‘వావ్’ అనిపించింది! | Special Chit Chat With Pooja Hegde | Sakshi
Sakshi News home page

‘వావ్’ అనిపించింది!

Published Tue, Dec 16 2014 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM

‘వావ్’ అనిపించింది!

‘వావ్’ అనిపించింది!

 దేవుడు స్పెషల్ సాఫ్ట్‌వేర్‌తో డిజైన్ చేసినంత అందంగా ఉంటారు పూజా హెగ్డే. తన తొలి సినిమా ‘ఒక లైలా కోసం’తోనే తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయారామె. ఆమె వరుణ్‌తేజ్‌కి జోడీగా నటించిన ‘ముకుంద’ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మించిన ఈ చిత్రం గురించీ, తన భవిష్యత్ ప్రణాళికల గురించీ పూజా హెగ్డే చెప్పిన ముచ్చట్లు.
 
 ‘ముకుంద’లో సంప్రదాయబద్ధంగా కనిపిస్తున్నారు. ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?
 ఇందులో నేను పక్కా తెలుగింటి అమ్మాయిని. రావు రమేశ్‌గారిది నా తండ్రి పాత్ర. ఆయన మాట జవదాటని కూతుర్ని నేను. ఈ కథకు నా పాత్ర కేంద్ర బిందువు. పాత్రలన్నీ నా చుట్టూ తిరుగుతుంటాయి. వరుణ్‌తేజ్ పాత్ర విషయానికొస్తే... కృష్ణుడి పాత్రలో ఉంటే షేడ్స్ ‘ముకుంద’లో వరుణ్ పాత్రలో కనిపిస్తాయి. విలువలున్న కథతో జనరంజకంగా శ్రీకాంత్ ఈ చిత్రాన్ని మలిచారు.
 
 తెలుగు నేర్చుకున్నట్లున్నారు. ఆడియో ఫంక్షన్‌లో ఏకంగా పాటే పాడేశారు?
 ‘గోపికమ్మ...’ పాట వినడానికే కాదు చూడ్డానికి కూడా ఆ పాట మధురంగా ఉంటుంది. అందుకే ఇష్టంగా ఆ పాట నేర్చుకున్నాను. మణి కెమెరా పనితనం, రాజుసుందరం కొరియోగ్రఫీ ఆ పాటకు ప్రాణం పోశాయి.
 
 దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో పనిచేయడం ఎలా అనిపించింది?
 శ్రీకాంత్ గొప్ప నేరేటర్. కథ ఎంత గొప్పగా చెప్పాడో, అంతకంటే క్యూట్‌గా సినిమా తీశాడు. నటన విషయంలో ఆర్టిస్టులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తారు తను. అందుకే... సన్నివేశాల్లో మా నటన సహజంగా అనిపిస్తుంది. కాస్ట్యూమ్స్ దగ్గర్నుంచీ, ప్రతి చిన్న విషయాన్నీ ఆయన దగ్గరగా గమనిస్తారు. ఈ కథ తను చెప్పినప్పుడే ‘వావ్’ అనిపిం చింది. శ్రీకాంత్ ప్రీవియస్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో...’ చూశాను. దానికంటే ఈ చిత్రం ఇంకా బాగుంటుంది.
 
 తెలుగులో తొలి సినిమా అక్కినేని వంశీకుడితో, రెండో సినిమా మెగా ఫ్యామిలీ హీరోతో! ఎలా ఉంది ఫీలింగ్?
 మేమందరం ఒకే ఏజ్‌గ్రూప్‌లోని వాళ్లం. అందుకే... సెట్‌లో ఫ్రెండ్లీగా ఉండగలిగాం. ప్రతిభ విషయంలో ఎవరి దమ్ము వారిదే. ‘ముకుంద’ షూటింగ్ పూర్తయ్యేలోపే వరుణ్ నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. ఇద్దరం లంచ్‌కెళ్లినా, డిన్నర్‌కెళ్లినా.. మా ఫుడ్‌ని ఎక్స్‌ఛేంజ్ చేసుకునేవాళ్లం. కళ్లతో మాట్లాడగల సత్తా వరుణ్‌లో ఉంది. తనను అలాగే తదేకంగా చూస్తే ఎవరైనా భయపడతారు. ఎందుకంటే... వరుణ్ హైట్ 6 అడుగుల 4 అంగుళాలు. వాళ్ల డాడీ నాగబాబుగారి పోలిక.
 
 హృతిక్ రోషన్‌తో సినిమా చేస్తున్నట్టున్నారు?
 అవును... ‘మొహంజొదారో’ సినిమా పేరు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జనవరి నుంచి సెట్స్‌కి వెళ్తుంది. ఈ సినిమా కోసం కొన్ని ఫొటో షూట్‌లు కూడా చేశాం. గుజరాత్ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. అయిదు నెలల పాటు ఆ సినిమా షూటింగ్‌లోనే ఉంటాను. హృతిక్ సరసన చేస్తున్నాననే వార్తే ఇంకా నమ్మలేకపోతున్నా.
 
 అసలు ఆ అవకాశం ఎలా వచ్చింది?
 దర్శకుడు ఆశుతోష్ గోవారీకర్ భార్య సునీతా గోవారీకర్... నేను నటించిన ఓ వ్యాపార ప్రకటన చూసి నన్ను సంప్రదించారు. ఆ తర్వాత ఆశుతోష్‌ని కలిశాను.
 
 అంతటి గొప్ప ప్రాజెక్ట్‌లో మీరూ భాగమయ్యారు కదా... ఎలా అనిపించింది?
 మాటల్లో చెప్పలేను. ‘లగాన్’ చిత్రాన్ని థియేటర్లో చూశాను. అలాంటి నేను ఆ సినిమా దర్శకునితో పనిచేయబోతున్నా. అంతకంటే అదృష్టం ఏం కావాలి? ఆశుతోష్ గోవారీకర్‌తో ఓ గంటసేపే మాట్లాడాను. ఆ గంటలో నా కంటికి ఆయనొక టీచర్‌లా అనిపించారు. ఈ మధ్య నా అభిమాన దర్శకుడు మణిరత్నంగారిని కలిశాను. అప్పుడు కూడా అదే ఫీలింగ్. దురదృష్టవశాత్తూ ఆయన సినిమా చేసే అవకాశాన్ని వదిలేసుకోవాల్సి వచ్చింది.
 
 కొత్త కమిట్‌మెంట్స్?
 ‘ముకుంద’ చివరి పాట ఇటీవలే పూర్తయింది. ఇక నా మనసంతా ‘మొహంజొదారో’పైనే. ఓ అయిదు నెలల పాటు కథలేం వినను. అయిదు నెలల తర్వాత కూడా తెలుగు ప్రేక్షకులకు, దర్శక, నిర్మాతలకు నేను గుర్తుంటే... అప్పుడు తెలుగు కథలు వింటా.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement