
‘‘నిర్మాతగా నా తొలి చిత్రం ‘చెంబు చినసత్యం’ నన్ను తీవ్రంగా నిరాశ పరిచింది. ఆర్థికంగానూ నష్ట పరిచింది. ఆ సినిమా నేర్పిన పాఠాలతో ఇప్పుడు రెండు మంచి సినిమాలు నిర్మిస్తున్నాను. వాటిలో ఒకటి ‘ఐపిసి సెక్షన్.. భార్యాబంధు’. రెండో చిత్రం ‘నేనే ముఖ్య మంత్రి’ కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది. ‘ఐపిసి సెక్షన్.. భార్యాబంధు’ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని నిర్మాత ఆలూరి సాంబశివరావు అన్నారు. శరత్‌చంద్ర, నేహా దేశ్ పాండే జంటగా ఆమని, మధునందన్ ముఖ్య పాత్రల్లో రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘ఐపిసి సెక్షన్.. భార్యాబంధు’ సినిమా ఈనెల 29న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా ఆలూరి సాంబశివరావు మాట్లాడుతూ– ‘‘కెమెరామెన్ కావాలని కలలు కన్నా. కుదరకపోవడంతో నిర్మాతనయ్యా. మహిళల రక్షణ కోసం మన రాజ్యాంగంలో పొందుపరిచిన ఓ సెక్షన్‌ని కొందరు మహిళలు ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే అంశానికి వినోదం జోడించి నిర్మించాం. ఈనెల 29న మా సినిమాతో పాటు ఏడెనిమిది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మా సినిమాపై మాకు నమ్మకముంది. ‘నేనే ముఖ్యమంత్రి’ చిత్రాన్ని రెండు మూడు నెలల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.