేస్తున్నారంటే కథలో ఎంత దమ్ముందో అర్థం చేసుకోవచ్చు.

‘‘తెలుగులో మంచి కథలు వస్తున్నాయి. చిన్నోళ్ల దగ్గర్నుంచి పెద్దోళ్ల వరకూ హీరోలందరూ మారుతున్నారు. స్క్రీన్‌ప్లే బేస్డ్, క్యారెక్టర్‌ బేస్డ్, స్టోరీ బేస్డ్‌ సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్‌ సినిమాలు టీవీ, ఇంటర్నెట్‌ వల్ల పల్లెటూరి వరకూ చేరుతున్నాయి. అవి చూసిన ప్రేక్షకుల అభిరుచి మారుతోంది. అందుకు తగ్గట్టు మన దర్శక–రచయితలు కొత్త కథలతో వస్తున్నారు’’
– దేవా కట్టా

చెన్నైలో ‘పెళ్లి చూపులు’
తమిళ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ ప్రతి సినిమా తెలుగులో డబ్బింగ్‌ అవుతుంది. ఆయన సినిమాలకు తెలుగులో బోలెడంత మంది http://img.sakshi.net/images/cms/2017-03/41490898179_Unknown.jpgఅభిమానులున్నారు. కానీ, ఓ చిన్న తెలుగు సినిమా చూసిన గౌతమ్‌ మీనన్‌ ఆ సినిమాకు అభిమాని అయ్యారు. ఆయన అభిమానం ఎంతంటే... తానే నిర్మాతగా తమిళంలో రీమేక్‌ చేసేంత. గౌతమ్‌ మనసు దోచుకున్న ఆ సినిమా ‘పెళ్లి చూపులు’. ఇందులో ఏముందని అడిగితే... ఏం లేదు. పెళ్లి చూపులకు ఓ ఇంటికి వెళ్లబోయిన ఓ యువకుడు, మరో అమ్మాయి ఇంటికి వెళతాడు. ఇది తెలిసి వచ్చేద్దామంటే.. రూమ్‌ లాక్‌ పడుతుంది. ఈలోపు ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకుంటారు. బద్ధకస్తుడైన అబ్బాయి షెఫ్‌ కావాలనుకుంటాడు. అమ్మాయి ఫుడ్‌ ట్రక్‌ బిజినెస్‌ చేయాలనుకుంటుంది. ఇద్దరూ కలసి ఫుడ్‌ ట్రక్‌ స్టార్ట్‌ చేస్తారు. ప్రేమలో పడతారు. పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకున్నప్పుడు ఇద్దరి దారులు వేరవుతాయి. మళ్లీ ఎలా కలిశారు? అనేది కథ. చెప్పుకోవడానికి చాలా సింపుల్‌ కథే. కానీ, దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ సహజత్వానికి దగ్గరగా... యువతీయువకులు తమ కథే అనుకునేలా తీశారు. విజయ్‌ దేవరకొండ, రీతూ వర్మ అద్భుతంగా నటించారు. ‘పెళ్లిచూపులు’ తమిళ రీమేక్‌ ‘పొన్‌ ఒండ్రు కండేన్‌’లో తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు.

రణవీర్‌తో దయాగాడి దండయాత్ర
http://img.sakshi.net/images/cms/2017-03/61490898275_Unknown.jpg‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒకడు మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర’ – ‘టెంపర్‌’లో ఈ డైలాగూ, సినిమా... రెండూ సూపర్‌హిట్టే. ఈ సినిమా కథేంటంటే అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ లాంటోడు ఇన్‌స్పెక్టర్‌ దయా. ఎదుటోడు ఎంత పెద్ద దారుణం చేసినా లంచం అందుకుని వదిలేస్తాడు. అలాంటోడు అనూహ్యంగా నిజాయితీపరుడిగా ఎలా మారిపోతాడనేది సినిమా. నిర్భయ ఘటన స్ఫూర్తితో ఈ సినిమా తీశారు. రేప్‌ చేసినోళ్లలో నేనూ ఒకణ్ణి అని క్లైమాక్స్‌లో హీరో ఉరిశిక్షకు సిద్ధపడే సీన్‌ను ఎన్టీఆర్‌ వంటి మాస్‌ ఇమేజ్‌ ఉన్న హీరో అంగీకరించడం ఓ సాహసమే. హీరోని నెగిటివ్‌ షేడ్స్‌లో చూపిస్తూ హీరోయిజమ్‌ను ముందుకు తీసుకువెళ్లిన దర్శకుడు పూరి జగన్నాథ్‌ గట్స్‌ను మెచ్చుకోకుండా ఉండలేం. నటనతో ఎన్టీఆర్‌... సూపర్‌ టేకింగ్, బుల్లెట్స్‌ లాంటి డైలాగులతో దర్శకుడు పూరి చేసిన ఈ దండయాత్రకు బాక్సాఫీస్‌ బద్దలయింది. కమర్షియల్‌ సినిమాకు కావల్సిన సరుకులన్నీ ఇందులో ఉన్నాయి. సౌత్‌ సినిమాలను బాగా ఇష్టపడే హిందీ దర్శకుడు రోహిత్‌ శెట్టి ఇప్పుడీ సరుకును ముంబై తీసుకువెళ్తున్నారు. రణవీర్‌ సింగ్‌ హీరోగా హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. తెలుగులో హీరోయిన్‌గా నటించిన కాజల్‌ అగర్వాల్‌నే హిందీ ‘టెంపర్‌’లో హీరోయిన్‌గా ఎంపిక చేశారట! రోహిత్‌శెట్టి తీసిన ‘బోల్‌ బచ్చన్‌’ తెలుగులో ‘మసాలా’గా రీమేక్‌ అయింది. ఇప్పుడాయన ఓ తెలుగు సినిమాను హిందీలో రీమేక్‌ చేయడానికి రెడీ అయ్యారు. ఇది మనకు గర్వకారణమే.

‘అభిషేక్‌ బచ్చన్‌ హీరోగా ‘టెంపర్‌’ను హిందీలో రీమేక్‌ చేయాలనుకున్నా. ‘ఎన్టీఆర్‌లా నేను నటించలేను’ అన్నారు అభిషేక్‌. ఇప్పుడు రణవీర్‌ సింగ్‌ హీరోగా రోహిత్‌శెట్టి రీమేక్‌ చేస్తున్నారు. ముంబయ్‌ వెళ్లి హిందీ సినిమా తీయడం పెద్ద కష్టం కాదు. హిందీ హీరోలు మనతో సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. సౌత్‌ కథలను ఇష్టపడుతున్నారు. కానీ ఓ సినిమా పట్టాలు ఎక్కడానికి మూణ్ణాలుగు నెలలు టైమ్‌ పడుతుంది. ఆల్రెడీ నాకు ఇక్కడ ఉన్న కమిట్‌మెంట్స్‌ వల్ల కుదరడం లేదు’  
– పూరి జగన్నాథ్‌.

లిస్టులో మరికొన్ని....
నాగార్జున హీరోగా కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ను తెలుగు ప్రేక్షకులకు కూడా బాగాhttp://img.sakshi.net/images/cms/2017-03/71490898351_Unknown.jpg సుపరిచితుడైన హీరో ఉపేంద్ర కన్నడంలో రీమేక్‌ చేయాలనుకుంటున్నారు. ‘మన్మథుడు’, ‘కృష్ణ’ వంటి పలు తెలుగు సినిమాలను ఆయన కన్నడంలో రీమేక్‌ చేశారు.

ఎన్టీఆర్‌–పూరి జగన్నాథ్‌ల ‘టెంపర్‌’ తమిళంలో కూడా రీమేక్‌ అవుతోంది. ‘టెంపర్‌’ తమిళ రీమేక్‌లో విశాల్‌ హీరోగా నటించనున్నారు.

నిఖిల్‌ హీరోగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’. పెద్ద నోట్లు రద్దయిన టైమ్‌లో విడుదలై మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని అర్జున్‌ కపూర్, శ్రద్ధా కపూర్‌ జంటగా హిందీలో రీమేక్‌ చేయడానికి వీఐ ఆనంద్‌ ప్రయత్నిస్తున్నారు. తమిళ, కన్నడ భాషల్లోనూ రీమేక్‌ కానుంది.

నందమూరి కల్యాణ్‌రామ్‌ ‘పటాస్‌’ను తమిళంలో రాఘవా లారెన్స్‌ హీరోగా ‘మొట్ట శివ కెట్ట శివ’ పేరుతో సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ రీమేక్‌ చేసింది. ఈ నెల 9న ఈ సినిమా విడుదలైంది.

ఇవే కాదు... మరికొన్ని సూపర్‌హిట్‌ తెలుగు సినిమాలను ఇతర భాషల హీరోలు, దర్శక–నిర్మాతలు రీమేక్‌ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement