అతిథులందు ప్రత్యేక అతిథులు వేరయా!
ఓ పక్క సంతోషం.. మరో పక్క ఇంటికొచ్చిన అతిథులకు చేసే మర్యాదలతో హడావుడి. చుట్టాలొస్తే ఆ సందడే వేరు. పండగలప్పుడో.. ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే చుట్టాలు వస్తారు. సినిమాల్లోనూ అంతే! హీరో, హీరోయిన్ పాటలు పాడుకుంటున్నప్పుడో, కథ కీలక మలుపు తీసుకుంటున్నప్పుడో అతిథులు వస్తారు. ఆ అతిథుల్లో ప్రత్యేకమైన అతిథులు కొందరు ఉంటారు. తెరపై తళుక్కుమన్న ఆ ప్రత్యేక అతిథిని చూడగానే ప్రేక్షకుడి కళ్లల్లో ఓ ఆనందం.
ఆ అతిథి రాకతో ఆ సన్నివేశానికి సందడి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ‘అతిథులందు ప్రత్యేక అతిథులు వేరయా!’ అన్నట్టు ప్రస్తుతం సెట్స్ మీదున్న, సెట్స్ మీదకు వెళ్లనున్న సినిమాల్లో ప్రత్యేక అతిథి పాత్రల్లో కనిపించనున్న ‘స్టార్స్’ కొంతమంది ఉన్నారు. ఆ ప్రత్యేక అతిథులు ఎవరంటే..?
ప్రయోగాత్మక చిత్రాలకు, పాత్రలకు వెనకడుగు వేయని నటుడు నాగార్జున. మంచి కథ, పాత్ర అని భావిస్తే.. కీలక పాత్రల్లో నటించడానికి ఎప్పుడూ ముందుంటారు. స్టార్ స్టేటస్ గురించి ఆలోచించరు. అంత నిర్మలమైన మనసు ఆయనది. గతంలో పలు చిత్రాల్లో అతిథిగా కనిపించిన నాగార్జున, ప్రస్తుతం నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయం అవుతున్న ‘నిర్మలా కాన్వెంట్’లో ప్రత్యేక పాత్ర పోషించారు. ఇందులో ఆయన పాత్ర ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
మేనల్లుడిపై ప్రేమమ్..
కథానాయకుడిగా మూడు దశాబ్దాల ప్రయాణంలో విక్టరీ వెంకటేశ్ అతిథిగా కనిపించిన సందర్భాలు చాలా అరుదు. నాలుగేళ్ల క్రితం అన్నయ్య సురేశ్‌బాబు కొడుకు రానా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’లో వెంకీ ఓ పాటలో తళుక్కుమన్నారు. ఇప్పుడు మేనల్లుడిపై ప్రేమతో మళ్లీ అతిథి పాత్ర కోసం మేకప్ వేసుకున్నారు. నాగచైతన్య నటిస్తున్న ‘ప్రేమమ్’లో వెంకీ కీలక పాత్రలో నటించారు. మామా అల్లుళ్ల మధ్య సన్నివేశాలు సూపరంటున్నారు యూనిట్ సభ్యులు. సినిమాలో వీరిద్దరి మధ్య రిలేషన్ ఆసక్తి కలిగిస్తుందట.
నాగ్‌తో నాలుగోసారి!
కథానాయికగా పరిచయం చేసిన నాగార్జున అంటే అనుష్కకు అభిమానం ఉండటం సహజమే. అందుకే నాగ్ సరసన కథానాయికగా నటించడంతో పాటు అప్పుడప్పుడూ ఆయన సినిమాల్లో అతిథి పాత్రలు కూడా చేస్తుంటారు అనుష్క. ఇప్పటివరకూ మూడుసార్లు ఈ మన్మధుడి చిత్రాల్లో అనుష్క అతిథిగా సందడి చేశారు. అవి ‘కింగ్’, ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘ఊపిరి’. తాజాగా హాథీరామ్ అనే భక్తుడి పాత్రలో నాగార్జునతో కె.రాఘవేంద్రరావు తెరకెక్కిస్తున్న భక్తిరసాత్మక చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’లో అనుష్క అతిథి పాత్ర చేస్తున్నారు. అయితే, అతిథి పాత్ర కంటే కాస్త నిడివి ఎక్కువ ఉంటుందట.
‘అభినేత్రి’లో హిందీ దర్శకురాలు
ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా హీరోగా రీ-ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘అభినేత్రి’. తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ కమ్ డెరైక్టర్ ఫరాఖాన్ అతిథిగా కనిపించనున్నారు. సినీ నేపథ్యంలో సాగే ఓ సన్నివేశంలో ఫరా దర్శకురాలిగా కనిపిస్తారని సమాచారం.
కలిసొచ్చిన అతిథి
సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రధారిగా ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన హిందీ సినిమా ‘అకీరా’. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్లతో సౌతిండియా ప్రేక్షకులను అలరించిన లక్ష్మీ రాయ్ ఈ సినిమాతో బాలీవుడ్‌కి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఈ చిత్రంలో లక్ష్మీ రాయ్ అతిథి పాత్ర చేశారు. ఈ పాత్ర చిత్రీకరణ మొదలుపెట్టాక హిందీ చిత్రం ‘జూలీ 2’లో లక్ష్మీ రాయ్‌కి కథానాయికగా అవకాశం వచ్చింది. సో.. హిందీలో లక్ష్మీరాయ్‌కి అతిథి పాత్ర కలిసొచ్చిందన్న మాట.
ఇంకా అతిథి పాత్రల్లో పలువురు తారలు కనిపించనున్నారు. తమిళ చిత్రం ‘ఓకే కన్మణి’ (‘ఓకే బంగారం’) హిందీ రీమేక్ ‘ఓకే జాను’లో షారుక్ ఖాన్ అతిథిగా నటించనున్నారని సమాచారం. అలాగే సంజయ్ దత్ జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రంలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్ర చేసే అవకాశం ఉంది. ‘‘సంజయ్ దత్ జీవిత కథతో తీసే సినిమాలో నేను నటించకపోతే అసంపూర్ణంగా ఉంటుంది’’ అని సల్మాన్‌ఖాన్ స్వయంగా ప్రకటించారు. తెలుగు విషయానికి వస్తే.. చిరంజీవి 150వ చిత్రంలో చిన్న పాత్రలో అయినా నటించడానికి సిద్ధమని అల్లు అర్జున్ ఎప్పుడో ప్రకటించారు.
ఇటీవల రామ్‌చరణ్ కూడా దర్శకుడు వీవీ వినాయక్ కోరితే, పాటలో కనిపిస్తానని చెప్పారు. మరి.. ఈ ఇద్దరూ 150వ చిత్రానికి స్పెషల్ అవుతారా? లేదా? అనేది వేచి చూడాలి. కనిపిస్తే అభిమానులు పండగ చేసుకుంటారు. ఫైనల్‌గా చెప్పాలంటే ఓ స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరోనో, హీరోయినో కనిపిస్తే కచ్చితంగా అది సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుంది. కొన్నిసార్లు బిజినెస్‌కి కూడా ఉపయోగపడుతుంది. అందుకే ‘అతిథి దేవోభవ’ అనొచ్చు.
- సత్య పులగం