పసి ప్రేమకు తొలి అంకురం డార్లింగ్‌ డార్లింగ్‌ డార్లింగ్‌ | special story to darling darling darling | Sakshi
Sakshi News home page

పసి ప్రేమకు తొలి అంకురం డార్లింగ్‌ డార్లింగ్‌ డార్లింగ్‌

Published Wed, Jan 24 2018 1:10 AM | Last Updated on Wed, Jan 24 2018 1:10 AM

special  story to  darling  darling  darling - Sakshi

చిన్నప్పుడు అన్నీ బాగుంటాయి. ఆ  అమ్మాయితో దాగుడుమూతలు బాగుంటాయి. ఆ అమ్మాయి వెనుక వెనుకే తిరగడం బాగుంటుంది. ఆ అమ్మాయి పక్కనే కూర్చుని క్లాసు వినడం బాగుంటుంది. స్కూలు  వదిలాక పక్కనే నడుస్తూ ఇల్లు చేరడం బాగుంటుంది. అమ్మాయి చాలా బాగుంటుంది. ఎందుకో అమ్మాయి ఎక్కడ ఉంటే అక్కడ ఉండ బుద్ధేస్తుంది. వయసు పెరుగుతుంది. వయసుతో పాటు మనమూ పెరిగితే బాగుంటుంది. కాదూ కూడదని ఆ చిన్నప్పుడు ఆ అమ్మాయి దగ్గరే ఉండిపోతే మాత్రం కథ  ‘డార్లింగ్‌ డార్లింగ్‌ డార్లింగ్‌’ అవుతుంది.
 

ఎట్రాక్షన్‌కి తిథి, ముహూర్తమూ ఉండవు. మీసం వచ్చిందా, ఎత్తు అయిదడుగులు దాటిందా, కాళ్లు కాలేజీ దారిలో ఉన్నాయా అన్నది చూడదు. ఎట్రాక్షన్‌కి ఎదురుగా ఉన్నది యజమాని కూతురా పాలేరు కూతురా అన్నది కూడా తెలియదు. ఊహ తెలిసిన క్షణం నుంచి ఆకర్షణ ఉంటుంది. ఎవరి కోసమో ఒకరి కోసం మనసు గాఢంగా కోరుకుంటూ ఉంటుంది. అది సేమ్‌సెక్స్‌ అయితే స్నేహం. ఆపోజిట్‌ సెక్స్‌ అయితే ఇష్టం. ఈ సినిమాలో భాగ్యరాజ్‌ తన  యజమాని కూతురైన పూర్ణిమా జయరామ్‌ పట్ల అలాంటి ఇష్టం పెంచుకుంటాడు. పెద్దయ్యాక కాదు. చిన్నప్పుడే. పదేళ్ల వయసులో. ఇద్దరూ ఊటీలో చదువుకుంటూ ఉంటారు. ఒకే క్లాసులో ఒకరిని ఒకరు విడవకుండా ఉంటారు. మ్యూజికల్‌ చైర్స్‌లో ఒక్క చైరే  మిగిలితే ఇద్దరూ నిలబడిపోతారు తప్ప ఒకరి మీద మరొకరు గెలవడానికి కూర్చోరు. స్కూల్‌లో మార్చింగ్‌ జరిగి ఎదురూ బొదురూ వస్తే ఆగిపోయి ఉన్న చోటే మార్చ్‌ చేస్తారు తప్ప ముందుకు కదలరు. ఆటల్లో ఒకరు ఫస్ట్‌ వస్తే ఒకరు సెకండ్‌. పోటీల్లో ఒకరు సెకండ్‌ వస్తే మరొకరు ఫస్ట్‌. కాని ఊటీలో కూడా ఎండ కాస్తుంది. వాళ్ల జీవితంలో కూడా ఎండ వచ్చింది. ఆ అమ్మాయి తండ్రికి ట్రాన్స్‌ఫర్‌ అయిపోయింది. ఆ అమ్మాయి పోతూ పోతూ ‘నేను తిరిగి వచ్చే వరకూ నన్ను గుర్తు పెట్టుకుంటావ్‌గా’ అని అడుగుతుంది. అంతేకాదు చనిపోయిన తన కుక్కపిల్ల సమాధి దగ్గర రోజూ పూలు పెడతావుగా అని కూడా అడుగుతుంది. ఆ అమ్మాయి ఎక్కిన రైలు వెళ్లిపోతుంది. దాని చక్రాల కింద ఆమె అంత వరకూ పెంచుకున్న జ్ఞాపకాలు కూడా జారిపోయాయి. కాని ఆ పిల్లవాడు మాత్రం ఆ క్షణం దగ్గరే ఫ్రీజ్‌ అయిపోయాడు. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా పదేళ్ల పాటు ఆ అమ్మాయిని ప్రేమిస్తూ ఉండిపోయాడు. అనుక్షణం ఆమె తలపులు. జ్ఞాపకాలు. కుక్కపిల్ల సమాధి మీద రోజూ పూలు పెట్టి ఎంతో గాఢంగా మౌనం పాటిస్తుంటాడు. ఇదంతా ఎవరి కోసం. తన కోసమే. ఏదో ఒక రోజు రాకపోదు తనని చూసి గుండెల్లో పొదువుకోకపోదు అని ఆశ.అమ్మాయి వచ్చింది. రిసీవ్‌ చేసుకోవడానికి స్టేషన్‌కు వెళ్లి స్టైల్‌గా ‘హాయ్‌... ఐయామ్‌ రాజా’ అన్నాడు.ఆ అమ్మాయి అతణ్ణి ఎగాదిగా చూసి ‘అయితే లగేజ్‌ అందుకో’ అంది.ఒక ఆశల బుడగ సూది మొన తగలకనే టప్పున పేలింది.
 

ఆ అమ్మాయికి అసలు ఏమీ గుర్తు లేదు. చాలా జీవితం చూసింది. విదేశాల్లో చదువుకుంది. ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకుంది. రేపోమాపో పెళ్లి. ఈలోపు సరదాగా ఊటీ చూద్దామని ఫ్రెండ్స్‌తో వచ్చింది. ఇక్కడ చూస్తే అమర ప్రేమికుడు భాగ్యరాజ్‌. కళ్ల నిండా మనసు నిండా ఆమెను చూసుకోవడమే. అడిగితే డీసెంట్‌గా ప్రాణమిచ్చేసేలా ఉంటాడు. మొదట ఇతని వాలకం ఏమీ అర్థం కాదు. కాని మెల్లమెల్లగా అతడి మనసులోని లోతు అర్థం చేసుకుంటుంది. మరో వైపు తాను నిశ్చితార్థం చేసుకున్న వరుడు సుమన్‌ తన కోసం ఊటీ వస్తే అక్కడ అతడి కుసంస్కారం గమనిస్తుంది. భాగ్యరాజ్‌ దగ్గర డబ్బు లేదు. అతడు వాచ్‌మెన్‌ కొడుకు నిజమే. కాని అతడి లాంటి మనసు ఎక్కడ ఉందని? అందుకే ఎంగేజ్‌మెంట్‌ను కాదని భాగ్యరాజ్‌నే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుంటుంది. అయితే ఈలోపే ఆమె మీద కృతజ్ఞతాభారం పడుతుంది. వ్యాపారంలో నష్టపోయిన తండ్రిని స్నేహితుడైన సుమన్‌ తండ్రి ఆదుకున్నాడు కనుక ఈ క్షణంలో సుమన్‌ని కాదని భాగ్యరాజ్‌ని చేసుకోవడానికి ఆమెకు కృతజ్ఞత అడ్డు వస్తుంది. నలిగిపోతున్న ఆమెను సుమన్‌ తండ్రి గమనిస్తాడు. అసలు సంగతి గ్రహిస్తాడు. ఆయన పెద్దమనిషి. సంస్కారవంతుడు. అందుకే నిజమైన ప్రేమికునికే ఆమె చెందాలని నిర్ణయిస్తాడు.
పదేళ్ల సుదీర్ఘప్రేమ ఫలవంతమైంది. చిన్నప్పటి స్నేహితురాలు ప్రియురాలైంది. ఇప్పుడు ఇల్లాలైంది. కలలు నిజమవుతాయి. తపస్సులు కూడా వరాలిస్తాయి. కావలసిందల్లా సిసలైన తపస్సే.
 

ఈ సినిమాలో హాస్యం, ఆర్తి సమపాళ్లలో ఉంటాయి. తన చిన్ననాటి స్నేహితురాలు తిరిగి వస్తుందన్న ఆనందంలో స్వాగతం చెప్పడానికి కొత్త బట్టలు కుట్టించుకుంటాడు భాగ్యరాజ్‌. కాని షూస్‌ కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు. ఏదో పెళ్లికి పెద్దమనిషిగా వెళ్లి అక్కడ మంగళ వాయిద్యాలు మోగుతూ ఉండగా ఎవరివో కొత్త షూస్‌లో కాళ్లు దూర్చి చక్కా వచ్చేస్తాడు. నవ్వు వస్తుంది. దూరంగా కరాటే సాధన చేస్తున్న కుర్రాళ్లను కారులో ఉన్నామన్న ధైర్యంతో ఏడిపిస్తారు పూర్ణిమ జయరామ్‌ ఆమె స్నేహితులు. వాళ్లు వెంటపడతారు. వీళ్లు పారిపోతారు. కాని కారు ఆగిపోతుంది. పట్టుకుంటారు. మాతో ఫైట్‌ చేసి గెలుస్తారా అని ఛాలెంజ్‌ చేస్తారు. అప్పటి వరకూ డ్రైవర్‌గా ఉన్న భాగ్యరాజ్‌ కారులోని ఒక సంచి వెతికి అందులోని ఎల్లో కలర్‌ కరాటే డ్రస్సు వేసుకొని చాలా ప్రొఫెషనల్‌గా ఫైట్‌ చేసి గెలుస్తాడు. మళ్లీ నవ్వు. ఇలా నవ్వించిన భాగ్యరాజే తాను పదేళ్లుగా దాచిపెట్టుకున్న ఫొటోలను పూర్ణిమకు ఇస్తే ఆమె వాటిని తీసుకుని అతని ముందే తన ముక్క వరకూ కట్‌ చేసి అతని ముక్కను చేతిలో పెడితే కంట తడి పెట్టిస్తాడు. లోకంలో అందరూ వీరులూ శూరులూ ఉండరు. భాగ్యరాజ్‌ వంటి ఆర్డనరీ మనుషులే ఉంటారు. కాని వాళ్ల దగ్గర కూడా చాలా అట్రాక్షన్‌ ఉంటుంది. కోటాను కోట్ల సఫల ప్రేమలు ఈ ఆర్డనరీ ఫెలోల అట్రాక్షన్‌ నుంచి పుట్టినవే.తెర మీద మాత్రం ఇది మొదటిది.భాగ్యరాజా చేతిలో మెరిసిన భాగ్యరేఖ.

డార్లింగ్‌ డార్లింగ్‌ డార్లింగ్‌
కె.భాగ్యరాజ్‌ తమిళంలో హీరోగా నటించి నిర్మించి దర్శకత్వం వహించిన 1982నాటి సినిమా ‘డార్లింగ్‌ డార్లింగ్‌ డార్లింగ్‌’. తెలుగులో కూడా అదే పేరుతో విడుదలై భాగ్యరాజ్‌ని తెలుగువారికి అభిమాన దర్శకుడిగా మార్చింది. ఈ సినిమా హిట్‌తో భాగ్యరాజ్‌ చాలా సినిమాలు ‘చిన్న ఇల్లు’, ‘అమ్మాయిలూ ప్రేమించండి’, ‘నేనూ మీవాడినే’, ‘చిన్నరాజా’ వరుస విజయాలు సాధించాయి. ‘డార్లింగ్‌ డార్లింగ్‌ డార్లింగ్‌’... చిన్నప్పటి నుంచి రూపుదిద్దుకునే ప్రేమను మొదటిసారి చూపింది. దీని ఆధారంగా అనేక సినిమాలు వచ్చాయి. నిన్నమొన్నటి ‘హలో’ దగ్గరి నుంచి ఆ మొన్నటి ‘మనసంతా నువ్వే’ వరకు ఎన్నో సినిమాలు ఈ సినిమా మూల కథ నుంచే పుట్టాయి. తరుణ్‌ ‘నువ్వు లేక నేను లేను’లో కూడా ఈ సినిమా లైన్‌ కనిపిస్తుంది. ఇక కరుణాకరన్‌ తీసిన ‘తొలి ప్రేమ’కు ఈ సినిమా పూర్తిగా స్ఫూర్తి. సైట్‌ ఉన్నవాడు కూడా హీరో కావచ్చని, మామూలుగా కనిపించేవాడు కూడా ప్రేమలో గెలవ్వచ్చని భాగ్యరాజ్‌ చాలామందికి ధైర్యం ఇచ్చాడు. అన్నట్టు ఈ సినిమాలో తనతో నటించిన పూర్ణిమా జయరామ్‌ను అతడు వివాహం చేసుకున్నాడు. మన దగ్గర పెద్ద హిట్టయిన ‘మూడుముళ్లు’, ‘రాధా కల్యాణం’, ‘అబ్బాయి గారు’ భాగ్యరాజ్‌ సినిమాలకు రీమేక్‌లే. భాగ్యరాజ్‌ స్కూల్‌లో తెలుగులో ఇటీవల వచ్చిన సినిమాలు ‘మళ్లీ రావా’ (సుమంత్‌), ‘జయమ్ము నిశ్చయమ్మురా’ (శ్రీనివాసరెడ్డి). 
– కె

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement