టైటిల్ : స్పైడర్
జానర్ : క్రైమ్ థ్రిల్లర్
తారాగణం : మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జే సూర్య, ప్రియదర్శి, భరత్
సంగీతం : హారిష్ జయరాజ్
దర్శకత్వం : ఏఆర్ మురుగదాస్
నిర్మాత : ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు, మంజుల స్వరూప్
బ్రహ్మోత్సవం లాంటి భారీ డిజాస్టర్ తరువాత మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా స్పైడర్. ఈ సినిమాతో మహేష్ తొలిసారిగా కోలీవుడ్ లో అడుగుపెడుతుండటంతో స్పైడర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సూపర్ స్టార్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటంతో పాటు సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతుండం స్పైడర్ మీద అంచనాలను భారీగా పెంచేసింది. మరి ఆ అంచనాలను స్పైడర్ అందుకుందా..? బ్రహ్మాత్సవం తో డీలా పడిపోయిన సూపర్ స్టార్ అభిమానులు స్పైడర్ తో ఖుషీ అయ్యారా..?
కథ :
శివ (మహేష్ బాబు) ఇంటలిజెన్స్ బ్యూరోలో కాల్ టాపింగ్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తుంటాడు. తన అర్హతలకు అంతకన్నా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నా.. క్రైమ్ జరగటానికి ముందే ఆపే అవకాశం ఉండటంతో అదే ఉద్యోగాన్ని కోరి మరీ చేస్తుంటాడు. అలా ఎంతో మంది ఇబ్బందుల్లో పడకుండా ముందే తెలుసుకొని కాపాడతాడు. అయితే ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో ఉండగా ఆ అమ్మాయితో పాటు శివ స్నేహితురాలు కూడా హత్యకు గురవుతుంది. (సాక్షి రివ్యూస్)
ఆ హత్యకు కారణం ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో శివకు భయం కలిగించే నిజాలు తెలుస్తాయి. శాడిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అనే వ్యాదితో ఇబ్బంది పడే సైకో భైరవుడు (యస్ జే సూర్య) చిన్నతనం నుంచి ఎవరైన ఏడుస్తుంటే వారిని చూసి ఆనందపడటం భైరవుడి జబ్బు. అందుకోసం తానే హత్యలు చేయటం మొదలుపెడతాడు. చనిపోయిన వారి చుట్టూ జనం చేరి ఏడుస్తుంటే వారిని చూసి ఆనంద పడతుంటాడు.
ఇలా వరుస హత్యలు చేస్తున్న భైరవుడు.. హైదరాబాద్ లో ఓ భారీ వినాశనానికి ప్లాన్ చేస్తాడు. భైరవుడు చేయాలనుకున్న వినాశనం ఏంటి..? ఆ ప్రమాదం నుంచి నగరాన్ని శివ కాపాడగలిగాడా..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటలిజెన్స్ అధికారిగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్ ఎమోషనల్ ఎపిసోడ్స్ లో మహేష్ నటన అద్భుతమనే చెప్పాలి. అయితే సినిమా అంతా సీరియస్ మూడ్ లో సాగటంతో మహేష్ మార్క్ ఎంటర్ టైన్మెంట్ ఆశించే వారికి మాత్రం నిరాశ తప్పదు. హీరోయిన్ గా రకుల్ ప్రీత్ ఆకట్టుకుంది. నటనకు పెద్దగా అవకాశం లేకపోయినా.. ఉన్నంతలో తనదైన నటనతో మెప్పించింది. పూర్తి యాక్షన్ జానర్ సినిమా కావటంతో ఆడియన్స్ కు రకుల్ గ్లామర్ రిలీఫ్ అనిపించటం ఖాయం. విలన్ గా ఎస్ జే సూర్య విశ్వరూపమే చూపించాడు. సైకోగా సూర్య నటన తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పిస్తుంది.
సాంకేతిక నిపుణులు :
కమర్షియల్ సినిమాతోనూ స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వటంలో తనకు తిరుగులేదని దర్శకుడు మురుగదాస్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. తొలిసారిగా సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేసిన మురుగదాస్, మహేష్ ను స్టైలిష్ కాప్ గా చూపించాడు. అయితే తెలుగునాట మహేష్ ఇమేజ్ కు తగ్గ కథా కథనాలను ఎంపిక చేయటంలో తడబడ్డాడు. మహేష్ ను కోలీవుడ్ లో గ్రాండ్ గా లాంచ్ చేయటంలో మాత్రం మురుగదాస్ సక్సెస్ సాధించాడు. తొలి భాగం కాస్త స్లో అయినా.. ద్వితీయార్థం మాత్రం యాక్షన్ ఎపిసోడ్స్, ట్విస్ట్ లతో కథను పరిగెత్తించాడు. అయితే ఎక్కువ భాగం సినిమా తమిళ నేటివిటికి తగ్గట్టుగా తెరకెక్కించటం కాస్త నిరాశపరుస్తుంది. హారిష్ జయరాజ్ అందించిన పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా.. విజువల్ గా బాగున్నాయి. (సాక్షి రివ్యూస్) బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మాత్రం హారిష్ మ్యాజిక్ చేశాడనే చెప్పాలి. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫి సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్. యాక్షన్ సీన్స్ లో సినిమాటోగ్రఫి సూపర్బ్. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
మహేష్, యస్ జే సూర్యల నటన
యాక్షన్ ఎపిసోడ్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్
తెలుగు నేటివిటి పెద్దగా కనిపించకపోవటం
- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్