శ్రీదేవిని బోనీ కపూర్ భార్యగానే చూస్తాను
కుటుంబాన్ని, తల్లిని విస్మరించి... తండ్రి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే, అది నిజంగా తనయుడికి నరకమే. దీనికి బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ మినహాయింపేం కాదు. తన తల్లి మోనాకపూర్‌ని వదిలి తన తండ్రి బోనీకపూర్, శ్రీదేవిని పెళ్లి చేసుకోవడం ఇప్పటికీ అర్జున్ కపూర్‌కి వ్యథకు గురి చేస్తూనే ఉంది. ఇటీవల కరణ్ జోహార్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో బోనీ కపూర్‌తో ఉన్న విభేదాలను అర్జున్ ప్రస్తావించారు. ఇందులో భాగంగా తన పినతల్లి శ్రీదేవి గురించి మాట్లాడుతూ... ఆమె అంటే తనకు ఇష్టమే కాకుండా గౌరవం కూడా అని, తనను తండ్రి బోనీకి చేరువచేయడం కోసం శ్రీదేవి చేసిన ప్రయత్నాలు నిజంగా ప్రశంసనీయమని అర్జున్ అన్నారు.
చిన్నతనంలో తన తల్లితో కాకుండా... పినతల్లి శ్రీదేవి కుటుంబంతో కలిసి సెలవుల్ని గడపిన రోజుల్ని గుర్తు చేసుకుంటే ఆవేదనగా ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా అర్జున్ అన్నారు. శ్రీదేవి అంటే... ఇప్పటికీ తన మనసులో ప్రత్యేక స్థానం ఉందని.. అయితే ఆమెను బోనీ కపూర్ భార్యగానే చూస్తానని అర్జున్ కపూర్ వెల్లడించారు. తన తల్లి మోనా మరణం తర్వాత తన బాధ్యతల్ని, కెరీర్‌నీ చక్కదిద్దడంలో శ్రీదేవి చాలా శ్రమించిందన్నారు. ‘ఇష్క్‌జాదే’ చిత్రం ద్వారా అర్జున్ కపూర్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమైన సంగతి తెలిసిందే.