పబ్లిసిటీ పరుగెత్తాలంటే ఏం చెయ్యాలి? పరుగెత్తే కార్లోంచి దూకి, పరుగున డాన్స్ చెయ్యాలి. ఎన్ని వంకర్లు తిరిగితే అన్ని షేర్లు. ఎన్ని టింకర పనులు చేస్తే అన్ని లైకులు. నలుగురికి సాయం చేసో..
పదిమందికి అన్నం పెట్టో.. ఒకరికి చదువు చెప్పో.. ఒక అన్యాయాన్ని ఎదిరించో..అబ్బో.. అంత వద్దులెండి. కనీసం ఒక ప్లకార్డునైనా పట్టుకున్నా సమాజానికి సేవ చేసినట్లు అవుతుంది కానీ.. ఈ కీకీ లేమిటి? కిరికిరిలేమిటి?
అమాయకమైన ఓ యువకుడి ఫొటో.. దండ వెళ్లాడుతూ! కింద ‘ఇన్ లవింగ్ మెమరీ ఆఫ్ కేకే.. లవింగ్ బాయ్‌ఫ్రెండ్ టు కీకీ.. డైడ్ వైల్ డూయింగ్ ది షిగ్గి.. (ఫిబ్రవరి 1995 – జూలై 2018) (కేకే ప్రేమస్మృతిలో కీకీ ప్రియతముడు.. షిగ్గీని చేస్తుండగా దుర్మరణం)’ అని రాసి ఉంది. దానికో రైటప్.. ‘డోంట్ చాలెంజ్ డెత్. బీ వైజ్.. కీప్ అవే ఫ్రమ్ సిల్లీ స్టంట్స్ అండ్ అడ్వైజ్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్ టు స్టే సేఫ్.(మృత్యువును సవాల్ చెయ్యకండి. తెలివిగా ఉండండి. వెర్రి విన్యాసాలకు దూరంగా ఉండండి. క్షేమంగా ఉండమని మీ స్నేహితులకు కూడా చెప్పండి.) ఇన్‌అవర్‌ఫీలింగ్స్#కీకీకిల్స్#ఇన్‌మైఫీలింగ్స్#కీకీచాలెంజ్#జైపూర్‌పోలీస్#సేఫ్‌జైపూర్‌సోషల్ మీడియాలో జైపూర్ పోలీస్‌లు పెట్టిన పోస్ట్ ఇది. ఇప్పుడు సంచలనం రేపుతోంది.. కీకీ చాలెంజ్‌కు కౌంటర్‌గా!
ఏంటీ కిరి కిరి?!
అరే.. ఈ దేశం.. ఆ దేశమని కాదు.. ఏ దేశంలోనైనా.. ఈ కారు ఆ కారని కాదు.. నానో నుంచి మెర్సిడెజ్‌బెంజ్ దాకా.. నడుస్తున్న కారు లోంచి దూకి.. ‘కీకీ డు యు లవ్ మీ’ అంటూ పాటకు డ్యాన్స్ చేయడం.. స్మార్ట్ ఫోన్‌తో షూట్ చేసుకోవడం.. ఆ వీడియోలను మీ టూ అంటూ కీకీ చాలెంజ్‌కు ట్యాగ్ చేసుకోవడం! ఇదీ కీకీ హ్యాష్‌ట్యాగ్ చాలెంజ్ లేదా ఇన్‌మైఫీలింగ్స్ చాలెంజ్. ఇప్పుడు లోకమంతా పిచ్చిపట్టినట్లు అవుతోంది దీని కోసమే. సోషల్ మీడియాలో వైరల్‌గా అంతా అవే పోస్ట్‌లు. సగటు మనుషుల నుంచి సెలబ్రెటీల దాకా అందరూ పిచ్చిగా ఫాలో అవుతోంది దీన్నే. మొన్నటికి మొన్న రెజీనా కసాండ్రా, అమ్రపాలీ కాస్ట్యూమ్స్‌లో ఆదా శర్మ.. కదులుతున్న కార్లోంచి దూకి పాటకు స్టెప్పులేసి ఆ వీడియోను పోస్ట్ చేశారు. బాలీవుడ్ ఏమీ తక్కువ అడుగులేయలేదు. కరిష్మా శర్మ తన్మయత్వంతో చిందేసింది. నోరా ఫతేహి, వరుణ్ శర్మ (ఫక్రే ఫేమ్) తమ తిక్కను నడుస్తున్న ఆటోలోంచి దూకి చూపించుకున్నారు. టాలీవుడ్, బాలీవుడ్డే కాదు కోలీవుడ్, శాండల్‌వుడ్ సహా హాలీవుడ్‌తోపాటు పాప్ ప్రపంచానికీ ఈ కీకీ చాలెంజ్ వెర్రి పాకేసింది.
పోలీసులకూ సవాలే
లైఫ్ బిందాస్‌గా ఉండాలి. ఆడుతూపాడుతూ రోజు గడవాలి. ఎప్పుడూ కొత్తగా ఉండాలి. దానికోసం ఎలాంటి వెర్రినైనా తలకెక్కించుకుంటాం.. ఎంతటి పాగల్ పనికైనా తెగబడతామని జనాలు చాలెంజ్ చేస్తే ‘ఊరుకోం’ అంటూ, పట్టుకెళ్లి జైల్లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు పోలీసులు. సందులు, వీధులు, కూడళ్లు, రోడ్లు, హైవేలు.. ఎక్కడైనా చాలెంజ్‌కి రెడీ అంటూ.. నడుస్తున్న కార్లలోంచి దూకి డ్యాన్స్ చేస్తూ వీడియో తీసుకోవడం ట్రాఫిక్‌కు అంతరాయంగా మారుతోంది. మరీ కొంతమందైతే రెడ్ సిగ్నల్స్‌ను కూడా లెక్కచేయట్లేదట. ఈ చాలెంజ్ ఆట పోలీసులకు ప్రాణసంకటంగా మారింది. ఈ స్టంట్స్ చేస్తున్నవాళ్లకే కాదు ఇతర వాహనదారులకూ ప్రమాదాలను తెచ్చిపెడ్తోంది. పీక్‌కి వెళ్లిన ఈ పిచ్చిని ఆపడానికి ముంబై, ఢిల్లీ, జైపూర్, బెంగళూరు, యూపీ పోలీసులు తమ స్టిక్స్‌కి స్ట్రిక్ట్‌గానే పనిచెప్పనున్నారట. ఎవరైనా అలా నడుస్తున్న వాహనాల్లోంచి దూకి గంతులు వేస్తే అరెస్ట్ ఖాయమని.. హెచ్చరికలూ జారీ చేశారు. నిఘా కెమెరాలూ పనిచేస్తున్నాయి. మన పోలీసులు కూడా పేపర్లలో, టీవీల్లో, ఎఫ్‌ఎమ్ రేడియోల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
రెండువైపులా పదునైన వేదిక
సోషల్ మీడియా.. ఉద్యమాలను (ఉదా : జాస్మిన్ విప్లవం) పుట్టించి ప్రభుత్వాలను ఉరుకులు పెట్టించగలదు.. ‘మీ టూ’ లాంటి హ్యాష్‌ట్యాగ్స్‌ను సృష్టించి మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించగలదు. ఐస్ బకెట్ చాలెంజ్‌తో జబ్బుల మీద (మోటర్ న్యూరోస్ డిసీజ్) అవగాహన తెప్పించగలదు.. రైస్ బకెట్‌తో సామాజిక బాధ్యతను గుర్తుచేయగలదు. దేనికైనా తీవ్రంగా రియాక్ట్ కాగలదు.. దేన్నయినా లైట్‌గా కొట్టిపారేయగలదు. సీరియస్ పాలసీలను ప్యాక్ చేసి దాచేయగలదు.. వినోదాన్ని పంచి పెద్దగా స్ప్రెడ్ చేయగలదు. అదీ సోషల్ మీడియా ఐడెంటిటీ! ‘కీకీ’ కూడా అదే డయాస్‌గా వైరల్ అయింది.
ఎక్కడిదీ కిర్రాక్?
కెనడా ర్యాప్ సింగర్ డ్రేక్ తెలుసు కదా? ఆయన పాడిందే ‘కీకీ డు యు లవ్ మీ’. ఆయన లేటెస్ట్ ఆల్బమ్ ‘స్కార్పియన్’లోని ‘ఇన్ మై ఫీలింగ్స్’తో సాగుతుందీ పాట. అయితే చాలెంజ్ విసిరింది మాత్రం డ్రేక్ కాదు. బౌన్స్ ట్రాక్‌లో చాలా హుషారుగా సాగే ఈ సాంగ్ ప్రముఖ ఇంటర్‌నెట్ కమెడియన్ షిగ్గీకి తెగ నచ్చింది. ఉన్నదాన్ని దేన్నయినా తన స్టయిల్‌లో పాపులర్ చేయడమే కదా షిగ్గీ పని. అందుకే వీధుల్లో.. ఈ పాటకు డ్యాన్ చేసి.. ఈ ఎంజాయ్‌మెంట్‌ను మీరూ చాలెంజింగ్‌గా తీసుకోండి అంటూ ఆ వీడియోను జూన్ 30 న సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. షిగ్గీ చాలెంజ్ హ్యాష్‌ట్యాగ్, డూ ది షిగ్గీ హ్యాష్‌ట్యాగ్‌తో. ఈ వీడియోలో ఎక్కడా ఏ వెహికిలూ లేదు. కాని కొన్ని రోజులకు ఓడెల్ బెక్‌హమ్ (ఎన్‌ఎఫ్‌ఎల్ స్టార్) ఈ చాలెంజ్‌ను కార్లోంచి(ఆగి ఉన్న కారే) దిగి చేశాడు. ఆ తర్వాత కొంత మంది కదులుతున్న కార్లోంచి దిగి చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి కీకీ చాలెంజ్‌ను కదులుతున్న కార్లోంచి దిగి చేయడం మొదలుపెట్టారంతా. అమెరికన్ యాక్టర్ విల్ స్మిత్ అయితే ఇంకాస్త ముందుకెళ్లి డ్రోన్ కెమెరాలను పెట్టుకొని బుడాపెస్ట్ బ్రిడ్జి మీద డ్యాన్స్ చేశాడు.
జరిమానాలు..అరెస్ట్‌లు
అలా ఈ వెర్రి వయా హ్యాష్‌ట్యాగ్ ఖండాలన్నిటికీ వ్యాపించింది. ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలను తెచ్చిపెట్టింది. దాంతో అన్ని దేశాల పోలీసులు కన్నెర్ర చేయక తప్పలేదు. అబుదాబీలో కీకీ చాలెంజ్ కోసం రోడ్డు ఎక్కితే జైలు, జరిమానా రెండూ విధిస్తున్నారు. దుబాయ్‌లో రెండువేల దిరమ్స్ ఫైన్, 23 బ్లాక్ పాయింట్స్ పనిష్మెంట్. అంతేకాదు అరవై రోజుల పాటు ఆ వెహికిల్ జప్తులో ఉంటుంది. అమెరికాలో అయితే రిమాండ్‌కు తరలిస్తున్నారట. స్పెయిన్‌లో నడ్డి విరిగే చార్జీలు విధిస్తున్నారట. కొన్నాళ్ల కిందట మన దగ్గర కొలవెర్రి కూసింది. ఇప్పుడు కీకీ కేకేస్తోంది. ఎక్సయిట్‌మెంట్ ఉండాలి.. ఎంజాయ్‌మెంటూ కావాలి. అవి జీవితంలో ఉత్సాహం నింపాలి కాని లైఫ్‌ను కిర్రాక్ చేయొద్దు.
కదులుతున్న కారు కాదు..
నేను కదలని కార్లోంచే దిగి కీకీ చాలెంజ్ చేశాను. షూటింగ్‌లో ఉన్నాను కాబట్టి.. గ్యాప్ దొరికినప్పుడు ఆ కాస్ట్యూమ్స్‌తోనే డ్యాన్స్ చేశానంతే. కదులుతున్న కారులోంచి దూకి చేయలేదు కాబట్టి నేను రూల్స్‌ని, లాని వయలేషన్ చేయలేదనే అనుకుంటున్నా. గవర్నమెంట్ విల్ బి వెరీ హ్యాపీ విత్ మి.
– అదా శర్మ, నటి
కీకీ జోలికెళ్లొద్దు
కీకీ చాలెంజ్ ఫన్ కోసమే అయినా క్షేమం కాదు. ప్రాణాలతో చెలగాటమే. ట్రాఫిక్ రూల్స్‌కి విరుద్ధం కూడా. ఇలాంటి వాటి జోలికి వెళ్లొద్దు.
– లావణ్య త్రిపాఠి
చట్ట వ్యతిరేక చర్యే
కీకీ చాలెంజ్ పేరుతో నడుస్తున్న కారులోంచి దూకి స్టెప్పులేస్తుండటం క్షణికానందాన్ని కలిగించినా మన దగ్గర వాళ్లకు మాత్రం కన్నీటి శోకాన్ని మిగులుస్తుంది. అలా డ్యాన్స్ చేయడం వల్ల కారు ప్రమాదానికి గురై ప్రాణాలు పోతాయి. కొన్ని సందర్భాల్లో వెనుక నుంచి వచ్చే వాహనాలు ఢీకొట్టడం వల్ల వారు కూడా ప్రమాదం బారిన పడే అవకాశముంది. దీనికితోడు ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. ఇలా చేయడం కూడా చట్టవ్యతిరేక చర్యే. సిటీ పోలీసు యాక్ట్ సెక్షన్ 70(బీ), మోటారు వెహికల్ యాక్ట్ సెక్షన్ 184, 188ల కింద కేసు నమోదు చేస్తాం.
– మహేశ్ భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్
జీవితాన్ని చాలెంజ్‌గా తీసుకోండి
కదులుతున్న కార్లోంచి బయటకు దూకి రోడ్లపై డ్యాన్స్‌లు చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. ఇలాంటి చాలెంజ్‌లు అనుసరించే బదులు యువత జీవితాన్ని చాలెంజ్‌గా తీసుకొని ఎదిగేందుకు ప్రయత్నించాలి. ఇటువంటి వాటితో జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ప్రాణాలు తీసుకోవద్దు.
– వీసీ సజ్జనార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్
ఎవరిని ఉద్ధరించడానికి!
ఎందుకు? ఎవరిని ఉద్ధరించడానికి ఈ చాలెంజ్? ఏదైనా పనికొచ్చేవి చేసినా ప్రయోజనముంటుంది. తెలంగాణ గవర్నమెంట్ చేపట్టిన గ్రీన్‌చాలెంజ్ తీసుకోండి.. దేశం పచ్చగానైనా మారుతుంది. గిఫ్ట్ ఎ హెల్మెట్‌తో ప్రమాదాలు తగ్గుతాయి. ట్రాఫిక్ రూల్స్ మీద అవేర్‌నెస్ పెరుగుతుంది. అంతేకాని ఈ పిచ్చి చాలెంజ్‌లేంటి? వీటిని అరికట్టాలి.
– మంచు లక్ష్మి, నటి, ప్రొడ్యూసర్
– శరాది
Comments
Please login to add a commentAdd a comment