‘కెప్టెన్ ప్రభాకరన్’
అడవిలోని బందిపోట్లు ఆలివ్ గ్రీన్ డ్రస్‌లో మెడకు తూటాల పట్టీ వేలాడ దీసుకుని బుర్ర మీసాలతో ఉంటారని వీరప్పన్ కథ వల్ల మనకు తెలిసింది. కాని అడవి బయట ఉండే బందిపోట్లు తెల్ల చొక్కా తెల్ల పంచె కట్టుకుని భుజాన కండువాతో వేదికలెక్కి ఉపన్యాసాలిస్తుంటారని కూడా వీరప్పన్ కథ మనకు చెప్పింది. వీరప్పన్ దోచుకుంది కొంత. బయట అతని వల్ల దోచుకోబడింది కొండంత. ప్రభుత్వానికి ప్రభుత్వమే విలన్ అయితే ఎటువంటి విలన్స్ ఉబికి వస్తారనడానికి కూడా వీరప్పన్ కథ ఒక ఉదాహరణే.
వీరప్పన్ తన పదిహేడవ ఏట మొదటి హత్య చేశాడు. దంతాల కోసం ఏనుగులను చంపుతున్నప్పుడు వాటిని అంకుశంతో బెదిరించవచ్చని అతడు గ్రహించాడు. కాని ‘భయం’ అనే అంకుశం ధరిస్తే ఏ మనిషి అయినా బెదిరిపోక తప్పదని కూడా గ్రహించాడు. డబ్బు సులభంగా రాదని డబ్బుకు వాటాదారులు ఎక్కువని కూడా అతడికి తెలుసు. వ్యవస్థకు ఎదురెళ్లాలంటే వ్యవస్థను లొంగదీసుకోవాలని కూడా తెలుసు. రెండు రాష్ట్రాలు... కర్నాటక, తమిళనాడు... వాటి సరిహద్దుల్లో ఉన్న అడవుల్లో రెండు రాష్ట్రాల వ్యవస్థలను లొంగదీసుకుని సామ్రాజ్యాన్ని స్థాపించినవాడు వీరప్పన్. నిజాయితీ ఉన్న అధికారి తన ప్రథమ శత్రువు అని తలచినవాడు. తెలుగు ప్రజలకు ఏ మాత్రం సంబంధం లేని ఈ కథకు ఒక ఉత్తమ ఆఫీసర్ బలి కావడం వల్ల కూడా తెలుగువారికి వీరప్పన్ విలన్ అయ్యాడు. వీరప్పన్‌ను మొదటగా అరెస్ట్ చేసిన ఒకే ఒక ఆఫీసర్– తెలుగువాడు– పందిళ్లపల్లి శ్రీనివాస్– వీరప్పన్‌కు పీడకలగా అవతరించాడు. అతణ్ణి 1986లో ఫారెస్ట్ ఆఫీసులో బంధించి విచారణ జరుపుతుండగా వీరప్పన్ తప్పించుకున్నాడు. అయినా శ్రీనివాస్ అతణ్ణి వదల్లేదు. ఉక్కిరిబిక్కిరి అయిన వీరప్పన్ 1991లో లొంగిపోతున్నానని కబురు పంపాడు. నిరాయుధంగా వస్తే లొంగిపోతానని చెప్పాడు. శ్రీనివాస్ అది నమ్మి వెళ్లి వీరప్పన్ చేతిలో హతమయ్యాడు.
బొమ్మ ఒక్కటే ఉండదు. బొరుసు కూడా ఒక్కలాగే ఉండవు. వీరప్పన్‌కు క్రూరమైన వ్యక్తిత్వం ఉన్నట్టే మానవీయమైన వ్యక్తిత్వం కూడా వెతికే వారు ఉన్నారు. అది కనిపించవచ్చు కూడా. అయినప్పటికీ అతడు సంఘవ్యతిరేక శక్తి. సంఘానికి బెడదగా మారిన వ్యక్తి. అలాంటి వారు చట్టాన్నే కాదు కళలను కూడా ఆకర్షిస్తారు. వీరప్పన్‌ను అలా మొదటిసారి ఒక కమర్షియల్ సినిమాలోకి పట్టుకొచ్చిన సినిమా ‘కెప్టెన్ ప్రభాకర్’.
దర్శకుడు మణివణ్ణన్‌కు శిష్యుడైన ఆర్.కె. సెల్వమణి సమకాలీన ఘటనల నుంచి కథలను రాసుకోవడంలో సిద్ధహస్తుడు. అతడి తొలి సినిమా ‘పోలీస్ విచారణ’ మద్రాసులో సీరియల్ కిల్లర్‌గా ఖ్యాతి చెందిన ‘ఆటో శంకర్’ జీవితం ఆధారంగా రాసుకున్న కథ. పెద్ద హిట్ అయిన ఈ సినిమాకు హీరో విజయ్‌కాంత్. ఈ సినిమా హిట్ కావడంతో దానిని నిర్మించిన ఇబ్రాహీమ్ రౌతర్ తదుపరి సినిమా కూడా సెల్వమణికే ఇచ్చాడు. హీరోగా మళ్లీ విజయ్‌కాంత్‌నే తీసుకున్నాడు. ఈసారి సెల్వమణి అప్పుడు విస్తృతంగా వార్తల్లో ఉన్న వీరప్పన్ పాత్రను తీసుకుని ‘కెప్టెన్ ప్రభాకర్’ కథ రాసుకున్నాడు. సినిమాలో వీరప్పన్ పట్టుబడతాడు. కాని వీరప్పన్ కథ ముగియడానికి ఈ సినిమా రిలీజైన 13 ఏళ్లు పట్టింది.
గంధపు చెట్లు నరకడం, ఏనుగు దంతాలు సేకరించడం అడవిలో కష్టం కాదు. వాటిని రవాణా చేయడమే కష్టం. లారీలు చీమలు కావు చాటుగా వెళ్లడానికి. భారీ లారీల్లో గంధపు చెక్కలు రవాణా కావాలంటే దారుల వెంట ఉన్న చెక్‌పోస్ట్‌లు ‘ధారాళంగా’ ఉండాలి. ఆఫీసర్లు ఉదారంగా ఉండాలి. వారిపై అజమాయిషీ చేసే ఆఫీసర్లు, వారిని పోస్ట్ చేసే మంత్రులు కూడా ఉదారంగా ఉండాలి. తద్వారా లాభాన్ని పంచుకోవాలి. ఈ వ్యవస్థ ఇలా స్థిరపడి ఉండటం ఈ సినిమాలో చూపిస్తాడు. వీరప్పన్‌కు మద్దతుగా సినిమాలో స్థానిక ఎం.ఎల్.ఏ, కలెక్టర్, పోలీస్ కమిషనర్ పని చేస్తుంటారు. విజయ్‌కాంత్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా వచ్చేంతవరకు వీరప్పన్ ఊపుకు అడ్డే ఉండదు. విజయ్‌కాంత్ అతణ్ణి నిరోధించగలుగుతాడు.
అయితే అడవిలో ఎక్కువ సేపు కథను నడపలేమని దర్శకునికి తెలుసు. అందుకే ఫస్టాఫ్‌లో సిటీలోనే కొంత కథను నడుపుతాడు. విజయ్‌కాంత్ పాత్రను గొప్పగా ఇంట్రడ్యూస్ చేస్తాడు. అలాగే వీరప్పన్ పాత్రను కూడా. అడవిలోని వాతావరణం, గ్రామాల ప్రజలు, వీరప్పన్ బంధువర్గంలో అతడికి ఉండే విరోధులు, వాళ్ల పాత పగలు... ఇవన్నీ సినిమాలో అంతర్భాగం అవుతాయి. విజయ్‌కాంత్‌ను కేవలం ఒక ఆఫీసర్‌గా మాత్రమే చూపకుండా గృహస్తునిగా, భార్యా బిడ్డలతో, తల్లితో అనుబంధం ఉన్నవాడిగా కూడా చూపడం వల్ల స్త్రీల ప్రమేయం ఉన్న కథగా కూడా మారి మహిళా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సాధారణంగా సినిమాల్లో విలన్‌ల జోలికి పోలీసాఫీసరైన హీరో వెళితే అతడి కుటుంబం కష్టాల్లో పడుతుంటుంది. అది జోకనుకుంటాం. కాని ఇక్కడ నిజంగానే వీరప్పన్‌తో పెట్టుకుంటే అందరికీ ప్రమాదం వస్తుంది. కిడ్నాప్‌లకు మారుపేరైన వీరప్పన్ ఈ సినిమాలో కూడా విజయ్‌కాంత్ భార్యాబిడ్డల్ని కిడ్నాప్ చేస్తాడు. వాళ్లను విడిపించుకోవడమే క్లయిమాక్స్. తీరా వీరప్పన్‌ను పట్టుకుని ప్రభుత్వానికి అప్పజెప్తున్న సమయంలో అతడి ద్వారా తమ రహస్యాలు బయటపడతాయనుకున్న పెద్దలు అతణ్ణి షూట్ చేసి చంపేస్తారు. విజయ్‌కాంత్ ఆ పెద్దలను కూడా చంపి కోర్టులో సుదీర్ఘ వాదన చేసి బయటపడతాడు. ఇది కొంత వాస్తవ దూరంగా ఉన్నా సినిమాగా చూస్తున్నప్పుడు సరే అని అనిపిస్తుంది.
కెప్టెన్ ప్రభాకర్ పెద్ద తెర మీద చూడాల్సిన, జనం చూసి మెచ్చిన సినిమా. కథ వల్ల, నేప«థ్యం వల్ల, దర్శకుడి ప్రతిభ వల్ల కూడా ఈ సినిమా రక్తి కట్టింది. అన్నింటికీ మించి వీరప్పన్ అనే పాత్ర వల్ల ఇది ఆకర్షవంతమైంది.ఈ సినిమా తర్వాత వీరప్పన్ మీద అనేక సినిమాలు వచ్చాయి. కాని కెప్టెన్ ప్రభాకర్ మాత్రం ఆ సినిమాలన్నింటిలో కెప్టెన్‌లాంటిది. నిజాయితీ నిండిన పోలీసాఫీసర్లకు సెల్యూట్‌లాంటిది.
సెల్యూట్.
కెప్టెన్ ప్రభాకరన్
సెల్వమణి దర్శకత్వంలో 1991లో తమిళంలో విడుదలైన ‘కెప్టెన్ ప్రభాకరన్’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తెలుగులో ‘కెప్టెన్ ప్రభాకర్’గా విడుదలై అంతే విజయం సాధించింది. ముఖ్యంగా బి, సి సెంటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడిచింది. అప్పట్లో తమిళపులి ‘ప్రభాకర్’కు తమిళనాట ఉన్న ఆదరణ కారణంగా హీరోకు ప్రభాకర్ అనే పేరు పెట్టారు. సాధారణంగా నూరో సినిమాలు అచ్చిరావనే అపప్రద తమిళంలో ఉంది. కానీ విజయ్‌కాంత్ నూరవ సినిమా అయిన ‘కెప్టెన్ ప్రభాకరన్’ బ్రహ్మాండమైన హిట్ అయ్యి విజయ్‌కాంత్‌కు ‘కెప్టెన్’ అనే ముద్దుపేరును సంపాదించి పెట్టింది. కేరళలోని ‘చాలకుడి’ ప్రాంతంలో అడవుల వెంట తీసిన ఈ సినిమా నిజంగానే గాఢమైన అడవుల్లో వీరప్పన్ కోసం వేట సాగిస్తున్నట్టుగా ఉంటుంది. ఈ సినిమాతో ‘మన్సూర్ అలీఖాన్’ విలన్‌గా తమిళంలో పెద్ద గుర్తింపు పొందాడు. రాజీవ్‌గాంధీ హత్య కేసు మీద ‘కుట్రపత్రికై’ తీసి సెన్సార్ కోరల్లో 14 ఏళ్ల పాటు చిక్కుకున్న సెల్వమణి కాలక్రమంలో ‘చామంతి’, ‘సమరం’ వంటి సినిమాలు తీసి నటి రోజా భర్తగా తెలుగువారి అల్లుడయ్యాడు. ఇక నటుడుగా, రాజకీయ నాయకునిగా విజయ్‌కాంత్ ప్రస్తుత పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. అతడికి మరో కెప్టెన్ ప్రభాకర్ అవసరం అయితే ఉంది.
– కె
Comments
Please login to add a commentAdd a comment