
సాక్షి, హైదరాబాద్ : నిశ్చితార్ధంతో కొత్త జీవితానికి శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ను వేధిస్తూ ట్రోలింగ్ చేసిన పవన్ అభిమానులపై శ్రీరెడ్డి విరుచుకుపడ్డారు. రేణూకు బాసటగా నిలుస్తూ పవన్ అభిమానులపై ధ్వజమెత్తారు. ‘ఆమె (రేణూ దేశాయ్) చాలా చిన్న వయసులో విడాకులు తీసుకున్నారు.. దానికి కారణాలేంటనే దానిపై మనం మాట్లాడాల్సిన అవసరం లేదు..ఆమె వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు మనకు లేద’న్నారు. కొందరు ట్విటర్‌లో కనీసం తమ పేరు, ఫోటో లేకుండా నకిలీ అకౌంట్లతో ఆమెను వేధిస్తున్నారని మండిపడ్డారు.
ఆమెను వేధింపులకు గురిచేసేందుకు మీరెవరని ప్రశ్నించారు. పూణేలో ఆమె ఒంటరిగా పిల్లల్ని పెంచుతున్నారని, ఆమె ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో ఎవరికైనా తెలుసా అని నిలదీశారు. ఆమె బాధల్లో ఉన్నప్పుడు ఎవరైనా మద్దతుగా నిలిచారా అని ప్రశ్నించారు. ఆమెకు సాయం చేయనప్పుడు ఆమె వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరని మండిపడ్డారు.
పవన్ అభిమానులు వారి స్టార్‌ను అభిమానించుకోవచ్చని, అయితే వ్యక్తిగత విషయాల్లో ఇతరులను ఇబ్బంది పెట్టడం తగదని సూచించారు. కాగా సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై పోలీస్ స్టేషన్, న్యాయస్ధానాలను ఆశ్రయించాలని పవన్ కళ్యాణ్ గతంలో శ్రీరెడ్డికి సూచించిన క్రమంలో ఆమె పవర్‌స్టార్‌పై విరుచుకుపడిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment