శ్రీమాన్... శ్రీవారు!
సమ్‌సారం
సంసారంలో సినిమా
ప్రసూన... విసిగివేసారి... ఉక్రోషం, ఉడుకుమోత్తనం, ఆగ్రహం, ఆవేశం ఆవహించగా... ‘‘అసలు మీ ఎవ్వరికీ కనిపించకుండా వెళితే కాని మీరు దారికి రారు’’ అని వంటింట్లోకి వెళ్లిపోయింది. ‘కోడలిగా నేను ఈ ఇంటికి వచ్చిన కొత్తలోనే చెప్పింది అత్తయ్య.. మొగుడిని మనిషిలాగే చూడు.. దేవుడిని చెయ్యకు అని. అప్పుడు అర్థం కాలేదు ఆ మాట విలువ. ఇప్పుడు తెలిసొస్తోంది!’ మంచం మీద ఉండలా పడి ఉన్న తడి తుండును తీసి బాల్కనీలో విసురుగా దులుపుతూ అంది ప్రసూన. ‘అందుకే అన్నారు... పెద్దల మాట చదన్నం మూట అని. ఆ రోజే మా అమ్మ చెప్పిన మాట సరిగ్గా విని నువ్వు అర్థం చేసుకుని ఉంటే దేవుడిలా వినడమే తప్ప నోరెత్తలేని ఖర్మ నాకూ పట్టుండేది కాదు’ డ్రెస్సింగ్ టేబుల్ ముందు తల దువ్వుకుంటూ అన్నాడు నింపాదిగా శ్రీకర్.
చిర్రెత్తుకొచ్చింది ప్రసూనకు. ‘ఏ విషయంలో మీకు మాట్లాడే చాన్స్ ఇవ్వకుండా చేశాను?’ అంది ఆవేశంగా. ‘ఏ విషయంలో మాట్లాడనిచ్చావని?’ మీసాలను దువ్వుకుంటూ అన్నాడు అదే నింపాదితనంతో. ‘నిజంగా తప్పుచేశాను’ నిస్సహాయంగా సణుక్కుంటూ వంటింట్లోకి వెళ్లింది. ‘ఫలితం నేను అనుభవిస్తున్నా’ అన్నాడు డైనింగ్ హాల్లోకి వస్తూ! ఆ మాటకు స్పందనగా వంటింట్లో గిన్నెలు చప్పుడు చేశాయి గట్టిగా! డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంటూ అన్నాడు... కాదు... కేకేశాడు శ్రీకర్... ‘దేవుడికి నైవేద్యం’ అంటూ!
‘ఈ దేవుడికి మామూలు నైవేద్యాలు ఏం సరిపోతాయి.. పెళ్లాం రక్తమాంసాల భక్ష్యం కావాలి కాని’ అంటూ టేబుల్ మీద కంచం పెట్టింది శబ్దం వచ్చేంత కోపంగానే.
ఆమె కోపం ఆయనకు నోటీస్ అయినా పట్టించుకోలేదు. శ్రీకర్ బ్యాంక్ మేనేజర్. ప్రసూన గృహిణి. ఇద్దరు పిల్లలు. పెళ్లయి అత్తారింటికి వెళ్తున్నప్పుడు అమ్మమ్మ, నానమ్మ, మేనత్త సహా అమ్మ చెప్పిన మాటలనూ బాగా గుర్తుంచుకుని భర్తకు ఏ చిన్న అసౌకర్యం కలగనివ్వకూడదనే వాగ్దానం కూడా చేసుకుంది తనకుతానే ప్రసూన. అత్తింట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఆ ప్రకారమే నడుచుకోవడమూ మొదలుపెట్టింది. కోడలి ప్రవర్తన చూసిన అత్తమ్మ భవిష్యత్తులో ఆ పిల్ల ఎంత కష్టపడనుందో తన అనుభవరీత్యా అంచనా వేసి ఇచ్చిన సలహానే... ‘మొగుడిని మనిషిగానే చూడు దేవుడిని చేయకు’ అని. కన్న కొడుకు గురించి తల్లి అలా అనడం మొదట్లో జీర్ణించుకోలేకపోయింది కోడలు. కాని యేడాది తిరగకముందే అత్తమ్మ సలహా ఎంత విలువైనదో తెలిసొచ్చింది.
అయితే అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. శ్రీమాన్ శ్రీవారు శ్రీమతి సపర్యలకు అలవాటుపడి ఆ సేవలకు ఒళ్లు, మెదడు అప్పగించి ఇంట్లో సొంతంగా పనిచేసుకోవడమనే మాటను మరిచిపోయాడు. బ్రష్ మీద పేస్ట్ దగ్గర్నుంచి స్నానానికి నీళ్లు దాకా భార్య పెడితేనే ఆ మొగుడి మెదడు స్నానమనే ప్రోగ్రామ్‌ను కంప్లీట్ చేస్తుంది. చివరకు కంచంలో ఆమె అన్నం వడ్డిస్తేనే ఆయన తినడమనే తంతంగం పూర్తి చేస్తాడు. ఆయన భోజనం అయిపోయేవరకు అసాంతం ఆమె పక్కనే ఉండి కంచంలో ఏం లేదో... ఏం ఉందో చూస్తూ వడ్డించాలిసిందే. ఏదో పని వల్ల పొరపాటున అక్కడి నుంచి ఆమె కదిలి వెళ్లిందో కంచంలో తిండి అయిపోగానే అదే టేబుల్ మీద అలాగే ప్లేట్ పక్కనే ఎంగిలి చేయితోనే కునుకు తీస్తాడు అతను. ‘అయ్యో... అలా పడుకున్నారేంటి? పిలిచి ఏం కావాలో అడగొచ్చు కదా’ అని తనేదో తప్పు చేసినట్టు ఫీలయిపోయి ప్లేట్‌లో ఆయనకు కావల్సినవి మళ్లీ వడ్డిస్తుంది ఆ మహా ఇల్లాలు. ఈయనగారు తాత్పరంగా లేచి... ‘నా భోజనం కన్నా నీకు ముఖ్యమైన పనేదో ఉన్నట్టుంది. డిస్టర్బ్ చేయడం ఎందుకని నువ్వు వచ్చే వరకు టైమ్ వేస్ట్ కాకుండా ఓ కునుకు తీద్దామనుకున్నా’ అంటాడు ఆమెను నొప్పించడానికి వ్యంగ్యాన్ని అస్త్రంగా చేసుకుంటూ.
ఆ హబ్బీ నిర్లక్ష్యం, లేజీనెస్ ఏ స్థాయిదంటే...
బ్యాంక్ పని తప్ప ఇంకే పని చేయడు. ఇంట్లో పూచిక పుల్ల ముట్టుకోడు. స్నానం చేసి తుడుచుకున్నాక తుండు గుడ్డను ఉండలా విసిరేస్తే అది ఎక్కడ పడిందో కూడా వెనక్కి తిరిగి చూడడు. ఇందాకటి ఈ శ్రీమతి కోపానికి, అసహనానికి కారణం అదే. పదేళ్లయినా ఆ అలవాటును మాన్పించలేకపోతోంది. తుడుచుకున్నాక తుండును కనీసం ఒక చోట పెట్టే ప్రయత్నం చేయించలేకపోతోంది. తనకు కావాల్సిన వాటిని కూడా ఆయన తెచ్చుకోడు. ‘చెప్పుకోవడానికి కూడా సిగ్గే... ఆయన గడ్డం గీసుకునే బ్లేడ్ దగ్గర్నుంచి ఆండర్‌వేర్స్ దాకా అన్నీ నేనే తేవాలి’ అంటూ అక్కచెల్లెళ్ల దగ్గర ఎన్నో సార్లు వాపోయింది ఆ పిల్ల. ‘కొత్తలో కథ రివర్స్‌గా ఉండింది కదే... మా ఆయన వేసుకునే బట్టలు నేనే సెలెక్ట్ చేయాలి అంటూ గర్వంగా చెప్పేదానివి. బావగారి బట్టలు అంటే... యు మీన్ అండర్‌వేర్సా?’ అంటూ చెల్లెలు చాలాసార్లు ఆటపట్టించింది కూడా! చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ అంటే ఇష్టమని పట్టుబట్టి డ్రైవింగ్ నేర్చుకుంది.
నేర్చుకున్న పాపానికి డ్రైవర్ ఉద్యోగం కూడా చేయాల్సి వస్తోంది అని బాధపడితే... ‘మా ఆయన నేను లేకుండా ఎక్కడికీ వెళ్లడు అని చెప్తుంటే ఏంటో అనుకున్నా అక్కాయ్... ఇదన్న మాట సంగతి’అంటూ తమ్ముడూ ఎకసెక్కమాడాడు. బీర్వాలోంచి వేసుకోవాల్సిన బట్టలు ఆయన తీసుకోవాల్సి వస్తే పైన దొంతర మొత్తం జారి కింద పడాల్సిందే. మళ్లీ అవన్నీ సర్దుకునే పెంట పని ఎక్కడ పెట్టుకుంటుంది అని బట్టలు తీసే బాధ్యత కూడా తనే నెత్తిమీద వేసుకుంది. యేడాదికోసారి ఎప్పుడైనా తనకు ఒంట్లో బాగాలేనప్పడు ఒక్క పూట ఒక్క పని చేయాల్సి వస్తే ఇల్లు పందిరవడమే. ‘అబ్బబ్బ... ఏ పనీ సరిగ్గా చేయరు కదా... నీట్‌నెస్ అన్న మాటే లేదు మీ డిక్షనరీలో’ అని విసుక్కుంటుంది. దాన్నీ బహు ఒడుపుగా వాడుకోవడం మొదలుపెట్టాడు భర్త.
‘అరేయ్... ఒక్కతే ఎంత పని అని చేసుకుంటుందిరా... ఇంట్లో ఉన్నప్పుడైనా కాస్త సాయం చేయొచ్చుకదా’ అని అతని తల్లిగారు అంటే కోడలి అత్తగారు అంటే... ‘అమ్మా... నాకు నువ్వు నీట్‌నెస్ నేర్పించలేదే. తనకేమో నీట్‌నెస్ ఓసీడీ(అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్). నేను సాయం చేసి డబుల్ వర్క్ పెట్టే బదులు చేయకుండా ఉండడమే తనకు, నాకు, మనకు క్షేమదాయకం!’’ అంటాడు చాలా మర్యాదగా.
ఇవన్నిటితో విసిగివేసారి... ఉక్రోషం, ఉడుకుమోత్తనం, ఆగ్రహం, ఆవేశం ఆవహించగా... ‘‘అసలు మీ ఎవ్వరికీ కనిపించకుండా వెళితే కాని మీరు దారికి రారు’’ అని వంటింట్లోకి వెళ్లిపోయింది ఒకసారి. మళ్లీ ఏదో గుర్తొచ్చి హాల్లోకి వచ్చిన అర్థాంగికి నట్టనడుమ ధ్యాన భంగిమలో కూర్చున్న భర్త, ఇద్దరు పిల్లలు కనపడ్డారు. ‘కళ్లెందుకు మూసుకున్నారు?’ అంది ఆశ్చర్యంగా.‘తెరిస్తే నువ్ కనడతావని’ అన్నాడు ఆయన నెమ్మదిగా. ‘నేను కనపడడమేంటి?’ మళ్లీ ఆశ్చర్యం ఆమెలో.‘ఇందాకే అన్నావ్‌గా మా ఎవ్వరికీ కనపడకుండా పోతే బాగుండు అని. నువ్వు వెళ్లడం ఎందుకు మేమే కళ్లు మూసుకుంటే సరిపోతుంది కదా అని.. ’ అన్నాడు. ఏం చేయలేక ‘నా ఖర్మ’ అంటూ తల కొట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది ప్రసూన. ‘దీనికి సంసారసారం ఎన్నటికీ బోధపడదు పాపం... వెర్రిది’ అని నిట్టూర్చింది అత్తగారు.
సినిమాలో సంసారం
సినిమా: దిల్
నా కొడుకును ఎందుకండీ తిట్టి పోసుకుంటారు... అని భర్తను విసుక్కుంటుంది.చలపతిరావు ఓ బాధ్యత గల తండ్రి. ఆయనకు తగిన ఇల్లాలు సుధ. వారి ముద్దుల తనయుడు నితిన్(శీను) కాలేజీ కుర్రాడు. చలపతిరావుకు గుడికి వెళ్లడం అలవాటు. ఓ రోజు గుడికి వెళదామని చలపతిరావు, సుధ, వేణుమాధవ్(శీనుకి మేనమామ)... ఎదురు చూస్తుంటారు. సాయంత్రం ఐదు గంటలైనా నితిన్ ఇంటికి రాడు. అప్పుడు... ఆ కోపాన్ని భార్యపై ప్రదర్శిస్తుంటాడు చలపతిరావు. ‘వెధవ.. వెధవన్నర వెధవ.. ఎక్కడ తగలెడ్డాడే వీడు. అస్సలు మనకు గుడికి వెళ్లే యోగం ఉందా? లేదా? ఇవ్వాళ. పనికిమాలిన వెధవ’ అని చలపతిరావు తిట్ల దండకం అందుకుంటాడు. ‘ఎందుకండీ నా కొడుకును అలా తిట్టి పోసుకుంటారు?’ అంటుంది సుధ. ‘తిట్టక, ముద్దెట్టుకోమంటావా? గుడికి వెళదామని నాలుగు గంటలకు బట్టలు వేసుకుని కూర్చున్నా.. ఇప్పుడు ఐదైంది’ కోపంతో అరుస్తాడు చలపతిరావు. ‘ఇంకో గంట ఆగితే ఆరవుద్ది బావా’ బదులిస్తాడు వేణు. ‘ఇంకో రెండు గంటలు ఆగితే ఏడవుద్ది. అప్పుడు గుడి కూడా మూసేస్తారు.
అసలు ఎక్కడికి వెళ్లాడురా వీడు?’ ప్రశ్నిస్తాడు చలపతి. వాడికి తెలీదని అంటున్నాడుగా బదులిస్తుంది సుధ. ‘అయితే నీకు తెలుసన్నమాట. ఎక్కడికి వెళతానని చెప్పాడు?’ భార్యని ప్రశ్నిస్తాడు చలపతి. ‘బయటికి వెళ్లేటప్పుడు ఎక్కడికి? అని అడగకూడదని మీరే కదండీ చెప్పారు?’ జవాబిస్తుంది సుధ. నాటకాలాడుతున్నారా? అంటూ చలపతి మండిపడతాడు. ‘హమ్మయ్య... వచ్చేశాడు బావా’ వేణు జవాబు. వచ్చాడా? ఆత్రుతగా గుమ్మంవైపు చూసిన చలపతి ‘ఏడిరా వచ్చాడన్నావ్?’ అంటాడు. ఏదో నీ తృప్తి కోసం చెప్పా బావా... అనగానే వేణు చెంప చెళ్లుమనిపించిన చలపతి... ‘నీ సంతోషం కోసం కొట్టా’ అంటాడు చలపతి. ‘వాడు డిస్కోకు వెళ్లాడని నేను చెప్పను బావా’ అంటూనే చెప్పేస్తాడు వేణు. ‘డిస్కో కా... వాడికి డబ్బులెక్కడి నుంచి వచ్చినయ్?’ అని భార్య వైపు చూస్తాడు చలపతి. సీన్ కట్ చేస్తే గదిలో మంచం మీద నిద్రపోతూ కనిపిస్తాడు నితిన్.
‘డిస్కో కా.. వాడికి డబ్బులెక్కడి నుంచి వచ్చినయ్?’
సినిమా: అతడు
బ్రహ్మానందం మహా గడసరి. హేమ అమాయకురాలు. భర్త మాటంటే వేదం. తను ఏం చెప్పినా ఇలా చిటికెలో చేసేస్తుంటుంది. ఆ కంగారులో ఒక్కోసారి నోరు జారుతుంటుంది. ఆ మాటలకు బ్రహ్మానందం ఆమెను విసుక్కుంటుంటాడు. వేసవి సెలవులు కావడంతో హేమ పుట్టింటికి వచ్చి ఉంటుంది. బ్రహ్మానందం కూడా అత్తారింటికొస్తాడు. భర్త ఇంటికి రాగానే... ‘రేపొస్తానన్నారు?’ అంటుంది హేమ. ‘రైల్వేస్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్‌పై పడుకుని రేపొస్తా’ అని భార్యపై విసుక్కుంటాడు బ్రహ్మీ. ‘ఎందుకండీ అంత కోపం...’ అని అతడిని బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది హేమ. ‘కోప్పడక.. ఇంట్లో అన్ని కార్లు పెట్టుకుని అల్లుడి కోసం కనీసం ఒక్క కారైనా స్టేషన్‌కి పంపలేరా?’ అని మండిపడతాడు బ్రహ్మానందం. ‘స్నానానికి వేడి నీళ్లు పెట్టి కాఫీ తీసుకురా’ అని ఆర్డరేస్తాడు భార్యకి. కాఫీ తీసుకొస్తుంది హేమ. ‘సాసర్ ఏదే? అంటే సెకండ్ డే కదా అని తీసేశారా? రేపటి నుంచి కాఫీ అడిగితే అడుక్కునేవాడికి పోసినట్లు దోసిట్లో పోస్తారా?’ చిర్రుబుర్రులాడతాడు బ్రహ్మీ. సాసర్ తెద్దామని లోనికి వెళ్లబోతుంది హేమ.
‘ఎక్కడికి? దీన్ని(కాఫీ కప్పు) ఏం చేయమంటావ్? నువ్వొచ్చే వరకు ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్లు ఇలా పట్టుకుని నిలబడనా?’ అని మండిపడతాడు. ‘ఇవ్వండి’ అని కప్పు తీసుకుంటుంది హేమ. ‘విసుక్కుంటున్నావేంటే?’ అంటాడు బ్రహ్మీ. నేనా? అని హేమ అనగానే, మరి నేనా? అని ప్రశ్నిస్తాడు. దీంతో నోటిపై చేయి పెట్టుకుని ఇంటిలోకి వెళ్లి మళ్లీ కాఫీ తెచ్చిస్తుంది. క్వశ్చన్ మార్కుతో చూస్తాడు. ‘సాసర్ ఉంది కదండీ’ అని హేమ అనగానే... ‘సాసర్‌లో కప్పు, కప్పులో కాఫీ ఉంటే సరిపోద్దా? వేడిగా ఉండక్కర్లేదా?’ అని దబాయిస్తాడు. వేడి చేసి తెస్తానండి అంటుంది హేమ. ఇలాంటి భర్తలు సినిమాలోనే కాదు మన చుట్టూ కూడా కనిపిస్తారు.
‘సాసర్‌లో కప్పు.. కప్పులో కాఫీ ఉంటే సరిపోద్దా? వేడిగా ఉండక్కర్లేదా?’
– సరస్వతి రమ